‘ఇందిరా గాంధీ పాత్రలో నటించాలనే నా కల నెరవేరబోతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది’ అని అంటోంది విద్యా బాలన్. వైవిధ్యమైన పాత్రలు, భిన్న ప్రయోగాల సినిమాలు, మహిళా ఇతివృత్త చిత్రాలకు విద్యా కేరాఫ్‌గా నిలిచిన విషయం విదితమే. అలనాటి శృంగార తార సిల్క్‌స్మిత జీవిత చరిత్రతో తెరకెక్కించిన ‘డర్టిపిక్చర్’ చిత్రంలో నటించి జాతీయ అవార్డును అందుకున్న విద్యాబాలన్ తాజాగా ‘ఇందిరాగాంధీ జీవిత చరిత్ర’లో నటించనున్నారు. ఆమె ఇందిరాగాంధీగా ప్రేక్షకులకు కనిపించబోతోంది.
భారతీయ మొదటి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఓ సినిమాను బాలీవుడ్లో తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రైటర్ సాగరిక ఘోష్ రాసిన ‘ఇందిరా: ఇండియా మోస్ట్ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్’ అనే పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ‘ఇందిరా గాంధీ పాత్రలో నటించేందుకే ఇందిరాపై సాగరిక ఘోష్ రాసిన పుస్తక హక్కులను దక్కించుకున్నాం. అయితే దీన్ని వెబ్ సిరీస్‌గా తీయాలా లేదా సినిమాగా తీయాలన్నది ఇంకా నిర్ణయించలేదు’ అని విద్యాబాలన్ తెలిపింది. ‘నా పుస్తక హక్కులను విద్యాబాలన్, రాయ్ కపూర్ ప్రొడక్షన్స్ వాళ్ళు దక్కించుకున్నారు. ఇందిరగా విద్యాను తెరపై చూసేందుకు ఎగ్జైటింగ్‌గా ఎదురు చూస్తున్నాను’ సాగరిక ఘోష్ చెప్పారు.
మహాత్మాగాంధీ హత్య ఉదంతం అనంతరం అంతకుపైగా కలకలం పుట్టించిన దుర్ఘటన ఇందిరాగాంధీ దారుణ హత్య. 16 ఏళ్లుగా భారత ప్రధాన మంత్రిగా పరిపాలించిన ఏకైక మహిళా ప్రధానిగా కీర్తిగడించిన ఇందిరా గాంధీ 1984 అక్టోబర్ 31 ఢిల్లీలోని తన స్వగృహంలో, తన సెక్యూరిటీ చేతే కాల్చబడి నేలకూలిన సంఘటన దేశాన్ని కదలించింది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.