గత విజయాలతో సంబంధం లేకుండా …
సిని పరిశ్రమలో విజయం సాధించిన వారికే విలువ. ఈ సూత్రం హీరోయిన్లకే కాదు దర్శకులకు వర్తిస్తుంది. ఒక్క సినిమా ఫ్లాప్ అయినా ఇక ఇండస్ట్రీలో వారిని పట్టించుకునే వారు ఉండరు. కానీ యువ హీరో శర్వానంద్ పద్దతి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. విలక్షణమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న శర్వానంద్ తాజాగా ఒప్పుకున్న రెండు సినిమాల దర్శకులను చూస్తే చాలా సాహసం చేస్తున్నాడనే చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ యువ హీరో ఒప్పుకున్న రెండు సినిమాల్లో ఒకటి హను రాఘవపూడి దర్శకత్వంలో ‘పడి పడి లేచే మనసు’ కాగా, మరో చిత్రం సుధీర్ వర్మ దర్శకత్వంలో చేస్తున్నాడు.
అయితే ఈ ఇద్దరు దర్శకుల పాత చిత్రాలు రెండు ఫ్లాప్ చిత్రాలే. నితిన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలోవచ్చిన ‘లై’, నిఖిల్ హీరోగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘కేశవ’ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఢీలా పడిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాల తర్వాత ఈ దర్శకుల చేతిలో మరో సినిమా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో శర్వానంద్ వీరికి మరో అవకాశం ఇవ్వడమంటే సాహసం చేశాడనే చెప్పవచ్చు. అయితే శర్వానంద్‌కు వీరిద్దరు చెప్పిన కథ నచ్చడం వల్లే అవకాశం ఇచ్చాడని సన్నిహతులు తెలుపుతున్నారు. దర్శకుల గత విజయాలతో సంబంధం లేకుండా కథ నచ్చితే ఎవరికైనా అవకాశం ఇస్తానని మరోసారి నిరూపించాడు శర్వానంద్. అలానే మరో ఫ్లాప్ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.