సినీవినోదం రేటింగ్ : 2/5
పూరిజగన్నాధ్ టూరింగ్ టాకీస్ పతాకం పై పూరిజగన్నాధ్ దర్శకత్వం లో పూరి కనెక్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది
రోషన్(ఆకాశ్ పూరి) క్రమశిక్షణ గల యువకుడు. మిలటరీలో చేరాలనుకుంటాడు. అతనికి చిన్నప్పట్నుంచి ఏవో కలలు వస్తుంటాయి. ఆ కలలో అతణ్ని ఎవరో చంపేసినట్టు అనిపిస్తుంటుంది. ఉలిక్కిపడి నిద్ర లేస్తుంటాడు. అలాగే పాకిస్థాన్‌లో అఫ్రీన్(నేహాశెట్టి)కి కూడా ఏవో కలలు వస్తుంటాయి. ఇద్దరూ పెరిగి పెద్దవుతారు. ఇంజనీరింగ్ చదివిన రోషన్‌కి ట్రెక్కింగ్ అంటే ఇష్టం. తన స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళుతుంటాడు. అఫ్రీన్ చదువుకోవడానికి హైదరాబాద్ చేరుకుంటుంది. ఓ సందర్భంలో అఫ్రీన్ గురించి తెలియకుండానే ఆమెను ఓ ప్రమాదం నుండి రక్షిస్తాడు రోషన్. అందువల్ల రోషన్‌కి థాంక్స్ చెప్పాలని అఫ్రీన్ అతని కోసం వెతుకుతూ ఉంటుంది. అయితే అప్పటికే అఫ్రీన్ తండ్రి(మురళీశర్మ) ఆమెకు నదిర్(విష్ణురెడ్డి)తో పెళ్లి నిశ్చయిస్తాడు. నదిర్ ఎలాగైనా అఫ్రీన్‌ను పెళ్లి చేసుకోవాలని అబద్ధం చెప్పి పాకిస్థాన్ రప్పిస్తాడు. ఆ సమయంలో హైదరాబాద్ నుండి ఢిల్లీ వెళ్లే ట్రెయిన్లో ఆఫ్రీన్‌ను కలుస్తాడు రోషన్. అతను స్నేహితులతో కలిసి హిమాలయాకు ట్రెక్కింగ్ వెళుతుంటాడు. అఫ్రిన్ను చూడగానే అతనికి ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. హిమాలయాలకు వెళ్లిన రోషన్‌కి అక్కడ అఫ్రీన్‌ను పోలిన అమ్మాయి శవం కనపడుతుంది. మంచులో ఉండటం వల్ల అన్నేళ్లు ఏమీ కాకుండా ఉంటుంది. అదే సమయంలో ఆమె వద్ద తనను పోలిన సైనికుడు ఫొటో చూసి తనకు వస్తున్న కలలకు, అఫ్రిన్‌కు ఉన్న సంబంధం తెలుసుకుంటాడు. ఆ సంబంధం ఏంటి? ఇండియాలోని రోషన్, పాకిస్థాన్‌లోని అఫ్రిన్ కలుసుకుంటారా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమాలో చూడాల్సిందే…..
