బెస్ట్ విన్ ప్రొడక్షన్ ‘రుణం’ పాటల విడుదల

బెస్ట్ విన్ ప్రొడక్షన్ పతాకంపై భీమినేని సురేష్-జి.రామకృష్ణారావు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “రుణం” ఈ చిత్రంలో గోపికృష్ణ-మహేంద్ర హీరోలుగా పరిచయమవుతుండగా.. శిల్ప-తేజు-ప్రియాంక హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రదీప్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఎస్.వి.మల్లిక్ తేజ సంగీత సారధ్యం వహించిన ఈ చిత్రం ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్ లో విడుదలయ్యింది.
 
రేవంత్, హేమచంద్ర, హరి చరణ్, దీపు, శ్రావణ భార్గవి, చిన్మయి, హరిణి గాత్రమందించారు.  సంగీత దర్శకుడు మల్లిక్ తేజ్ ఈ చిత్రంలోని అన్ని పాటలు రాయడంతో పాటు.. ఒక పాట కూడా పాడడం విశేషం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని, ఫస్ట్ కాపీతో సిద్ధంగా ఉన్న ఈ చిత్రం ఆడియో వేడుక  హైద్రాబాద్, హై టెక్ సిటీ సమీపాన గల సైబర్ సిటీ కన్వెన్షన్ హాల్ లో అత్యంత కోలాహలంగా జరిగింది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని పాటలకు డాన్సులు చేసి ఆహుతులను అలరించారు. 
 
ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతి మండలి అధ్యక్షుడు- ఎం.ఎల్.ఏ రసమయి బాలకిషన్, తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి, ప్రముఖ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ్, ‘స్కై విన్ మొబైల్స్’ గాలిరెడ్డి, ఆదిత్య మ్యూజిక్ ప్రతినిధి మాధవ, ఈ చిత్రంలో పాటలు ఆలపించిన పలువురు గాయనీగాయకులతోపాటు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒక్కో అతిధి ఒక్కో పాటను ఆవిష్కరించారు. 
 
పాటలు చాలా బాగున్నాయని, సినిమా బాగా ఆడాలని అందరూ అభిలషించారు. జీవితంలో ప్రతి ఒక్కరు ఎంతో  కొంతమందికి రుణపడుతుంటారని, దాన్ని ఆధారం చేసుకొని రూపొందించిన ‘రుణం’ తప్పక విజయం సాధిస్తుందని, ముఖ్యంగా ఈ సినిమా ఇంత బాగా రావడానికి తామెప్పుడూరుణపడిఉంటామని నిర్మాతలు సురేష్ బీమినేని, జి.రామకృష్ణరావు పేర్కొన్నారు.
తనకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన నిర్మాతలు, దర్శకుడు ఎస్.గుండ్రెడ్డికి సంగీత దర్శకుడు ఎస్.వి.మల్లిక్ తేజ్ కృతజ్ఞతలు తెలిపారు. 
ఏ.వెంకట్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు: భీమినేని సురేష్-జి.రామకృష్ణారావు, కథ-స్క్రీన్ ప్లే-సంభాషణలు-దర్శకత్వం: ఎస్.గుండ్రెడ్డి