ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక చలన చిత్రోత్సవంగా భావించే కేన్స్ ఫెస్టివల్లో జపాన్‌కు చెందిన ఫ్యామిలీ డ్రామా చిత్రం ‘షాప్‌లిఫ్టర్స్’ గోల్డెన్ పామ్ (పాల్మె డి ఓర్)పురస్కారం కైవసం చేసుకుంది. సినీ విశ్లేషకుల అంచనాలను తలక్రిందులు చేస్తూ, ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమా విజేతగా నిలవడం అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. గోల్డెన్ పామ్ తర్వాత ఆ స్థాయిలో ప్రఖ్యాతి గాంచిన గ్రాండ్ ప్రిక్స్ అవార్డును అమెరికన్ క్రైమ్ కామెడీ డ్రామా చిత్రం ‘బ్లాక్క్లాన్స్మన్’ సొంతం చేసుకుంది. ఇక అందరూ ఊహించినట్టుగానే ‘కోల్డ్‌వార్’ చిత్రానికిగానూ పావెల్ పావ్లికోవిస్కీ ఉత్తమ దర్శకుడిగా అవార్డునందుకున్నారు. కజకిస్తాన్ నటి సామల్ యెస్ల్యామోవా ‘ఐకా’ చిత్రానికి ఉత్తమ నటిగా నిలిచారు. అలాగే ఉత్తమ నటుడిగా ‘డాగ్మన్’ చిత్రంలో నటించిన మార్సెల్లో ఫోంటా అవార్డు కైవసం చేసుకున్నారు. వీటితోపాటు జ్యూరీ అందించే ప్రైజ్‌ను ‘కపెర్నమ్'(నడినే లబాకి) చిత్రానికి దక్కింది. మొత్తంగా 71వ కేన్స్ ఫెస్టివల్లో ఊహించని చిత్రాలకు అవార్డులు రావడం నిష్పక్షపాతంగా అవార్డుల ఎంపిక జరిగినట్టు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
71వ కేన్స్ విజేతల వివరాలు…
ప్రధాన కాంపిటీషన్ విభాగంలో..
పాల్మె డి ఓర్ (గోల్డెన్ పామ్) : షాప్‌లిఫ్టర్స్ (హిరోకాజు కోరె ఎడా)
గ్రాండ్ ప్రిక్స్ : బ్లాక్క్లాన్స్మన్ (స్పైక్‌లీ)
ఉత్తమ దర్శకుడు : పావెల్ పావ్లికోవిస్కీ (కోల్డ్‌వార్)
ఉత్తమ నటుడు : మెర్సెల్‌లో ఫోంటా (డాగ్మన్)
ఉత్తమ నటి : సామల్ యెస్ల్యామోవా (ఐకా)
ఉత్తమ స్క్రీన్‌ప్లే : ఆలిస్ రోర్వాచెర్ (హ్యాపీ యాజ్ లజ్జారో), జఫర్ పానాహి (3 ఫేసెస్)
జ్యూరీ ప్రైజ్ : కపెర్నమ్ (నడినె లబాకి)
స్పెషల్ పాల్మె డి ఓర్ : ది ఇమేజ్ బుక్ (జీన్ లుస్ గోడార్డ్)
అన్ సర్టెన్ రిగార్డ్ సెక్షన్లో..
ఉత్తమ చిత్రం : బార్డర్ (అలా అబ్బాసి)
జ్యూరీ ప్రైజ్ : ది డెడ్ అండ్ ది అదర్స్ (జోవో సాలేవిజా, రెనె నడెర్ మెస్సోరా)
ఉత్తమ దర్శకుడు : సెర్గీ లోజ్నిస్టా (డాన్బ్యాస్)
ఉత్తమ నటుడు : విక్టర్ పోల్స్టర్ (గర్ల్)
ఉత్తమ స్క్రీన్‌ప్లే : బెన్మ్ బార్క్ అలోయిసి (సోఫియా)
ఇతర ప్రముఖ అవార్డులు..
కెమెరా డి ఓర్ : లాకాస్ దోంట్ (గర్ల్)
డాక్యుమెంటరీ ఫిల్మ్ అవార్డు : సమౌని రోడ్ (స్టీఫానో సవోనా)
స్పెషల్ మెన్షన్ : లిబ్రె (మైఖెల్ టోయిస్కా), ది ఐస్ ఆఫ్ ఓర్సన్ వెల్లెస్ (మార్క్ కజిన్స్)
సినీఫాండేషన్ అవార్డులు..
ఫస్ట్ ప్రైజ్ : ది సమ్మర్ ఆఫ్ ది ఎలక్రిట్ లయన్(డియెగో సెపెడేస్)
సెకండ్ ప్రైజ్ : క్యాలెండర్ (ఇగోర్ పాప్లోహీన్), ది స్టోర్మ్ ఇన్ అవర్ బ్లడ్ (షెన్ డి)
థర్డ్ ప్రైజ్ : ఇనానిమేట్ (లూసియా బుల్లెరోని)
షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్లో..
