‘సారిపల్లి కొండలరావు ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 6 న రవీంద్రభారతిలో డా.కె.వి.రమణాచారి 66 వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ జానపద కళాకారులకు పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించారు. గాజన వేణి మల్లయ్య, చిన్నపంగు లక్ష్మయ్య, మేరుగు రాములు గౌడ్, సవారమ్మ, మేడిదుల ఐలయ్య, కొమ్ర లింగు, పెండ్యాల కిష్టయ్య, గుర్రపు రాములు, శాగంటి మల్లయ్య , చిలుకరాజ కొమరమ్మ పురస్కారాలు అందుకున్నారు.
“కళలను ప్రోత్సహిస్తూ ,కళాకారులకు వెన్నుదన్నుగా నిలుస్తున్న రమణాచారి సకల కళలకు బంధువు.కళాకారుల జీవితాల్లో వెలుగు నింపడానికి రమణాచారి జన్మదినోత్సవాలు చేసుకోవడం స్ఫూర్తిగా నిలుస్తోంద”న్నారు. ‘తెలంగాణ సాహిత్య అకాడమి’ ఛైర్మన్ డా.నందిని సిధారెడ్డి . కళలకు జీవం పోయండి.. కళాకారులను బతికించండి. ఆ కళల వెలుగును ఆస్వాదించండి. శాస్త్రీయ, లలిత, భావ, సినీ సాహిత్యానికి, పాటలకు మూలం జానపదం” అని అన్నారు.
‘పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం’ ఉపాధ్యక్షులు ఆచార్య ఎస్వీ సత్యనారాయణ మాట్లాడుతూ.. జానపదులు అసలు సిసలైన జ్ఞానపదులని కొనియాడారు. ప్రముఖ సినీ కవి డా.సుద్దాల అశోక్‌తేజ, ‘భాషా సాంస్కృతిక శాఖ’ సంచాలకులు మామిడి హరికృష్ణ, ‘తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం’ అధ్యక్షులు శ్రీనివాస్‌గౌడ్, కార్యదర్శి లింగయ్య, నారాయణలు పురస్కారాలు అందుకున్న జానపద కళాకారులను అభినందించారు. ఈ కార్యక్రమం లో సారిపల్లి కొండలరావు, ‘యువకళావాహిని’ వై. కె. నాగేశ్వరరావు పాల్గొన్నారు.