‘సినిమాల్లోనే కాదు, టీవీ సీరియల్స్‌లోనూ నటించేందుకు నేను సిద్ధంగానే ఉన్నాను’ అని అంటోంది ఇలియానా. ‘దేవదాసు’, ‘పోకిరి’, ‘జల్సా’, ‘కిక్’, ‘జులాయి’ వంటి తదితర చిత్రాలతో తెలుగునాట ఇలియానా మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్లి అక్కడే సెటిలైన హీరోయిన్లలో గోవా సుందరి ఇలియానా ఒకరు. బాలీవుడ్లో పలు అవకాశాలొచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో సినిమాలు సక్సెస్ కాకపోవడంతో తన ప్రత్యేకతను చాటుకోలేకపోయింది. దీంతో ఇటీవల అవకాశాలు తగ్గాయి. ఈ నేపథ్యంలో టీవీ సీరియల్స్‌లోనూ నటించేందుకు సిద్ధమవుతోందట. ఈ విషయం గురించి ఇలియానా మాట్లాడుతూ,తాను టీవీ సీరియల్స్ లో నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇలియానా చెప్పగానే, ఇక సిల్వర్ స్క్రీన్ నుంచి ఆమె తప్పుకోనుందేమోనని ఇండస్ట్రీ వర్గాలు ఒక్కసారిగా షాక్ తిన్నాయి.
అసలు విషయం ఏంటంటే….. తాను నటించిన మూవీ ‘ముబారకన్’ శనివారం సోని మ్యాక్స్ లో ప్రసారం అవుతుందని, అందరూ మూవీని చూడాల్సిందిగా నటి ఇలియానా ప్రమోట్ చేసుకున్నారు. దీనిపై కొందరు స్పందిస్తూ.. “ఎన్నో సినిమాల్లో నటించారు, బుల్లితెరపై కనిపించే ఆలోచన లేదా?” అంటూ ఆమెను అడిగారు. సీరియల్స్ లో నటిస్తానని కచ్చితంగా చెప్పలేను. అయితే ఛాలెంజింగ్ రోల్ దొరికితే టీవీ సీరియల్స్ లో కనిపించేందుకు తనకు ఏ ఇబ్బంది లేదన్నారు ఇలియానా. సినిమా నచ్చితే థియేటర్లకు మళ్లీ మళ్లీ వచ్చి చూసి ప్రేక్షకులు మమ్మల్ని ఆదరిస్తారు. సీరియల్స్ లో అలాంటి అవకాశం ఉండదు. కీలకపాత్ర వస్తే మాత్రం బుల్లితెరపై కనిపించేందుకు వెనుకాడనని స్పష్టం చేశారు. అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించిన ‘ముబారకన్’ లో అనిల్ కపూర్, అతియా శెట్టి, అర్జున్ కపూర్ లు ప్రధాన పాత్రలు పోషించారు.ఇలియానా ప్రస్తుతం హిందీలో ‘రైడ్’ చిత్రంలో నటిస్తోంది. రాజ్‌కుమార్ గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్నారు.
ఉజ్మా అహ్మద్ బయోపిక్ లో ….
ఓ బయోపిక్‌లో ఇలియానాను నటింపజేయడానికి బాలీవుడ్ దర్శకుడు శివమ్‌నాయర్ నేతృత్వంలో రంగం సిద్ధమవుతోంది. తాప్పీ ముఖ్య పాత్రలో వచ్చిన ‘నామ్ షబానా’ చిత్రానికి నాయర్ దర్శకుడు. ఇప్పుడు ఉజ్మా అహ్మద్ బయోపిక్‌ను తెరకెక్కించనున్నారు. ఉజ్మా అహ్మద్ ఎవరనే విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. అయినా చెబుతున్నాం. మలేసియాలో పరిచయమైన పాకిస్తాన్ పౌరుడు తాహీర్ అలీని ఆమె ఇష్టపడింది. అతన్ని కలిసేందుకు పాకిస్తాన్ వెళ్లింది. కానీ, తాహీర్‌కు ఇదివరకే వివాహం అవ్వడమే కాదు.
నలుగురు పిల్లలకు తండ్రి కూడా. అయినా మళ్లీ పెళ్లిచేసుకోవాలనుకుంటాడు. నిజం తెలుసుకున్న ఉజ్మా అహ్మద్ ఎలాగోలా అతడి బారి నుంచి తప్పించుకుని భారత హై కమీషన్‌ను సంప్రదించి తిరిగి ఇండియా చేరుకుంది. ఈ సంఘటనలో కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఉజ్మా జీవితంలో జరిగిన ఆ సంఘటన ఆధారంగానే ఈ సినిమాను రూపొందించనున్నారు. ‘‘అవును.. ఇలియానాను కలిశాను. ఈ సినిమాకు తనే కరెక్ట్. అమాయకత్వం, ఆత్మవిశ్వాసం కలగలిసిన అమ్మాయి ఇలియానా.ఈ సినిమా ఐడియా చెప్పినప్పుడు ఆమె ