‘పద్మావత్‌’ కలెక్షన్లతో భూమి దద్దరిల్లుతుంది !

‘పద్మావత్‌’ చిత్ర కథానాయిక దీపిక ‘పద్మావత్‌’ సినిమా కలెక్షన్లతో భూమి దద్దరిల్లుతుంద’ని ఎంతో నమ్మకంగా చెబుతోంది.భారతీయ చలనచిత్ర చరిత్రలో ఇంతవరకూ ఏ సినిమాకూ రాని వివాదాలు సంజయ్‌లీలా భన్సాలి ‘పద్మావత్‌’ చిత్రాన్ని చుట్టుముట్టాయి, ఉక్కిరిబిక్కిరి చేశాయి. సినిమా తీసిన సంజయ్‌లీలా భన్సాలీని , పద్మావతి పాత్ర పోషించిన దీపికను చంపేస్తామని బెదిరించే వరకూ వ్యవహారం వెళ్లిందంటే ఊహించుకోవచ్చు. దర్శకునిగా సంజయ్‌లీలా భన్సాలీ ప్రతిభ గురించి తెలిసినవారంతా ‘పద్మావత్‌’ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే ఊహించని ఈ వివాదాల వల్ల అసలు ఆ సినిమా విడుదలవుతుందా, లేదా? అనే అనుమానం కూడా కలిగింది. ఎలాగైతేనేం మబ్బులు తొలగిపోయాయి. రాజ్‌పుత్‌ కర్ణిసేన, రాష్ట్రప్రభుత్వ నిషేధాల నడుమ గురువారం ‘పద్మావత్‌’ చిత్రం విడుదలైంది. వివాదం ఉన్న చోట ఉత్కంఠ, ఆసక్తి ఉంటుంది. ఈ సినిమా చూడకూడదని ఓ వర్గం కత్తులు నూరినా, చూడాలనే ఆసక్తి కనబర్చిన వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. బుధవారం ముంబైలో వేసిన ప్రీమియర్‌ షో టిక్కెట్‌ రేటు రూ. 2400 పలకడమే దీనికి ఓ నిదర్శనం. ప్రీమియర్‌ షోల వల్ల కేవలం ఒక్కరోజులోనే ఈ సినిమా రూ. 5 కోట్లు కలెక్షన్లు రాబట్టిందని సినీ విశ్లేషకుడు తరుణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు. మరో పక్క చిత్ర కథానాయిక దీపిక ‘పద్మావత్‌’ సినిమా కలెక్షన్లతో భూమి దద్దరిల్లుతుంద’ని ఎంతో నమ్మకంగా చెబుతోంది.
వారిద్దరి కంటే ఆమెనే ఎక్కువ తీసుకుంది ! 
ఆ చిత్రం లో ఇద్దరు స్టార్ హీరోలు… వీరిద్దరి కంటే హీరోయిన్ కే  రెమ్యునరేషన్ ఎక్కువ ఇచ్చారు. సినిమా ఏదైనా.. రెమ్యునరేషన్ విషయానికి వస్తే హీరోకే ఎక్కువ చెల్లిస్తుంది చిత్రబృందం. కానీ ‘పద్మావత్’ సినిమా విషయంలో ఇది తిరగబడింది. టైటిల్ రోల్‌ దీపికా పదుకొణె‌కి సంబంధించిదే అయినప్పటికీ… ఆమెతో పాటు ధీటైన పాత్రల్లో నటించింది స్టార్ హీరోలు కావడం విశేషం. దీపిక పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉందో రణవీర్ సింగ్, షాహిద్ కపూర్‌కి సంబంధించిన పాత్రలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. అయితే వీరిద్దరి కంటే దీపికకు రెమ్యునరేషన్ ఎక్కువ ఇవ్వడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ విషయాన్ని దీపిక ఓ టీవీ షోలో స్వయంగా ఒప్పుకుంది….

నేహా ధూపియా హోస్ట్‌గా చేస్తున్న ఓ షోకి దీపిక తన సోదరి అనీషాతో కలిసి హాజరైంది. ఆ షోలో నేహా ‘పద్మావత్‌’కి నీకు ఎంత రెమ్యునరేషన్ వచ్చిందని ప్రశ్నిస్తే… దీనికి సమాధానం చెప్పేందుకు దీపిక నిరాకరించింది. వెంటనే నేహా …నువ్వు రణవీర్, షాహిద్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ పొందావా? అని దీపికను ప్రశ్నించింది. దీనికి దీపిక ‘అవును’ అని చెప్పింది. రణవీర్, షాహిద్‌లు చెరో రూ.10కోట్లు రెమ్యునరేషన్ పొందితే.. దీపిక మాత్రం రూ.13కోట్లు తీసుకుందని కొద్ది రోజుల క్రితం వార్తలు వెలువడ్డాయి. తాజాగా దీపిక ఈ విషయాన్ని ఒప్పుకోవడంతో ఆ వార్తలకు బలం చేకూరినట్టైంది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పద్మావత్’ సక్సెస్ టాక్‌తో నడుస్తోంది.

 

‘ఫేస్‌బుక్‌’ పేజీ కూడా పెద్ద షాకిచ్చింది !

ఎన్నో వివాదాలు, మరెన్నో ఆందోళనల మధ్య సంజయ్‌ లీలా భన్సాలీ మూవీ ‘పద్మావత్‌’ నేడు(గురువారం) ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అటు కర్ణిసేన ఆందోళనలతో తీవ్ర చిక్కుల్లో కూరుకున్న ఈ మూవీకి, ఓ ఫేస్‌బుక్‌ పేజీ కూడా తీవ్ర షాకిచ్చింది. పద్మావత్‌ ఫుల్‌ మూవీని ఫేస్‌బుక్‌లో లీక్‌ చేసింది. ‘ జాటోన్‌ కా అడ్డ’ అనే ఫేస్‌బుక్‌ పేజీ, థియేటర్‌లో స్క్రీన్‌ అవుతున్న ఈ మూవీని లైవ్‌ స్ట్రీమ్‌ చేసింది. ఇలా లైవ్‌ స్ట్రీమ్‌ అవుతున్న సమయంలోనే ఈ ఫేస్‌బుక్‌ పేజీ లింక్‌ను 15వేల మంది షేర్‌ చేయగా… ఈ వీడియోకు 3.5 లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి. ఇప్పటికే కర్ణిసేన విధ్వంసనలతో తీవ్రంగా ఆందోళన చెందుతున్న మూవీ యూనిట్‌ సభ్యులకు ఇది మరింత దిగ్భ్రాంతికి గురి చేసింది.

కాగ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, గోవా, గుజరాత్‌ రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదల ఆపివేశారు. రాజ్‌పుత్‌ల ప్రభావం బలంగా ఉండడం, ప్రజల సెంటిమెంట్, కర్ణిసేన హెచ్చరికలు తదితర కారణాల వల్ల అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకుంటాయనే భావనతో ఇక్కడ మల్టీప్లెక్స్ యజమానుల సంఘం సినిమాను ప్రదర్శించబోమని ప్రకటించింది. దక్షిణాది రాష్ట్రాల్లో పద్మావత్‌ ప్రదర్శన సాఫీగా సాగుతోంది.