తల్లిదండ్రులు తరవాత స్థానం గురువుదే… ఇదీ గురువుకి మనం ఇచ్చే గౌరవం! కళాకారులకు కొండంత బలాన్ని ఇచ్చేది… నీ పనితీరు అద్భుతం అని చెప్పే ప్రోత్సాహం! ఈ రెండింటిని కలిపితే… అంతకుమించిన అధ్బుతం ఇంకేముంటుంది! ఈ పనే చేస్తున్నారు ప్రముఖ నటి తులసి. ఎప్పుడో తన సినిమాలో అవకాశం ఇచ్చిన గురువు పేరున పురస్కారాలు అందించబోతున్నారు. ‘శంకరాభరణం’ సినిమాలో ‘శంకరం’ పాత్రతో తనను సినిమా రంగానికి తీసుకొచ్చిన కాశినాథుని విశ్వనాథ్ పేరుతో ఆమె పురస్కారాల్ని ఇవ్వబోతున్నారు. ఇటీవల ప్రఖ్యాత దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్న విశ్వనాథ్ పేరున పురస్కారం ప్రకటించి ఆయనకు గురుదక్షిణ ఇస్తున్నారు తులసి శివమణి.
తెలుగు సినిమా పరిశ్రమలో ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన సాంకేతిక నిపుణులు, నటీనటులకు ఏటా ఈ పురస్కారాలు ఇవ్వనున్నారు. పురస్కారాల ఆవిష్కరణ కార్యక్రమం, ఈ ఏడాది పురస్కారాల ప్రదానోత్సవం… ఈ నెల 20న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జరగనుంది. ఈ వేడుకకి తెలుగు రాష్ట్రాల గవర్నర్ శ్రీ ఈ.ఎస్.ఎల్. నరసింహన్ ముఖ్య అతిథిగా హాజరవనున్నారు. ఆయనతో పాటు తెలుగు చిత పరిశ్రమ నుంచి ఎందరో ప్రముఖులు విచేస్తున్న ఈ వేడుకకి జయప్రదం చేయాలని తులసి కోరుతున్నారు. అత్యంత వైభవంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి దక్షిణాదికి చెందిన సినీ ప్రముఖులతోపాటు ఉత్తరాది నటీనటులు కూడా హాజరుకానున్నారనీ, పలు విభాగాల్లో వారికి కూడా పురస్కారం అందజేస్తామని తులసి తెలిపారు.