పాల్మె డి ఓర్ : ఆల్ థీజ్ క్రీయేటర్స్ (చార్లెస్ విలియమ్స్)
జ్యూరీ స్పెషల్ డిస్టిక్షన్ : ఆన్ ది బార్డర్ (వియి షుజన్)
డైరెక్టర్ ఫోర్ట్‌నైట్ విభాగంలో ఫ్రాన్స్‌కు చెందిన ‘క్లైమాక్స్’
(గాస్పార్ నోయి) అవార్డునందుకుంది.
మెయిన్ కాంపిటీషన్లో కేట్ బ్లాంచెట్ నేతృత్వంలోని జ్యూరీ, అన్ సర్డెన్ రిగార్డ్‌లో బెనిసియో డెల్ టోరో అధ్యక్షతన ఏర్పాటైన జ్యూరీ, కెమెరా డి ఓర్ విభాగంలో ఉర్సులా మెయిర్ ఆధ్వర్యంలోని జ్యూరీ, సినీ ఫాండేషన్, లఘు చిత్రాలకు సంబంధించి బెట్రాండ్ బోనెల్లో అధ్యక్షతన ఏర్పాటైన జ్యూరీ ఈ అవార్డులను ప్రకటించారు. ఈ నెల 8న ప్రారంభమైన 71వ కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 12రోజుల పాటు ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. శనివారంతో ఈ ఉత్సవాలు ముగిశాయి.
భావోద్వేగాలకు ప్రతిరూపం ‘షాప్ లిఫ్టర్స్’..
గోల్డెన్ పామ్ అవార్డులనందుకున్న ‘షాప్‌లిఫ్టర్స్’ చిత్రం ఫ్యామిలీ డ్రామాగా రూపొందింది. టోక్యో నగరంలో ఒసాము, నోబుయో భార్యాభర్తలు. పేదరికంలో మగ్గుతుంటారు. ఒసాముకు తక్కువ టైమ్‌లో ఉపాధి దొరుకుతుంది. ఆయన భార్య నోబుయో చిన్న ఉద్యోగం చేస్తుంటుంది. అయినా ఇల్లు గడవడం కష్టంగా ఉంటుంది. వాళ్ళ అమ్మ పెన్షనే వీరి కుటుంబానికి ప్రధాన ఆధారం. యూరి అనే అనాథ పాపను ఓరోజు కుమారుడు షోటా ఇంటికి తీసుకొస్తాడు. కానీ ఆ పాప కోసం టోక్యో పోలీసులు వెతుకుతుంటారు. ఈ నేపథ్యంలో ఈ కుటుంబం ఏం చేసింది?, పాపను తమతో ఉండేలా వాళ్ళు ఎలాంటి ప్లాన్ చేశారనేది సినిమా. బీద కుటుంబానికి చెందిన వీరంతా ఆనందాలను వెతుక్కోవడం, వారి అనుబంధాలను, భావోద్వేగాలను తెలియజేసేలా దర్శకుడు హిరోకాజు కోరె ఎడా ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తెరకెక్కించారు. ఇందులో ఒసాము పాత్రలో లిలీ ఫ్రాంకీ, నోబుయో పాత్రలో సాకురా ఆండో, షోటా పాత్రలో జ్యో కైరి, యూరి పాత్రలో మయు మట్సుకా తమ నటనతో ప్రేక్షకులను నవ్వించడంతోపాటు భావోద్వేగానికి గురిచేశారు. 1997నుంచి ఇప్పటి వరకు జరిగిన ఫెస్టివల్లో జపాన్‌కు చెందిన సినిమా గోల్డెన్ పామ్ అవార్డునందుకోవడం ఇదే మొదటిసారి. ఈ అవార్డునందుకున్న దర్శకుడు హిరోకాజు కోరె ఎడా సినిమాలో భాగమైన ప్రొడక్షన్ టీమ్ అందరికీ ఈ చిత్రాన్ని అంకితమిస్తున్నట్టు ప్రకటించారు.
