తెలుగులో దాదాపు టాప్ హీరోలు అందరి సరసనా ఆడిపాడిన ఛార్మి ఇప్పుడు చలనచిత్ర నిర్మాణ ప్రక్రియను ఆస్వాదిస్తున్నారు. ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె మాట్లాడుతూ…
‘‘సినిమాల నిర్మాణం ఒత్తిడితో కూడుకున్న వ్యవహారమే. అయినా నేను దాన్ని ఆస్వాదిస్తున్నాను.అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నానా? అని నన్ను నేను ప్రశ్నించుకోని రోజంటూ ఉండదు. అయినా మనస్ఫూర్తిగా చేస్తున్నాను. ఎందుకంటే …నటన అనే పరిధి దాటి ఎన్నెన్నో విషయాలను నేను పలువురితో డిస్కస్ చేయగలుగుతున్నాను. అది చాలా గొప్ప అనుభవం. నటనను మిస్ అవుతున్నాననే ఫీలింగ్ అసలు లేదు. కెమెరా వెనక ఉండటంలోనూ థ్రిల్ ఉంది. దాన్ని మించిన ఆనందాన్ని కలిగించే స్క్రిప్ట్ వస్తే తప్ప ఇప్పుడప్పుడే యాక్టింగ్ జోలికి వెళ్లదలచుకోలేదు”
‘‘సినిమా పరిశ్రమకు చెందిన ఓ వ్యక్తితో గతంలో నేను రిలేషన్షిప్లో ఉండేదాన్ని. కానీ ఆ బంధం కొనసాగలేదు. అందుకు కారణాలు రెండే. ఒకటి అతనికి నిత్యం అందుబాటులో ఉండలేకపోవడం, రెండు లాలించలేకపోవడం… ఒక వేళ నేను రేపు పెళ్లి చేసుకున్నా ఇవే విషయాలు పునరావృతమవుతాయి. విడాకులకు దారితీస్తాయి. అలాంటప్పుడు ఆ గందరగోళంలో అడుగుపెట్టడం ఎందుకు’’ అని అంటున్నారు ఛార్మి.
‘నువ్వు మేరేజ్ మెటీరియల్ కాదు’
ఈ విషయం మా నాన్నకు బాగా అర్థమైంది. అందుకే ‘నువ్వు మేరేజ్ మెటీరియల్ కాదు’ అని నాతోనే అంటుంటారు. కానీ మా అమ్మ మాత్రం పెళ్లి చేసుకోమని చెబుతూనే ఉంటుంది. నేను ఒక వ్యక్తితో కలిసి ఉండలేకపోయినప్పుడు పెళ్లి ఎలా చేసుకోగలను? నేను రిలేషన్షిప్లో ఉన్న వ్యక్తి జెమ్లాంటివాడు. నేనే బ్యాడ్. ఎందుకంటే మా బంధం మొదలై.. రోజులు గడిచేకొద్దీ నా ప్రాముఖ్యతలు ఏంటో నాకు అర్థం కాసాగాయి. అందుకే దూరం జరిగాను. అసలు అబ్బాయిలవైపు నా చూపులు మరలే ప్రసక్తే లేదు. నేను ఇప్పుడున్న పరిస్థితుల గురించి నాకు బాగా తెలుసు. ఎవరో బుజ్జగించాలని ఎదురుచూడటం కన్నా, స్పాకి వెళ్తే సాంత్వన పొందుతాను. ప్రస్తుతం నేను ఒంటరితనాన్ని ఆస్వాదిస్తున్నాను. స్వేచ్ఛను మించింది ఏముంటుంది? స్వేచ్ఛగా ఉన్న జీవితాన్ని ముక్కూముఖం తెలియని వ్యక్తి చేతుల్లో పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇప్పటికిప్పుడు ఎవరో నా జీవితంలోకి వచ్చి ‘అదేంటి? ఇదేంటి?’ అని అడుగుతుంటే జవాబులు చెబుతూ కూర్చోవడం నావల్ల కాదు.ప్రస్తుతానికి నా ముందున్న ప్రాధాన్యతలు మూడే…. ఒకటి మా అమ్మానాన్నలు, రెండు నా పెట్స్, మూడు పూరి కనెక్ట్స్. అంతకు మించి ఇంకే విషయాలనూ ఆలోచించడం లేదు’’ అని చెప్పారు.