తన రెగ్యులర్ స్టైల్‌ను పక్కన పెట్టి డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ టేకింగ్‌తో సినిమా చేశాడు పూరి. కానీ పూరి ప్రయత్నం ఏ మాత్రం ఆకట్టుకోలేదు. స్టోరీ లైన్ బాగానే ఉన్నా దాన్ని పూర్తిస్థాయి సినిమాగా డెవెలప్ చేసేందుకు అయన రాసుకున్న కథనం ఆకట్టుకోలేకపోయింది. సినిమాలో పూరి మార్క్ హీరోయిజం, డైలాగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్ లేకపోవటం నిరాశకలిగిస్తుంది. పూరి సినిమా అంటే ఫాస్ట్ నెరేషన్ ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా స్లో నెరేషన్‌తో ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది.ఫ్లాష్ బ్యాక్‌లోని ప్రేమ, ఇప్పటి ప్రేమ సన్నివేశాల్లో ఎమోషన్స్ ఉండవు. అందువల్ల ప్రేమకథ మనసుని తాకదు. ప్రథమార్థంలో వచ్చే హీరో ఎలివేషన్ సీన్స్, ఇంటర్వెల్ బ్లాక్ మినహా మిగతా ఏవీ కూడ ఎంటర్టైన్ చేయలేకపోయాయి. ముఖ్యంగా హీరో హీరోయిన్ల గత జన్మ తాలూకు సన్నివేశాలైతే మరీ బోర్ కొట్టించాయి. పూరి ట్రై చేసిన ఈ కొత్త స్టైల్ కంటే… ప్రేమ కథలకు ఆయనిచ్చే పాత ట్రీట్మెంటే నయం. కనీసం ఎంటర్టైన్మెంట్ అయినా ఉండేది. ఇక ప్రీ క్లైమాక్స్ లో పాకిస్థాన్ వెళ్లిన హీరో తన ప్రేమ కోసం చేసే ప్రయత్నాలు చాలా నీరసం గా ఉండటంతో ప్రేక్షకులు ఇబ్బంది పడతారు. బలమైన విలనిజం కనపడదు. క్లైమాక్స్ సన్నివేశం అయితే … బోర్డర్లో గొడవను ఏదో ఆషామాషీగా చూపించేశాడు. ఏ మాత్రం లాజిక్ లేని సన్నివేశాలతో ఇది పూరి సినిమానేనా అన్న అనుమానం వస్తుంది.
‘ఆంధ్రాపోరి’ సినిమాతో హీరోగా పరిచయం అయిన ఆకాష్.. చాలా రోజులు తరువాత ‘మెహబూబా’తో కమర్షియల్ హీరోగా రీలాంచ్ అయ్యాడు. అయితే రెగ్యులర్ ఫార్మాట్ కమర్షియల్ సినిమా కాకుండా ఓ డిఫరెంట్ జానర్‌ను ఎంచుకున్నాడు. రెండు డిఫరెంట్ వేరియేషన్స్‌తో… సైనికుడిగా, ప్రేమికుడిగా రెండు విధాలా ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. లుక్స్ పరంగా ఆకాష్ బాగానే ఉన్నాడు , అయితే కొన్ని సన్నివేశాల్లో తన వయసుకు మించిన పాత్రను ఎంచుకున్నాడనిపిస్తుంది . నటన పరంగా మంచి మార్కులే సంపాదించుకున్నాడు. యాక్షన్ సీన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇక నేహాశెట్టి నటనకు స్కోప్ ఉన్న పాత్రే అయినా , ఎఫెక్టివ్ గా పెర్ఫామెన్స్ చేయలేకపోయింది. విలన్‌గా విషు రెడ్డి అంతగా ఆకట్టుకోలేకపోయాడు. హీరోయిన్ తండ్రిగా మురళీ శర్మ, హీరో తండ్రిగా షియాజీ షిండే రొటీన్ పాత్రల్లో కనిపించారు.
కొన్ని సన్నివేశాల్లో పూరి తన మార్కు డైలాగ్స్ తో ఆకట్టుకున్నాడు. సందీప్ చౌతా బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది. పాటలు మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. విష్ణుశర్మ సినిమాటోగ్రఫీ బాగుంది. హిమాలయాలు, ఫైట్స్, ట్రెక్కింగ్‌కు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణలో అతని ప్రతిభ కనిపిస్తుంది.జునైద్ సిద్ధిఖీ తన ఎడిటింగ్ ద్వారా సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలని తొలగించాల్సింది. పూరి జగన్నాథ్ పాటించిన నిర్మాణ విలువలు మంచి స్థాయిలో ఉన్నాయి -రవళి