సినీవినోదం రేటింగ్ :1.5/5
ఎస్.ఆర్.టి.ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై కల్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం లో రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.
‘నేలటిక్కెట్టు’గాడు(రవితేజ) ఓ అనాథ. హైదరాబాద్‌లో తన స్నేహితులతో కలిసి ఉంటాడు. అనాథ కావడంతో ప్రతి ఒక్కరినీ ఏదో ఒక బంధంతో పిలుచుకుంటూ ఉంటాడు. ఓ సందర్భంలో డాక్టర్ కోర్సు చదువుతున్న మాళవిక(మాళవికా శర్మ)ను చూసి ప్రేమలో పడతాడు. మరోవైపు ఆనంద్ భూపతి(శరత్‌బాబు) చాలా మంచి వ్యక్తి. అనాథల కోసం ఆనంద నిలయంను నిర్మించాలనుకుంటాడు. అది అతని జీవితాశయం. మరో ఆశ తన కొడుకు అజయ్ భూపతి(జగపతిబాబు)ని మంత్రిగా చూడాలనుకుంటాడు. ఆనంద్ భూపతి కొడుకు కావడంతో అజయ్ ఎలక్షన్స్‌లో గెలిచి.. మంత్రి అవుతాడు. ఓరోజు అజయ్ భూపతి కారుపై టెర్రరిస్ట్ ఎటాక్ జరుగుతుంది. ఆ ఎటాక్‌లో అజయ్ భూపతి తప్పించుకుంటాడు. కానీ ఆనంద భూపతి చనిపోతాడు. ఆనంద భూపతి టెర్రరిస్ట్ ఎటాక్ వల్ల చనిపోలేదని.. ప్లానింగ్ ప్రకారం జరిగిన మర్డర్ అని తెలుస్తుంది. అదే సమయంలో నేలటిక్కెట్టుకి, హోమ్ మినిష్టర్‌కి మధ్య గొడవలు జరుగుతాయి. అసలు ఈ గొడవలకు కారణం ఏంటి? ఇద్దరి మధ్య సంబంధం ఏంటి? ఆనంద భూపతి హత్య వెనుక కారణమేంటి? నేలటిక్కెట్ చివరకు ఎలా గెలుపు సాధించాడు..? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…..
మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న రవితేజ హీరోగా … ‘సోగ్గాడే చిన్ని నాయనా’,’ రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాలతో విజయాలు సాధించిన కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో కమర్షియల్ కథతో ఈ చిత్రం చేసారు . హీరో పాత్ర ద్వారా ‘ చుట్టూ జనం మధ్యలో మనం అనే ‘ అనే సోషల్ మెసేజ్ ఇవ్వడం బాగుంది. ఫస్ట్‌హాఫ్ అంతా అసలు కథను మొదలు పెట్టకుండా సరదా సన్నివేశాలతో లాగేయటం, ఆ సన్నివేశాల్లో రవితేజ మార్క్ కామెడీని పండించలేకపోవటంతో ఆడియన్స్‌ను ఇబ్బంది పెడుతుంది. సెకండ్ హాఫ్‌లో అసలు కథ మొదలైనా కథనంలో వేగం లేకపోవటం నిరాశపరుస్తుంది. ఒక్కో సన్నివేశం ఎందుకు చూస్తున్నామో, ఏది ఎక్కడ ఎందుకు వస్తుందో కూడా అర్థం కానట్టుగా కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంది. హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ అయితే ఏమాత్రం అలరించలేకపోయింది. బలమైన పాత్రలు, సన్నివేశాలు అస్సలు కనిపించవు. హీరో రవితేజ నటన , ఇంటర్వెల్ బ్లాక్, కొన్ని కామెడీ సన్నివేశాలు మినహా చిత్రం మొత్తం బోర్ కొట్టించేస్తుంది.
హీరో రవితేజ తనదైన ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ తో సినిమాను నడిపించే ప్రయత్నం చేశాడు. కామెడీ టైమింగ్‌తో పాటు రొమాన్స్, ఫైట్ సీన్స్ బాగానే రక్తి కట్టించాడు . అయితే రవితేజ ఎనర్జీని పూర్తి స్థాయిలో వాడుకునే బలమైన సన్నివేశాలు లేకపోవటం నిరాశకలిగిస్తుంది. హీరోయిన్గా పరిచయం అయిన మాళవికా శర్మ లుక్స్ పరంగా ఆకట్టుకున్నా , నటిగా మెప్పించలేకపోయింది. విలన్‌గా జగపతి బాబు మరోసారి తనకు అలవాటైన పాత్రలో కనిపించారు . ఆలీ, ప్రవీణ్, సంపత్ రాజ్, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, తనికెళ్ల భరణి, జయ ప్రకాష్ రెడ్డి, పృథ్వి, ప్రియదర్శి ఇలా మంచి నటీనటులు ఉన్నా, ఎవరికీ బలమైన సన్నివేశాలు లేవు .
‘ఫిదా’ సినిమా విజయంలో తన వంతు పాత్ర పోషించిన సంగీత దర్శకుడు శక్తికాంత్ కార్తీక్ ఇందులో మెప్పించలేక పోయాడు. పాటలైతే అస్సలు వినదగినవిగా లేవు. నేపథ్య సంగీతం కూడా సోసోగా ఉంది. ముకేష్. జి సినిమాటోగ్రఫి బాగుంది. చోటా.కె.ప్రసాద్ తన ఎడిటింగ్ ద్వారా అనవసరమైన చాలా సన్నివేశాలను తొలగించాల్సింది. రామ్ తాళ్లూరి నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి – ధరణి