ఈ అవార్డును ప్రకటించిన జ్యూరీ అధ్యక్షురాలు కేట్ బ్లాంచెట్ చెబుతూ…. ‘ఈ సినిమాకు, దర్శకుడి విజన్‌కు మేమంతా మంత్రముగ్దులమయ్యాం’ అని తెలిపింది. ప్రత్యేక జ్యూరీ ప్రైజ్ అందుకున్న ‘కపెర్నమ్’ చిత్రానికి మహిళా దర్శకురాలు నడిలె లబాకి దర్శకత్వం వహించడం విశేషం. ఆమె రూపొందించిన గత చిత్రాలు ‘కారామెల్’, ‘వేర్ డు వి గో నౌ?’ కేన్స్‌లో ప్రదర్శితమయ్యాయి. నటిగానూ అనేక విజయ వంతమైన చిత్రాల్లో నటించి మెప్పించారు. కేన్స్ అవార్డుల ప్రకటనకు ముందు క్లోజింగ్ సెర్మనీలో ఇటాలియన్ నటి ఆసియా అర్జెంటో కేన్స్‌లో తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంది. హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ తనపై చేసిన లైంగిక దాడిని ఈ సందర్భంగా ప్రస్తావించింది. ‘1997లో కేన్స్‌లోనే హార్వే వెన్‌స్టీన్ నాపై లైంగిక దాడి చేశాడు. అప్పటికి నా వయసు 21ఏండ్లు. ఈ ఫెస్టివల్ అతనికి వేటాడే గ్రౌండ్‌లాంటిది. అతన్ని ఈ వేడుకకు ఎప్పటికీ ఆహ్వానించవద్దని ఈ సందర్భంగా కోరుతున్నాను’ అని ఆసియా అర్జెంటో తెలిపింది. ఈ సందర్భంగా జ్యూరీ అధ్యక్షురాలు కేట్ బ్లాంచెట్ మాట్లాడుతూ, ‘ఇలాంటి వేదికపై మహిళా దర్శకుల వాయిస్ పెంచాల్సిన అవసరం ఉంది. వారి అభిప్రాయాలను మేం కోరుకుంటున్నాం. మహిళలు మరిన్ని సినిమాలు తీయాలి. కేన్స్ లాంటి ఫెస్టివల్స్‌లో వారంతా తమ ప్రతిభను నిరూపించుకోవాలి’ అని తెలిపింది.
ఇక మూడేండ్ల క్రితం ‘ఇడా’ చిత్రానికిగానూ ఆస్కార్ అవార్డునందుకున్న పోలాండ్ దర్శకుడు పావెల్ పావ్లికోవిస్కీ తాజాగా కేన్స్‌లో ‘కోల్డ్‌వార్’ చిత్రానికిగానూ ఉత్తమ దర్శకుడిగా పురస్కారం దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘నా చిత్రాల్లో ప్రజల ద్వారా, ఎమోషన్స్ ద్వారా చరిత్రను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. సినిమాల్లో ఐడియాలాజికల్ నెరేషన్ ధోరణి కొనసాగుతున్న ఈ రోజుల్లో దానికి వ్యరేతికంగా చరిత్రను చెప్పడం చాలా ముఖ్యం. పోలాండ్‌లో వైవిధ్యం ఉంటుంది. అదొక ఆసక్తికరమైన దేశం. కేన్స్‌లో దర్శకుడిగా అవార్డు అందుకోవం చాలా హ్యాపీగా ఉంది’ అని అన్నారు. దాదాపు 37ఏండ్ల తర్వాత పోలిష్ చిత్రం కేన్స్‌లో ప్రదర్శించబడి అవార్డును గెలుచుకుంది. ‘డాగ్మన్’ చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా అవార్డునందుకున్న మెర్సెల్‌లో ఫోంటా ఇటాలియన్‌కు చెందిన నటుడు. గతంలో ఆయన నాలుగు సినిమాల్లో నటించారు. అవార్డు పొందిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘సినిమాలో చేయాల్సిన తప్పులన్నీ చేశాను. ఏ ఒక్కటి మిస్ కాలేదు’ అని చెప్పారు.
క్లోజింగ్ సెర్మనీలో భాగంగా ప్రదర్శితమై ‘ది మ్యాన్ హు కిల్డ్ డాన్ క్విక్సోట్’ ప్రీమియర్‌లో వాలెరి కౌఫ్మాన్, బ్లాంకా, బ్లాంకో, విక్టోరియా బోన్యా, ఓల్గా కుర్యులెంకో, లారా లిటో, లారా హారియర్, లీ సడాక్స్, కోకో కోనిగ్, జ్యూరీ అధ్యక్షురాలు కేట్ బ్లాంచెట్, క్రిస్టెన్ స్టీవార్ట్, చియారా మాస్ట్రోరియని, ఆలియా అర్జెంటో, వర్జీని లిడోర్ను, సోల్మాజ్ పనహి వంటి తారలు ఎర్ర తివాచీపై అందంగా ముస్తాబై హోయలు పోయారు. వీరితోపాటు పలువురు సినీ ప్రముఖులు గ్యారీ ఓల్డ్మన్, గిసెల్ ష్మిత్, స్టెల్లాన్ స్కార్స్‌గార్డ్, ఆడామ్ డ్రైవర్, జోనా రిబెరో, టోనీ గ్రిసిని, ఆస్కార్ జనదా, బ్రూనో సెవిల్లా, జోర్డి మోల్లా, రోస్సి డి పాల్మా, మరియెలా బసువిస్కీ, టెర్రీ గిల్లియం సందడి చేశారు.