`మా` (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) రజతోత్సవ వేడుకల్లో భాగంగా… కీ.శే.డా.డి.రామానాయుడు 3 వ వర్ధంతి సందర్భంగా `మా` ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ( 16,17,18 తేదీల్లో) భాగంగా తలపెట్టిన నాటకోత్సవాలు శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ ఫిల్మ్ నగర్ హౌసింగ్ సోసైటీ కాంప్లెక్స్ లో ప్రారంభమయ్యాయి. ముందుగా పరుచూరి వెంకటేశ్వరరావు, గోపాలకృష్ణ జ్యోతి ప్రజ్వల చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలి రోజు `జనశ్రేణి` విజయవాడ వారి `గుర్తు తెలియని శవం` (నాటిక) ను ప్రదర్శించారు. నాటికకు వై.ఎస్ కృష్ణేశ్వరరావు దర్శకత్వం వహించారు. యల్లా ప్రగడ భాస్కరరావు నాటకీకరణ. ఎస్. జగన్నాథ శర్మ మూల కథ అందించారు. అనంతరం నటులు, రచయిత, దర్శకులు తనికెళ్ళ భరణి కి `మా` ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం జరిగింది.
ఈ సందర్భంగా హీరో వెంకటేష్ మాట్లాడుతూ… `మా` సిల్వర్ జూబ్లీ వేడుకలు సందర్భంగా నాన్నగారి పేరు మీద నాటకాలు నిర్వహించడం సంతోషంగా ఉంది. `గుర్తు తెలియని శవం` నాటకం చాలా బాగుంది. అందరూ చక్కగా నటించారు. మరో రెండు రోజులు పాటు ఈ నాటకాలు కొనసాగనున్నాయి. అందరూ చూసి ఆనందిస్తారని ఆశిస్తున్నా` అని అన్నారు.
తనికెళ్ల భరణి మాట్లాడుతూ… `నాయుడిగారికి నాటకానికి అవినాభావ సంబంధం ఉంది. ఆయన నా కెప్పుడు సూటుకేసుతో కనిపించేవారు. అది చూసి అందులో అంతా డబ్బే ఉంది అనుకునేవాడిని… అది గ్రహించిన నాయుడుగారు అందులో డబ్బు కాదు ఉండేది స్క్రిప్ట్ అనేవారు. అప్పుడే అర్ధమైంది ఆయన కథలకు ఎంత విలువిస్తారో. వాళ్ల బ్యానర్లో ఎన్నో సినిమాలు చేశాను. అలాగే ఎప్పడు ఇలాగే నాటకాలను నిరంతరం కొనసాగిస్తే బాగుంటుంది. మంచి నాటకం ప్రదర్శించారు. `మా` నన్ను సన్మానించడం చాలా సంతోషంగా ఉంది` అని అన్నారు.
`మా` అధ్యక్షుడు శివాజీ రాజా మాట్లాడుతూ…` కళాకారులు ఎక్కడ సంతోషంగా ఉంటారో ఆ రాష్ట్రం సుఖ సంతోషాలతో ఉంటుంది. మన రాష్ట్రం అలాగే ఉంది. రామానాయుడు గారికి కుల, మతాలతో సంబంధం లేదు. నాలాంటి కళాకారులకు ఆయన దేవుడుతో సమానం. సురేష్ బాబు, వెంకటేష్ కి రామానాయుడు అంటే ఎంత ఇష్టమో భారతీయ సినీ పరిశ్రమకు కూడా ఆయన అంతే ఇష్టం. ఆయన పేరిట మూడు రోజు రోజుల పాటు నాటకాలు నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నాం` అన్నారు.
జనరల్ సెక్రటరీ నరేష్ మాట్లాడుతూ…` సినిమాకి నాటకం అనేది కన్న తల్లి లాంటిది. ఆ తల్లిని ఎప్పుడూ గౌరవించుకోవాలి. కాబట్టి `మా` సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా నాటికల్ని గౌరవించుకోవడం ఓ బాధ్యత భావించి వాటిని నిర్వహిస్తున్నాం. 16 నుంచి 66 వయస్సుగల వారి వరకూ అందరూ రామానాయుడికి మిత్రులు. ఆయన ఈ వేదిక ను రంగస్థలం పై ప్రేమతో నిర్మించారు. ఆయన గుర్తుగా ఈ నాటకాలను నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది` అని అన్నారు.
కోశాధికారి పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ… `ఎన్. టీ రామారావుగారు దీవెనలతో సినీ పరిశ్రమకు వచ్చాం. రామానాయుడు గారి ప్రోత్సాహాంతో ఇండస్ట్రీలో ముందడుగు పడింది. ప్రస్తుతం రామానాయుడు గారీ బ్యానర్లో రెండు సినిమాలకు పనిచేస్తున్నాం. వాటితో అదే బ్యానర్లో 50 సినిమాలు పూర్తిచేసిన వాళ్లం అవుతాం. రామానాయుడు గారు కొత్త వాళ్లకి అవకాశాలివ్వడానికి ఎప్పుడూ ముందుంటారు. అలా ఎంతో మందిని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇక `మా` సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా మంచి కార్యక్రమాలు చేపట్టాం. ఈ సందర్భంగా నాటక రంగం నుంచి వచ్చిన తనికెళ్ల భరణి, ఎల్ బి శ్రీరాం, జయప్రకాశ్ రెడ్డి లను సన్మానిస్తున్నాం` అని అన్నారు.
ఈ కార్యక్రమంలో రామానాయుడు కుటుంబ సభ్యులు సురేష్ బాబు, హీరో వెంకటేష్, అభిరామ్, తెలంగాణ రాస్ట్ర పోలీస్ బోర్డు చైర్మన్ దామోదర్, తెలంగాణ రాస్ట్ర సాస్కృతిక శాఖ (రవీంద్రభారతి డైరెక్టర్) మామిడి హరికృష్ణ , జూబ్లిహిల్స్ కార్పోరేటర్ కాజా సూర్యనారాయణ, దర్శకుడు తేజ, పరుచూరి గోపాలకృష్ణ, వెంకటేశ్వరరావు, రఘుబాబు, `మా` ఎగ్జిక్యుటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్, జాయింట్ సెక్రటరీలు ఏడిద శ్రీరామ్, హేమ, కల్చరల్ కమిటీ చైర్మన్ సురేష్ కొండేటి, కార్యవర్గ సభ్యులు సురేష్, నాగినీడు, ఉత్తేజ్, మాణిక్ తదితరులు పాల్గొన్నారు.
ఈ నాటికలో నటించిన వారికి `మా` 25 ఏళ్ల జ్ఞాపికను వెంకటేష్ అందజేశారు. అలాగే పలువురు ఆహ్వానితులకు `మా` మెమోంటోలను అందించడం జరిగింది.