మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులపై యూనిసెఫ్ మీటింగ్‌లో ప్రియాంక మాట్లాడుతూ, ‘యూనిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉండటాన్ని అద్భుతంగా భావిస్తున్నా. మహిళలపై లైంగిక వేధింపులు, సమానత్వం, ఉద్యోగాల్లో మార్పిడి, ఇతర వేధింపులకు సంబంధించి మహిళల్లో అవగాహన కల్పించే ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం అదృష్టం. శరణార్థ క్యాంపులకు వెళ్లినప్పుడు, చిన్న చిన్న గ్రామాలకు వెళ్ళినప్పుడు నేను గమనించిందేంటంటే, అక్కడి వారికి కనీస అవకాశాలు దక్కడం లేదు. ఆ కమ్యూనిటికి లీడర్ అవ్వడం వరకే వారు పరిమితమవుతున్నారు. అంతకు మించిన ఛాన్స్‌లు రావడం లేదు’ అని తెలిపింది.
స్త్రీ,పురుష భేదాల గురించి చెబుతూ, ‘అమ్మాయి ఓ గంట సేపు బయటికి వెళ్ళి వస్తే.. ‘ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావ్’ అంటూ నిలదీస్తారు. తిరిగే స్వేచ్ఛ అమ్మాయిలకు లేదా? అదే పురుషులను ఎందుకు అడగరు? మగవారికి మాత్రమే అధికారం ఉండాలని, వారి చుట్టూ తిరగాలని మహిళలు అనుకోవడం లేదు. వారిపై వారికి నమ్మకం కలిగిస్తే ఏదైనా సాధించగలరు. నేను ఒక ఉన్నతమైన నేపథ్యం నుంచి వచ్చాను. ఏ విషయంలోనైనా మా తల్లిదండ్రులు నా అభిప్రాయాన్ని అడిగేవారు. అభిప్రాయం చెప్పే విషయంలో భయపడకూడదని మా నాన్నగారు చెప్పేవారు. అందుకే నేను కూడా చిన్నప్పట్నుంచే అభిప్రాయాలను స్వేచ్ఛగా, గట్టిగా చెప్పేదాన్ని. స్కూల్ టైమ్ నుంచే సొంత నిర్ణయాలు తీసుకున్నాను. ఇది నా కెరీర్‌కు, సామాజికంగా పరిణతి సాధించడానికి ఎంతో ఉపయోగపడింది.నాలో సామాజిక బాధ్యతను మరింత పెంచింది’ అని తెలిపింది.
ప్రియాంక ప్రస్తుతం ‘ఏ కిడ్ లైక్ జేక్’, ‘ఈజ్‌నాట్ ఇట్ రొమాంటిక్’ చిత్రాల్లో నటిస్తోంది. అలాగే త్వరలోనే బాలీవుడ్లో రీఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటోంది.