రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన `రంగస్థలం` ఇటీవల విడుదలై భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్ లో చిత్ర యూనిట్ థాంక్స్ మీట్ ను ఏర్పాటు చేసి సక్సెస్ చేసిన ప్రేక్షకాభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపిన సంగతి తెలిసిందే. ఇందులో చిట్టిబాబు (రామ్ చరణ్) అన్నయ్య (కుమార్ బాబు) పాత్రలో నటించిన ఆది పినిశెట్టి తన బిజీ షెడ్యూల్ కారణంగా వేడుకకు హాజరుకాలేకపోయారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయన మీడియా ముందుకొచ్చి `రంగస్థలం`అనుభూతులను మీడియాతో పంచుకున్నారు….
`ఓ సినిమా ఫోటో షూట్ కారణంగా నిన్న జరిగిన `రంగస్థలం` థాంక్స్ మీట్ కు హాజరుకాలేకపోయాను. ఆ హ్యాపీ మూవ్ మెంట్ ను మీతో, యూనిట్ తో పంచుకోలేకపోయాను. అందుకు బాధగా కూడా ఉంది. `రంగస్థలం` పెద్ద విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటివరకూ నేను నటించిన ప్రతీ పాత్రను ప్రేక్షకులు…మీడియాతో ఎంతో సపోర్ట్ చేసింది. నాకు `సరైనోడు` చిత్రం నుంచి తెలుగు ప్రేక్షకాభిమానుల నుంచి ఎంతో సహకారం లభించింది. `రంగస్థలం` లో కుమార్ బాబు పాత్ర ఎప్పటికీ మర్చిపోలేనిది. ఇది ఓ గొప్ప అనుభూతి. నటుడిగా చాలా సంతృప్తిగా ఉంది. ఆ పాత్రతో నటుడిగా బాధ్యత మరింత పెరిగింది. నా సినిమా ప్రతీ రివ్యూ చూస్తుంటాను. రివ్యూ రైటర్స్ నాకు గురువులు. నా తప్పులను చెబుతారు. తర్వాత వాటిని పునరావృతం కాకుండా చూసుకుంటాను. నెగిటివ్ రివ్యూస్ కూడా చదువుతాను.
ఏ సినిమా కథ విన్నా ఒకే చెప్పడానికి ఎక్కువ టైమ్ తీసుకుంటాను. ఆ పాత్రకు నేను న్యాయం చేయగలనా? లేదా? అన్ని ఎక్కువగా ఆలోచిస్తాను. కానీ `రంగస్థలం` కథ వినగానే వెంటనే ఒకే చేసేశా. కథ, దర్శకుడిపై ఉన్న నమ్మకంతో, నేను చేయగలను అని నమ్మకంతోనే అలా చెప్పేసానేమో! రంగస్థలం కథ ఒక ఎత్తైతే…సుకుమార్ దానికి దృశ్య రూపం ఇవ్వడం మరో ఎత్తు. ప్రతీ సన్నివేశాన్ని హృదయానికి హత్తుకునే లా తీశారు. క్లైమాక్స్ లో నా పాత్ర చనిపోయే సన్నివేశం అయితే నా తల్లిదండ్రులను కంగారు పెట్టింది. అందుకే ఈ సినిమా చేస్తున్నట్లు ముందుగా వాళ్లకు చెప్పలేదు. డైరెక్ట్ గా సినిమాలోనే చూశారు. ఫ్యామిలీతో కలిసి సినిమా చూశాను. ఆ సీన్ వచ్చే టప్పుడు నా తల్లిదండ్రులు..స్నేహితులు మధ్యలో కూర్చొన్నాను. ఆ సమయంలో వాళ్ల ఎక్స్ ప్రెషన్స్ చాలా గొప్ప అనుభూతినిచ్చాయి. రామ్ చరణ్ , సుకుమార్ వల్లే సినిమా ఈస్థాయి విజయాన్ని అందుకుంది. చెర్రీ నటన అద్భుతం. అలాంటి పాత్ర చేయడం ఏ నటుడికైనా సవాల్ గానే ఉంటుంది. చెర్రీ చాలా బాగా చేసారు. ఈ సినిమాతో నాకొక తమ్ముడు దొరికాడు అనిపించింది. సమంత నటన చాలా గొప్పగా ఉంటుంది. దేవి శ్రీ ప్రసాద్ మంచి సంగీతాన్ని అందించారు. సాంకేతికంగాను సినిమా అత్యద్భుతంగా ఉంది. ఇలాంటి సినిమాలు నిర్మించాలంటే నిర్మాతలు చాలా ప్యాషన్ చూపించాలి. ఓపిక, సహనం ఉండాలి. అవన్నీ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థలో కనిపించాయి. అందుకే సినిమా అంత గొప్పగా వచ్చింది` అని అన్నారు.