సినీవినోదం రేటింగ్ : 3/5
మైత్రీ మూవీ మేకర్స్ సుకుమార్ దర్శకత్వం లో నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, సివిఎం(మోహన్) ఈచిత్రాన్ని నిర్మించారు
చిట్టిబాబు (రామ్‌చరణ్)కి పాక్షికంగా చెవుడు. తన మోటారుతో ఊరి పొలాలకు నీరందిస్తుంటాడు. తన వరుసకు మరదలు అయిన రామలక్ష్మి(సమంత)ని ప్రేమిస్తాడు. ఫణీంద్ర భూపతి (జగపతిబాబు) ముప్పై ఏళ్లుగా రంగస్థలం గ్రామానికి ప్రెసిడెంట్. ప్రజలకు అందాల్సిన నిధులను కాజేస్తూ, సొసైటీ పేరు చెప్పి ఊరి ప్రజలకు అప్పిచ్చి.. అక్రమ వడ్డీ వసూలు చేస్తుంటాడు . ఇవ్వని వారి భూములు స్వాధీనం చేసుకుంటుంటాడు. ఎదురు తిరిగిన వాళ్లని చంపేస్తుంటాడు. చిట్టిబాబుఅన్న కుమార్‌బాబు(ఆది పినిశెట్టి) దుబాయ్ నుంచి ఊరికొస్తాడు. ఊర్లో జరిగే అన్యాయాలకు కుమార్‌బాబు ఎదురొస్తాడు. దక్షిణామూర్తి (ప్రకాశ్ రాజ్) సపోర్ట్‌తో కుమార్‌బాబు ఊరి ప్రెసిడెంట్‌గా పోటీ చేయడానికి నామినేషన్ వేస్తాడు. ముందుగా ఊరి ప్రజలు ప్రెసిడెంట్‌కు భయపడ్డా, నెమ్మదిగా కుమార్ బాబు అందరినీ తన వైపు తిప్పుకుంటాడు. అయితే ప్రెసిడెంట్ ఫణీంద్ర.. కుమార్ బాబుని చంపడానికి ప్లాన్ చేస్తారు. మనుషులను పంపుతాడు. అక్కడ జరిగే గొడవలో కుమార్ బాబుని చిట్టిబాబు కాపాడినా… మరెవరో కుమార్ బాబుని చంపేస్తారు. చిట్టిబాబు తన అన్నను చంపింది ప్రెసిడెంట్ అని అతని ఇంటికి వెళితే అప్పటికేప్రెసిడెంట్ పారిపో తాడు. దక్షిణామూర్తికి యాక్సిడెంట్ అవుతుంది. కోమాలోకి వెళ్లిపోతాడు.ఇంతకు కుమార్‌బాబుని చంపించిదెవరు?ఆ పరిస్థితుల్లో చిట్టిబాబుఏం చేసాడో తెలుసుకోవాలంటే సినిమాలో చూడాల్సిందే….
రామ్ చరణ్, సుకుమార్ ల కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రంకోసం చరణ్‌తో పాటు సుకుమార్ కూడా తన రెగ్యులర్ స్టైల్‌ను పక్కన పెట్టి చేశారు. ఇన్నాళ్లు కమర్షియల్ స్టార్‌గా మాత్రమే ప్రూవ్ చేసుకున్న రామ్‌చరణ్, ఈ సినిమాతో నటుడిగానూ మరో మెట్టు ఎక్కాలని ప్రయత్నించాడు .కథ విషయానికి వస్తే.. కథలో కొత్తదనం ఎక్కడా కనపడదు. దర్శకుడు సుకుమార్ సినిమా కథలో కొత్తదనం లేకపోయినా.. పాత్రలను మలుచుకున్న తీరు.. వాటి అనుగుణంగా సన్నివేశాల చిత్రీకరణ… సంభాషణలు.. పాత్రల నుండే కామెడీని పండించేలా సీన్స్‌ను రాసుకోవడం వంటి విషయాల్లో సక్సెస్ అయ్యాడు. అయితే తను అనుకున్న కథను సుధీర్ఘంగా చెప్పిన సుకుమార్ అక్కడక్కడా కాస్త విసిగిస్తాడు. ఇక సినిమా ఎక్కువ భాగం స్లో నెరేషన్‌లోనే ఉంది. మూడు గంటల సినిమా.. స్లోనెరేషన్ అనేదిఈ చిత్రానికి ప్రధాన మైనస్ పాయింట్స్. రామ్‌చరణ్‌కు పాక్షికంగా వినపడదు.. దాన్ని అతను కవర్ చేసుకునే విధానం.. దాని వల్ల అతను పడే తిప్పలు.. ప్రేక్షకుడిని నవ్విస్తాయి. సమంతతో తన ప్రేమను చెప్పే విధానం… రామ్‌చరణ్, ఆది పినిశెట్టిలు జగపతిబాబు ఇంటికి వెళ్లి అప్పటి వరకు తెలియని అతని పేరుని తనకు గుర్తు చేయడం.. క్లైమాక్స్‌లో అసలు చిక్కుముడి వీడటం. వంటి సన్నివేశాలు ప్రేక్షకుడిని ఆకట్టుకుంటాయి.ప్రత్యేక ఆకర్షణగా పెట్టిన పూజ హెగ్డే ‘జిగేలు రాణి’ ఐటమ్ సాంగ్ ఏమంత గొప్పగా లేదు.
