శ్రీమతి స్వప్న సమర్పణలో స్వాజిత్ మూవీస్ బ్యానర్ లో నాగశౌర్య, బేబి షామిలి జంటగా సుందర్ సూర్య దర్శకత్వంలో కె.ఆర్ సహా నిర్మాతగా రాజేష్ నిర్మించిన `అమ్మమ్మగారిల్లు` చిత్రం శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. చక్కని కుటుంబ కథా చిత్రం…స్వచ్ఛమైన తెలుగు అనుబంధాలను గుర్తిచేసే సినిమా కావడంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అన్ని సెంటర్స్ లోను పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా శనివారం ఉదయం చిత్ర దర్శకుడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ…
**`నాది కాకినాడ. 12 ఏళ్ల నుంచి ఇండస్ర్టీలో ఉంటున్నాను. దర్శకులు ఎన్. శంకర్, `బొమ్మరిల్లు` భాస్కర్ తో పాటు పలువురు దర్శకుల వద్ద పనిచేసాను. నాలుగేళ్ల క్రితం కథ సిద్ధం చేసుకుని ఆఫీసులు చుట్టూ తిరిగాను. చివరికి సెన్సుబుల్ నిర్మాతలు కె.ఆర్, రాజేష్ రెండేళ్ల క్రితం పరిచయం అయ్యారు. తర్వాత కథ డెవలప్ చేయమని టీమ్ ని ఇచ్చారు. హీరోగా నాగశౌర్య గారు అయితే బాగుంటుందని సలహా ఇవ్వడంతో నిర్మాతలు కూడా ఒకే చేసారు. వెంటనే నాగశౌర్య గారిని కలవడం కథ చెప్పడం ఆయన వెంటనే ఒకే చేయడం జరిగింది. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. నాగశౌర్య ఇప్పటివరకూ ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ స్టోరీ చేయలేదు. `కళ్యాణ వైభోగమే` చేసినప్పటికీ …అది పుల్ లెంగ్త్ కుటుంబ కథా చిత్రం కాకపోవడంతో , నా కథ బాగా నచ్చడంతో చేసారు.
**నేను కథను ఎంత బలంగా నమ్మానో నా నిర్మాతలు అంతే నమ్మారు. షూటింగ్ అంతా రామోజీ ఫిలిం సిటీలో చేసాం. అన్నవరం లో రెండు రోజులు షూట్ చేస్తాం. మొత్తం 60 రోజుల్లో షూటింగ్ పూర్తిచేసాం. బడ్జెట్ విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీ పడలేదు. నేను అడిగిందల్లా క్షణాల్లో ఏర్పాటు చేసారు. అంత పాజిటివ్ గా ఉన్నారు కాబట్టే మంచి సినిమా తీయగలిగాను. ఇలాంటి మంచి నిర్మాతలతో దర్శకుడిగా పరిచయం కావడం సంతోషంగా ఉంది. వాళ్లకు సినిమాలంటే చాలా ఫ్యాషన్. భవిష్యత్త్ లో మరిన్ని మంచి సినిమాలు తీయాలి.
**చిన్నప్పటి నుంచి నాకు ఫ్యామిలీతో అనుబంధం ఎక్కువ. ఉమ్మడి కుటుంబం విలువలు తెలిసిన వాడిని. అనుబంధాలు, ఆప్యాయతలు బాగా ఇష్టం. ఆ ప్రభావం నాపై ఎక్కువగా ఉంది. మానవ బంధాలు ఎప్పటికీ గొప్పగా ఉంటాయి. నా వ్యక్తిగత జీవితంలో ఉన్న తీపి జ్ఞాపకాలు..నిజ జీవితంలో చూసిన కొన్ని పాత్రలను కూడా కథలో భాగం చేసా. నా కుటుంబంలో పేర్లను కొన్ని క్యారెక్టర్లకు పెట్టాను. ఫ్యామిలీ డ్రామాతో పాస్ అయిపోతానన్న ఉద్దేశంతో సినిమా చేయలేదు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేయాలని ఎంతో ఇష్టపడి చేసాను.
**షాలిని పక్కింటి అమ్మాయి లా ఉంటుందనే ఆమెను తీసుకున్నా. చాలా బాగా నటించింది. నాగశౌర్య బాగా నటించారు. షకలక శంకర్ పాత్రను ఎలా రాసుకున్నానో? అంతకు మించిన పెర్పామెన్స్ ఇచ్చాడు. మిగతా అన్ని పాత్రలు కూడా సినిమాకు ప్రాణం పోసాయి. అందువల్లే సినిమాకు మంచి టాక్ వస్తోంది. కళ్యాణ్ రమణ రెండు పాటలకు మంచి సంగీతం అందిచారు. కథతో పాటే పాటలు సాగుతాయి. కధ జెన్యూన్ గా నడిపించాలనే రెండు పాటలతో సరిపెట్టా. ఆర్. ఆర్ కు సాయి కార్తీక్ ప్రాణం పోసాడు. డైలాగ్ లు నేనే రాసుకున్నాను. ఆ విషయంలో రాజేష్-చరణ్ నాకు బాగా సహకరించారు. రసూల్-జెపీల పనితనం ప్రశంసనీయం. వాళ్లిద్దరితో పనిచేయడంతో నా పని తేలికైంది.
**రావు గోపాలరావు కంటే రావు రమేష్ గారి మీదనే అభిమానం ఎక్కువ. ఆయన నటన బాగా నచ్చుతుంది. క్యారెక్టర్ కు ఎవర్నీ దృష్టిలో పెట్టుకోలేదు. ఆ పాత్రకు ఆయన అయితేనే న్యాయం చేస్తాడని తీసుకున్నాను. పాత్ర చెప్పగానే వెంటనే ఒకే చేసారు.
**నిర్మాతలు సినిమా ప్రచారం కోసం ఏమాత్రం ఆలోచించలేదు. పీ.ఆర్.ఓ సురేష్ కోండేటి గారు మా సినిమా కోసం రేయింబవళ్లు కష్టపడ్డారు. అహర్నిశలు శ్రమించారు. అందువల్లే మా సినిమా ప్రేక్షకులందరికీ చేరువైంది.
** నా స్నేహితులు సినిమా రిలీజ్ కు ముందే కాకినాడలో నా బ్యానర్లు కట్టేసారు. హిట్ కాకముందే హడావుడి ఎందుకన్నా. కానీ వాళ్లు మాట వినలేదు. అది వాళ్ల అభిమానం. దేవుడు దయవల్ల సినిమా కూడా హిట్ అయింది. చాలా సంతోషంగా ఉంది.
** లవ్ స్టోరీ, కమర్శియల్ సినిమా, ఫ్యాక్షనిజం స్టోరీల లైన్స్ ఉన్నాయి. నిర్మాతలకు ఏ జానర్ కథ నచ్చితే అదే చేస్తా. రెండవ సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. కొంత మంది ఫోన్ చేసి అడుగుతున్నారు. కానీ ఈ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్నా. ఈ హడావుడి తర్వాత రెండవ సినిమా వివరాలు తెలుపుతా అని అన్నారు.