ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థ ‘మనం సైతం’ దిగ్విజయంగా తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తోంది. సంస్థ కార్యక్రమాల గురించి తెలుసుకున్న ఎంతో మంది నిస్సహాయులు మనం సైతం చెంతకు చేరుతున్నారు. అలా వచ్చిన వారికి సహాయం చేస్తూ మనం సైతం సంస్థ తన సేవా దృక్పథాన్ని చాటుకుంటోంది. శనివారం ఏడుగురు అభాగ్యులకు ‘మనం సైతం’ ఆర్థిక సహాయం అందించింది. హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సహజనటి జయసుధ, హాస్య నటుడు డాక్టర్ బ్రహ్మానందం, దర్శకులు హరీష్ శంకర్, కథానాయకుడు సుధీర్ బాబు, కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమలో వివిధ విభాగాల్లో పనిచేస్తూ అనారోగ్యం పాలై అండ కోసం ఎదురుచూస్తున్న ఏడుగురికి చెక్ లను అందజేశారు.
అనంతరం ‘మనం సైతం’ నిర్వాహకులు కాదంబరి కిరణ్ మాట్లాడుతూ….ఒక్కరితో మొదలైన మనం సైతం ఇవాళ లక్ష మందికి పైగా సభ్యులతో బలోపేతమవుతోంది. సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే చేయి అందించే మనసున్న వాళ్లు ఎందరో ఉంటారు. జీవితంలో మనల్ని భగవంతుడు తన చేత్తో అభివృద్ధిలోకి తీసుకెళ్తున్నప్పుడు…మనం మరో చేయి చాస్తే…ఆ అండతో కొన్ని వేల లక్షల మంది ఆసరా పొందుతారు. ఈ విషయాన్ని నమ్మాను కాబట్టి మనం సైతం సంస్థను భుజాలకు ఎత్తుకున్నాను. మనం సైతం కార్యక్రమాలు చూసి చిరంజీవి, పవన్ కళ్యాణ్, కొరటాల శివ, పూరీ జగన్నాథ్, టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్, మనం సైతం సభ్యుడు బందరు బాబీ సతీమణి కవిత ఇలా ఎందరో స్పందించారు. ఆర్థిక సహాయం అందించి మనం సైతం వెంట తామూ ఉన్నామనే భరోసా కలిగించారు. యూకే నుంచి రామ్ నామనగిరి అనే వ్యక్తి ఫోన్ చేసి మీ అక్కౌంట్ కు లక్షా యాభై వేల రూపాయలు పంపించాను. ఎవరికైనా సహాయం చేయండి అన్నారు. ఆయనెవరో నాకు తెలియదు. యూట్యూబ్ లో మా సంస్థ కార్యక్రమాలు చూసి స్పందించాడు. అలా వంద రూపాయల నుంచి లక్షల రూపాయల వరకు సహాయం చేస్తున్న దాతలున్నారు. వాళ్లందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అన్నారు.
సహజ నటి జయసుధ మాట్లాడుతూ….ఛారిటీ కార్యక్రమాలు చేయడం అంత సులువైన విషయం కాదు. ఎంతో పట్టుదల, ఓపిక ఉండాలి. నేనూ గతంలో ఓ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించాను. కానీ కొనసాగించలేక పోయాను. మనం సైతం కు ఓ మంచి బృందం ఉంది. వీళ్లంతా కలిసి కట్టుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నా దృష్టిలో సేవ చాలా కష్టం కానీ…సేవను మించిన తృప్తి ఉండదు. నా సహకారం మనం సైతంకు ఎప్పుడూ ఉంటుంది. అన్నారు.
ప్రముఖ హాస్య నటుడు డాక్టర్ బ్రహ్మానందం మాట్లాడుతూ….నేను సేవా కార్యక్రమాలకు దూరంగా ఉంటానని చాలామంది అనుకుంటారు. కానీ నా జీవితంలో ఎంతో మందికి సహాయం చేశాను. అది ఎవరికీ తెలియదు. కాదంబరి కిరణ్ నాకు 30 ఏళ్లుగా తెలుసు. నా తొలి చిత్రంలో నాతో కలిసి కాదంబరి నటించారు. ఎప్పుడూ ఏదో వ్యాపకంలో ఉండటం కాదంబరికి అలవాటు. దేవుడు కొంతమందిని ఎంచుకుని వాళ్ల ద్వారా సేవా కార్యక్రమాలు చేయిస్తాడు. అలా కాదంబరిని ఎన్నుకుని మనం సైతం కార్యక్రమాన్ని ప్రారంభించాడు. నింగీ నేలా ఉన్నంతకాలం మనం సైతం వెంట నడుస్తాను. అన్నారు.
దర్శకులు హరీష్ శంకర్ మాట్లాడుతూ….ఏ జీవికైనా దెబ్బ తగిలితే బాధ పడుతుంది. మనిషి కూడా తనకు కష్టమొస్తే బాధపడతాడు. కానీ ఎదుటివారి కష్టానికి బాధపడేవారే నిజమైన మనిషి. ఇప్పుడు లక్ష మందికి చేరిన ఈ సంస్థ కోటి, పదికోట్ల సభ్యులకు చేరాలి. నేను ఎంత సహాయం చేస్తాను అని చెప్పను ఏ సహాయం కావాలన్నా మనస్ఫూర్తిగా అందిస్తాను అన్నారు.
కథానాయకుడు సుధీర్ బాబు మాట్లాడుతూ….నేనూ కాదంబరి గారు కలిసి ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తున్నాం. ఆయనను చూసిన ప్రతిసారీ ఓ తేజస్సు కనిపిస్తుంది. మనసులో స్వచ్ఛంగా ఉన్న వాళ్లకే అలాంటి తేజస్సు ఉంటుంది. వాళ్లు మంచి నటులు కూడా అవుతారు. మనస్సే నటుడి అభినయంలో ప్రతిబింబిస్తుందని నేను నమ్ముతాను. మనం సైతంలో ఇప్పటి నుంచి నేనూ భాగమే అని చెబుతున్నాను. అన్నారు.
ఈ కార్యక్రమంలో మనం సైతం సభ్యులు బందరు బాబీ, సురేష్, వేణు, గాయని విజయలక్ష్మి, కవిత తదితరులు పాల్గొన్నారు.