రామ్‌చరణ్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘రంగస్థలం’ సినిమా సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్షింపబడుతోంది. చిత్రంలో నటించిన అందరు నటీనటులకు ఫుల్ క్రెడిట్ దక్కింది. భారీ కలెక్షన్స్‌తో రికార్డులను తిరగ రాస్తూ పరుగులు పెడుతోంది. ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ రావటంతో చిత్రయూనిట్ అంతా సంబరాల్లో మునిగిపోయింది. కానీ సినిమాలోని ఓ పాట విషయంలో అనుకోని వివాదం తలెత్తడం ప్రస్తుతం హాట్‌టాపిక్ అయింది.
‘ఆ గట్టునుంటావా.. ఈ గట్టుకోస్తావా’ అంటూ హుషారుగా సాగే ‘రంగస్థలం’ లోని ఈ పాటను ప్రముఖ జానపద కళాకారుడు శివనాగులు చేత పాడించారు. ఆడియో ఈవెంట్‌కి కూడా ఆయనను పిలిచి వేదికపై ఆ పాట పాడించారు. దీంతో ఎంతో ఖుషీగా ఫీల్ అయిన శివనాగులు.. తీరా సినిమా విడుదలయ్యాక వెండితెరపై ఆ పాట చూసి బాగా అప్సెట్ అయ్యారట. వెండితెరపై ఈ పాటలో నా వాయిస్‌కి బదులుగా దేవి శ్రీ వాయిస్ వినిపించటంతో ఆశ్చర్యపోయానని అంటున్నారు శివనాగులు.
ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బాధ వెళ్లబుచ్చిన శివనాగులు.. ‘‘చిన్న చిన్న వేదికలపై పాడుకునే నా వాయిస్ ‘రంగస్థలం’ ఆల్బమ్‌తో ప్రపంచ వ్యాప్తంగా అందరి చెవిలో పడింది. కానీ తీరా సినిమా విడుదలయ్యాక చూస్తే నా వాయిస్ లేకపోవటం చాలా బాధ కలిగించింది. ఏం జరిగిందో తెలియదు కానీ నా వాయిస్‌ని దేవి శ్రీ వాయిస్‌తో రీ ప్లేస్ చేశారు. అలా చేసేటపుడు నాకోమాట చెప్పి ఉంటే బాగుండేది. ఆడియో వేడుకలో నా వాయిస్ గురించి గొప్పగా చెప్పిన దేవి శ్రీ.. పది రోజుల్లోనే నా మీద నీళ్లు చల్లారు. ఇలాంటి సంఘటనలు ముందు ముందు ఇంకెవ్వరూ ఎదుర్కోవద్దు అనే ఉద్దేశం తోనే నేను ఇలా మీడియా ముందుకు వచ్చా’’ అని చెప్పారు.
పాటను ఉద్దేశ పూర్వకంగా మార్చలేదు !
ఈ విషయాలపై దర్శకుడు సుకుమార్ క్లారిటీ ఇచ్చారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాట ఎందుకు మార్చాల్సి వచ్చిందో వివరించారు…. షూటింగ్ సమయానికి శివ నాగులతో పాట రికార్డ్ కాలేదని దీంతో దేవీ పాడిన వర్షన్‌తో షూటింగ్ కానిచ్చేశారట. తరువాత శివ నాగులుతో పాట రికార్డ్ చేసినా.. రీ రికార్డింగ్ సమయంలో ఈ వర్షన్‌కు లిప్ సింక్ కాకపోవటంతో దేవీ శ్రీ ప్రసాద్ వర్షన్‌ను అలాగే ఉంచేశామని సుకుమార్ వెల్లడించారు. అంతేకాదు ఆల్బమ్‌లో ఎప్పటికీ శివ నాగులు పాడిన పాటే ఉంటుందని, పాటను ఉద్దేశ పూర్వకంగా మార్చలేదని కేవలం సాంకేతిక కారణాల వల్లే అలా చేయాల్సి వచ్చిందని తెలిపారు.