మంచివాడై , హ్యాండ్సమ్గా ఉండాలి. నవ్వుతూ, నవ్విస్తుండాలి. వంట వచ్చి ఉండాలి… ఇలా తమ కలల రాకుమారుడికి ఉండాల్సిన లక్షణాల గురించి హీరోయిన్ లు చెబుతూ ఉంటారు. ముఖం మీద కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కూడా తన బాయ్‌ఫ్రెండ్‌కు ఉండాల్సిన ప్రధాన లక్షణం గురించి చెప్పారు. అదేమిటంటే.. తన బాయ్‌ఫ్రెండ్ కచ్చితంగా దేశభక్తుడై ఉండాలట. ‘‘నా దేశాన్ని నేనెంతగానో ప్రేమిస్తాను. ఒకవేళ నేను ప్రేమించే వ్యక్తి దేశభక్తుడు కాదని తెలిస్తే, అతనికి బ్రేకప్ చెప్పేస్తా.కన్నభూమి పై అభిమానం లేనివాడు, నాతో విశ్వాసంగా ఉంటాడన్న నమ్మకం నాకు లేదు. నన్ను మాత్రమే ప్రేమిస్తే సరిపోదు. దేశాన్ని కూడా ప్రేమించాలి’’ అని చెప్పుకొచ్చారు కంగనా. అదండీ …. కంగనాకి ప్రపోజ్ చేయాలంటే దేశం మీద భక్తి ఉండాలి.
వివాదాలతో సావాసం చేసే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ రాజకీయాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఢిల్లీలో జరిగిన ‘రైజింగ్ ఇండియా సమ్మిట్’ లో కంగన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…. రాజకీయ రంగం అద్భుతమైనది అన్నారు. కానీ తన లాంటి వారిని ఏ రాజకీయ పార్టీలు తీసుకోవని పేర్కొన్నారు.రాజకీయాలు అంటే చాలా ఇష్టమని, కానీ రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనే లేదని కంగనా తేల్చిచెప్పారు. ప్రధాని నరేంద్రమోదీకి తాను పెద్ద అభిమానినని, ఆయనే తనకి రోల్ మోడల్ అని వెల్లడించారు. ‘నేను కూడా ఆయనలాగా ఎదగాలని కోరుకుంటున్నాను. చాయ్ వాలా నుంచి ప్రధాని స్థాయి వరకు ఎదిగిన మోదీ విజయ గాథ యువతకు ఆదర్శం’అని అన్నారు.
చాయ్‌వాలాను ప్రధానిని చేసిన గొప్ప ప్రజాస్వామ్య దేశం మన ఇండియా అని కొనియాడారు. జాతీయవాదాన్ని గూర్చి మాట్లాడుతూ.. వ్యక్తిగతంగా పురోగతి సాధిస్తే దేశ పురోగతికి సాయం చేసినట్లేనని అభిప్రాయపడ్డారు. ‘ఒక యువతిగా నేను అభివృద్ధి చెందాలనుకుంటున్నాను. అందరూ వ్యక్తిగతంగా అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది’ అని ఆమె అన్నారు.‘భారత్‌లో పుట్టినందుకు గర్విస్తున్నాను. నేను భారతీయురాలిని. అదే నా గుర్తింపు’ అని కంగనా అన్నారు.
భారత్‌లో ఉన్న పాకిస్తానీ కళాకారుల వివాదం గూర్చి మాట్లాడుతూ.. కళాకారులకు ప్రాంతీయభేదం లేదని, వారిది వేరే రాజ్యమని అన్నారు. కళాకారులకు మతాలు, కులాలు, సరిహద్దులు ఉండవని, అంతా ఒకటేనని, వారిది కళాత్మక రాజ్యం అని కంగనా తన అభిప్రాయాన్ని వెలువరించారు.సినిమాల సంగతి కొస్తే వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవితకథ ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’, ప్రకాశ్ కొవెలమూడి దర్శకత్వంలో ‘మెంటల్ హై క్యా’ చిత్రాలతో బిజీగా ఉన్నారు కంగనా.