రకుల్‌ప్రీత్‌సింగ్ టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఎదిగింది. ఇప్పుడిక్కడ అవకాశాలు తగ్గాయని అనుకుంటున్న సమయంలో కోలీవుడ్‌లో బిజీ అయిపోయింది. నిజానికి ‘స్పైడర్’ చిత్రం రకుల్‌ను చాలా నిరాశపరచింది. అంతే కాదు విజయ్‌తో రొమాన్స్ చేసే అవకాశం వచ్చినట్లే వచ్చి పోయింది.దీంతో రకుల్ మరింత డీలా పడిపోయిందనే చెప్పాలి. అలాంటి సమయంలో సూర్య బ్రదర్స్ ఆదుకున్నారు. కార్తీతో నటించిన ‘ధీరన్ అధికారం ఒండ్రు’ (తెలుగులో ‘ఖాకీ’) చిత్ర విజయం రకుల్ప్రీత్సింగ్లో నూతనోత్సాహాన్ని ఇచ్చింది. ఇక సూర్యకు జంటగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటించే అవకాశం రావడం ఈ అమ్మడిలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. అంతే కాదు కార్తీతో మరోసారి కొత్త దర్శకుడు రజత్ రవిచంద్రన్ దర్శకత్వం వహించే చిత్రంలో నటించే చాన్స్‌ను దక్కించుకుంది. ఇదిలా ఉంటే హిందీలో నటించిన ‘అయారి’ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది.ఆజయ్దేవ్గన్తో మరో చిత్రం చేయనుంది.
ఇలాంటి పరిస్థితుల్లో కోలీవుడ్‌లో మరో బిగ్ అవకాశం రకుల్‌ప్రీత్‌సింగ్ తలుపుతట్టింది. అదే వరుస విజయాలతో దూసుకుపోతున్న శివకార్తికేయన్‌తో జత కట్టడానికి రకుల్ రెడీ అవుతోందన్నది తాజా సమాచారం.దీనికి ‘ఇండ్రు నేట్రు నాళై’ చిత్రం ఫేమ్ రవికుమార్ దర్శకత్వం వహిస్తారు.ఇందులో ఆయనకు జంటగా రకుల్‌ప్రీత్‌సింగ్‌ను ఎంపిక చేసినట్లు తాజా సమాచారం. ఇది సైంటిఫిక్ కథాంశంతో తెరకెక్కనున్న చిత్రం అట. ఇందులో రకుల్‌ప్రీత్‌సింగ్ పాత్ర చాలా డిఫెరెంట్‌గా ఉంటుందని చిత్ర దర్శకుడు అంటున్నారు. దీనికి సంగీతమాంత్రికుడు ఏఆర్.రెహ్మాన్ సంగీతబాణీలు కట్టనున్నారు.
ఆ ఇద్దరు హీరోయిన్లే నాకు స్ఫూర్తి !
తెలుగులో పలువురు అగ్ర హీరోల సరసన నటించిన ఢిల్లీ భామ రకుల్ ప్రీత్ సింగ్‌కు ప్రస్తుతం టాలీవుడ్ లో అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం ఆమె ఖాతాలో తెలుగు సినిమాలేవీ లేవు. దీంతో ఆమె తమిళ, బాలీవుడ్ సినిమాలపై దృష్టి సారించింది. ఇటీవల ఆమె కార్తీ సరసన నటించిన `ధీరన్ అధిగారం ఒండ్రుం` (తెలుగులో ‘ఖాకీ’) మంచి విజయం సాధించింది. దీంతో ఆమెకు తమిళం నుంచి పలు అవకాశాలు వస్తున్నాయి. బాలీవుడ్లో కూడా ఆమె ‘అయారి’ సినిమా చేసింది
హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించాలని రకుల్ ఉబలాటపడుతోంది. అందుకోసం తన కంటే ముందు ఇండస్ట్రీలోకి ప్రవేశించిన ఇద్దరు హీరోయిన్ల బాటనే ఆనుసరించాలని భావిస్తోంది. `నాకు అనుష్క, నయనతార అంటే చాలా ఇష్టం. వారి నటన, ఎంచుకునే సినిమాలు చాలా భిన్నంగా ఉంటాయి. అటు కమర్షియల్ సినిమాల్లోనూ, ఇటు కథానాయిక ప్రాధాన్యమున్న సినిమాల్లోనూ నటిస్తూ తమకంటూ ప్రత్యేకమైన మార్కెట్‌ను తయారుచేసుకున్నారు. అందుకే ఇప్పటికీ సినిమాల్లో తమ ఇమేజ్ను కాపాడుకోగలుగుతున్నారు. వారే నాకు స్ఫూర్తి` అని రకుల్ చెప్పింది.