సినీవినోదం రేటింగ్ : 3/5
స‌్వాజిత్ మూవీస్ పతాకం పై సుందర్ సూర్యరచన, దర్శకత్వం లో రాజేశ్ ఈ చిత్రాన్ని నిర్మించారు
రంగారావు (చలపతి), సీతా మహాలక్ష్మి (సుమిత్ర) లది పిఠాపురంలో ఓ పెద్ద కుటుంబం. వీరికి ఐదుగురు సంతానం. ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. పెద్ద కొడుకు (రావు రమేశ్) తండ్రిని ఆస్తి పంచమని అడుగుతూ ఉంటాడు. ఆస్తి కంటే అనుబంధాలు గొప్పవి, ఆస్తిని విడగొడితే అందరూ దూరమవుతారని కొడుక్కు నచ్చజెపుతాడు తండ్రి. కానీ బాబురావు(రావు రమేశ్) వినడు. అలా ఓసారి జరిగిన గొడవలో ఆ ఇంటి పెద్దల్లుడు (సుమన్)పై చేయిజేసుకుంటాడు బాబురావు. ఆ అవమానంతో సుమన్ తన మామగారి కుటుంబానికి దూరంగా ఉంటారు. అల్లుడు గారికి జరిగిన అవమానం, కొడుకు ఆస్తి కోసం చేసే అల్లరితో చలపతి చనిపోతాడు. కొడుకులు, కూతుళ్లు అందరూ సీతామహాలక్ష్మిని ఒంటరిగా వదిలేసి వెళ్లిపోతారు. చిన్నప్పటి నుంచి సుమన్ కొడుకు సంతోష్ కు మాత్రం అమ్మమ్మ అంటే చాలా ఇష్టం. అయితే ఈ గొడవలన్నింటికి కారణమైన ఆస్తిని సీతామహాలక్ష్మి పంచేద్దామని అందరినీ పిలుస్తుంది. తిరిగి వీరంతా అలా కలుసుకుంటారు. వీరి మధ్య అనుబంధాలు నెలకొల్పడానికి సంతోష్ ఏం చేసాడన్నది సినిమాలో చూడాలి….
‘డబ్బు కంటే మనుషులే ముఖ్యం’ అనే మెసేజ్ తో డైరెక్టర్ సుందర్ సూర్య ఈచిత్రం చేసారు. ఈ బిజీ లైఫ్‌లో మనం కోల్పోతున్న కుటుంబ విలువలను గుర్తు చేసే సినిమా ఇది. అమ్మమ్మ, కూతుళ్లు, కొడుకులు, మనవలు చుట్టూ కథ తిరుగుతుంది. ఓ పల్లెటూరులో అందమైన ఇల్లు…వివిధ స్వభావాలు గల పాత్రలు. ప్రతీ పాత్రను చాలా చక్కగా డిజైన్ చేసుకున్నాడు దర్శకుడు. ఒక్కో పాత్రకు ఒక్కో ప్రత్యేకత..స్వభావం గలవి. ఆ పాత్రలను ప్రేక్షకుడు కనెక్ట్ అయ్యేలా సన్నివేశాలను రాసుకున్న తీరు..వాటిని తెరపై ఆవిష్కరించిన విధానం అత్యద్భుతంగా ఉంది. పాత్రల మధ్య సంఘర్షణలను దర్శకుడు చాలా కనెక్టివ్..కన్వెన్సింగ్ గా చెప్పాడు. ముఖ్యంగా రావు రమేష్ , నాగశౌర్య పాత్రలను మలిచిన విధానం సినిమాకు హైలైట్ గా ఉంటుంది.గతంలో ఇలాంటి కాన్సెప్ట్ తో చాలా సినిమాలే వచ్చాయి. కథలో కొత్తదనం లేక పోయినా… దర్శకుడు సుందర్ సూర్య సినిమాను అందంగా తీశాడు. కథకి ప్రేక్షకుడికి కనెక్ట్ చేయడంలో సఫలం అయ్యారు. భావోద్వేగాలు, కామెడీ ప్రేక్షకులకు నచ్చుతాయి. కొన్ని పదునైన మాటలతో మనసును తాకేలా చేశారు డైరెక్టర్ సుందర్ సూర్య. బరువైన బంధాలను అంతే అర్ధవంతమైన సంభాషణలతో నడిపించాడు. సెకండాఫ్‌లో ‘లాక్ ది ఏజ్’ అనే ఎపిసోడ్ కాసేపు నవ్వించి, కాసేపు ఏడిపించేసింది. కథలో ఎక్కువ ట్విస్టులు కనపడవు.. అయితే కొన్ని చోట్ల సినిమా మరీ స్లో గా సాగడం ప్రేక్షకుడికి అసహనం కలిగిస్తుంది.
నాగశౌర్య తెరపై చాలా కొత్తగా కనిపించాడు. పాత్రలో చాలా బ్యాలెన్సింగ్ గా నటించాడు. ఇప్పటివరకూ లవర్ బోయ్ గా మెప్పించిన నాగశౌర్య ఈ సినిమాతో మంచి ఫ్యామిలీ హీరో అయిపోయాడు.నాగశౌర్య తన పాత్రలో ఒదిగిపోయాడు. తన కామెడీ టైమింగ్ కూడా బావుంది. చాలా ఏళ్ల తర్వాత షామిలి తెలుగులో హీరోయిన్‌గా నటించిన చిత్రమిది. కాస్త యారగేంట్‌గా కనపడే నాగశౌర్య మరదలి పాత్రలో షామిలి చక్కగా నటించింది. రావు రమేష్ పాత్ర సినిమాకు హైలైట్ గా ఉంటుంది. నటుడిగా రావు రమేష్ ను మరో మెట్టు పైకి ఎక్కించిన సినిమా. శకలక శంకర్ కామెడీ సినిమాకు బాగా కలిసొస్తుంది. కథ ఒకే ప్లోలో వెళ్తున్న శంకర్ కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది.ఎమోషనల్ ట్రాక్‌లో రావు రమేశ్ నటన మెప్పిస్తుంది. అమ్మమ్మగా చేసిన సుమిత్ర కంటతడి పెట్టించారు. శివాజీరాజా, సుధ, మధుమణి, హేమ, రవిప్రకాశ్, గౌతంరాజు, షకలక శంకర్ అందరూ వారి పాత్రలకు న్యాయం చేశారు.
కల్యాణ రమణ సంగీతం, సాయికార్తీక్ నేపథ్య సంగీతం బావుంది. ఉన్న రెండు మూడు పాటలు కూడా అలా కథతో పాటు వచ్చి వెళ్తాయి. రసూల్ కెమెరా పనితనం ప్రశంసనీయం. ప్రతీ సన్నివేశాన్ని చాలా అందంగా చూపించారు. అక్కడక్కడా ఎడిటింగ్ లోపాలున్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి– రవళి