రామచరణ్ తన ఇమేజ్ను పక్కన పెట్టి.. భిన్నంగా ఇందులో చిట్టిబాబు పాత్ర చేశాడు. అమాయకత్వం, ధైర్యం, ప్రేమ, పగ కలగలిపి పాక్షికంగా చెవుడు ఉన్న యువకుడిలా చెర్రీ ఒదిగిపోయాడు. గుబురు గడ్డం, గళ్ల లుంగీ, డైలాగ్ డెలివరీ, ఎక్స్ప్రెషన్స్ అన్నీ కొత్తగా ఉన్నాయి. తన పాత్రకు వందశాతం న్యాయం చేశాడు. సమంత రామలక్ష్మి పాత్రలో ఒదిగిపోయింది. గతంలో ఎన్నాడూ కనిపించినంత మాస్ పాత్రలో కనిపించిన సామ్ చిలిపి ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంది. ఎమోషనల్ సీన్స్ లోనూ తన దైన నటనతో ఆకట్టుకుంది. ముఖ్యంగా ‘యేరు శెనగ మీద’ సాంగ్,… `రంగమ్మ మంగమ్మ…` పాటలో తను చక్కటి హావభావాలను పలికించింది. పద్దతి కలిగిన కుర్రాడి పాత్రలో కుమార్ బాబుగా ఆది పినిశెట్టి సరిగ్గా సరిపోయాడు. సినిమా అంతా హుందాగా కనిపించిన ఆది.. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాల్లో సూపర్బ్ అనిపించాడు. తన పదవి కోసం ఏమైనా చేసే క్రూరమైన ప్రెసిడెంట్ పాత్రలో జగపతిబాబు మంచి విలనిజం పండించాడు. జగపతి బాబు ఆహార్యం కూడా పాత్రకు తగ్గట్టుగా ఉంది. వెండితెర మీద మంచి క్యారెక్టర్ కోసం ఎదురుచూస్తున్న అనసూయకు రంగస్థలంలో ఆ ఛాన్స్ దక్కింది. రంగమ్మత్తగా కీలక పాత్రలో కనిపించిన అనసూయ, ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఎమోషనల్ సీన్స్ లోనూ మెప్పించింది. ఇక అజయ్ ఘోష్, ప్రకాశ్ రాజ్, కాదంబరి కిరణ్, సత్య, నరేశ్, రోహిణి, బ్రహ్మాజీ సహా అందరూ వారి వారి పాత్రల మేర చక్కగా నటించారు.
మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, నేపథ్య సంగీతం బావున్నాయి. ఆరు పాటల్లో నాలుగు పాటలు చాలా బావున్నాయి. వాటి చిత్రీకరణ కూడా ఆకట్టుకుంది. పాటల్లో చంద్రబోస్ అందించిన సాహిత్యం మెప్పించింది. నేపథ్య సంగీతం కూడా సినిమాకి ప్లస్ అయ్యింది. రత్నవేలు సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద ఎసెట్ అయ్యింది. గోదావరి అందాలను, పాత కాలపు గ్రామీణ వాతావరణాన్ని కళ్ళ ముందు ఆవిష్కరించి ఆకట్టుకున్నాడు. ఇక సినిమాకు రామకృష్ణ, మోనికల ఆర్ట్ వర్క్ వెన్నెముకలా నిలబడింది. 1980 నాటి వాతావరణాన్ని క్రియేట్ చేసి ఆ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేయడం వెనుక ఆర్ట్ డిపార్ట్మెంట్ కష్టం తెరపై కనపడింది. మైత్రి మూవీ మేకర్స్ ఎక్కడా వెనుకాడకుండా పెట్టిన ఖర్చు క్వాలిటీ పరంగా సినిమా స్థాయిని పెంచింది – ధరణి