డి.వి.వి.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కొరటాల శివ దర్శకత్వం లో దానయ్య డి.వి.వి ఈ చిత్రాన్ని నిర్మించారు.
భరత్ రామ్ ఆక్స్పర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటూ ఉంటాడు. తండ్రి రాఘవరాజు(శరత్ కుమార్) చనిపోయాడని తెలుసుకుని ఇండియా వస్తాడు. రాఘవ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావడంతో… ఆయన మరణాంతరం ఆ పదవి ఎవరికి దక్కాలనే దానిపై పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మొదలవుతాయి. అప్పుడు నానాజీ అలియాస్ వరదరాజులు(ప్రకాశ్ రాజ్) భరత్‌ని ముఖ్యమంత్రిని చేస్తాడు. ముఖ్యమంత్రి అయిన తొలి రోజు నుండే భరత్ ప్రజలకు మంచి చేయాలనుకుంటాడు. ఫ్రీ ఎడ్యుకేషన్, వ్యవసాయదారులు కోసం సదుపాయాలు.. ప్రతి పక్షనేత కుమారుడిని అవినీతి కేసులో అరెస్ట్ చేయించడం.. లోకల్ గవర్నెన్స్ తదితర అంశాలకు ప్రాధాన్యతనిస్తాడు. దాంతో ప్రజల్లో భరత్ రామ్‌కి పేరు ప్రతిష్టలు వచ్చేస్తాయి. ప్రజల నుంచి భరత్‌కు మద్ధతు పెరుగుతున్నా.. సొంత పార్టీ నుంచే మాత్రం ప్రతిఘటన ఎదురవుతుంటుంది. విమర్శలు వచ్చినా భరత్ పట్టించుకోడు. ఈ క్రమంలో వసుమతి(కియరా అద్వాని)తో ప్రేమలో పడతాడు. ఆ కారణం వల్లనే భరత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తాడు. ప్రజలకు మంచి చేయాలనుకున్న భరత్ లక్ష్యం ఏమయ్యింది? అసలు భరత్ తండ్రి మరణం వెనుకున్న రహస్యమేంటి? ఈ విషయాలు తెలుసుకోవాలంటే సినిమాలో చూడాల్సిందే…
‘నాయకులు లేని సమాజాన్ని రూపొందించడమే ఉత్తమ నాయకుడి లక్షణం’ అనే అంశాన్ని, ఇచ్చిన మాట మీద నిలబడాలనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని రాసుకున్న కథ ఇది. దర్శకుడు కొరటాల శివ ఎప్పటిలాగే బలమైన సోషల్ పాయింట్ తో కమర్షియల్ విలువల్ని వదిలిపెట్టకుండా ఈ సినిమాను రూపొందించారు. ఈసినిమా చూస్తుంటే శంకర్, అర్జున్ ల `ఒకే ఒక్కడు` చిత్రం గుర్తుకొస్తుంది. అలాగే ఆమధ్య వచ్చిన రానా `లీడర్` గుర్తుకొస్తుంది. `భరత్ అనే నేను` ఈ రెండు చిత్రాలను కలిపి చూసినట్లనిపించింది. అకస్మాత్తుగా సీఎం అయిన వ్యక్తి సమాజాన్ని బాగు చేసిన తీరు ఈ చిత్రంలో చూపించారు. హీరోయిజం బాగా పండేలా కొరటాల శివ రాసిన ఎలివేషన్ సీన్లు, ప్రజా సమస్యల్ని ఆధారం చేసుకుని రాసిన సన్నివేశాలు, వాటికి చూపిన పరిష్కారాలు బాగానే అనిపించినా … సహజత్వం పూర్తిగా లోపించడం, నెమ్మదించిన ద్వితీయార్ధం , ఆశించిన స్థాయిలో లేని,ఊహాజనితమైన క్లైమాక్స్ నిరుత్సాహానికి గురిచేస్తాయి. సీట్లలో అసహనంగా కదిలేలా ఇబ్బంది పెట్టాయి . సినిమాలో కామెడీ లేదు, ప్రేమ సన్నివేశాలు, భావోద్వేగాలు కూడా సరిగా పండలేదు. హీరోయిన్ తో ప్రేమలో ఉన్న హీరో… మీడియా లో గొడవ జరిగినప్పుడు… ఓపెన్ గా, స్పష్టం గా ప్రకటించక పోవడం, రాజీనామా చెయ్యడం అర్ధవంతం గా లేదు. భరత్ సీఎంగా రాజీనామా-తిరిగి పగ్గాలు చేపట్టడం లాంటి సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువయ్యింది. సెకండాఫ్ ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ప్రెస్ కాన్ఫరెన్స్ ఎపిసోడ్ బాగుంది, కొరటాల శివ రాసిన డైలాగులు అర్థవంతం గా ఉన్నాయి.
ముఖ్యమంత్రి పాత్రలో మహేష్ ప్రదర్శించిన నటన అద్భుతంగా పండి సినిమా స్థాయిని పెంచింది.యంగ్ అండ్ డైనమిక్ చీఫ్ మినిస్టర్ పాత్రలో పర్ఫెక్ట్ గా ఒదిగిపోయాడు. తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా సూపర్ స్టార్ అభిమానులను అలరిస్తాయి. ఇక గాడ్ ఫాదర్ పాత్రలో ప్రకాశ్ రాజ్ మెప్పించాడు. ఇలాంటి పాత్రలను తాను తప్ప మరెవరూ పోషించలేరన్నట్లు నటించాడు. హీరోయిన్ గా పరిచయం అయిన కైరా అద్వానీది చిన్న పాత్రే.. అయినా ఉన్నంతలో మంచి నటన కనబరిచింది. అందంతో పాటు అభినయంలోనూ మంచి మార్కులు సాధించింది. సీఎం భరత్ పర్సనల్ సెక్రటరీగా బ్రహ్మజీ.. పోసాని ,శరత్ కుమార్, ఆమని, సితార, అజయ్, రావు రమేష్, దేవరాజ్, తమ పాత్రల ను బాగా చేశారు.
దేవి శ్రీ ప్రసాద్ అందించిన సినిమా ఓపెనింగ్ పాట, జాతర పాట ‘వచ్చాడయ్యా’ పాట మెప్పిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా కి చాలా ఉపయోగపడింది . సినిమాటోగ్రాఫర్స్ రవి కె.చంద్రన్, తిరునవుక్కరసుల కెమెరా పనితనం చాలా గొప్పగా ఉంది. ముఖ్యంగా ఫైట్స్, పాటలు, ఎలివేషన్ సన్నివేశాలను బాగా చూపించారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ సినిమాకు చాలా ఉపయోగపడింది. ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సెల్వ రాజన్ వేసిన అసెంబ్లీ సెట్, ‘దండాలయ్యా సామి’ పాటలో దేవాలయం సెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నిర్మాత డివివి. దానయ్య నిర్మాణ విలువలు భారీగా ఉన్నాయి – రవళి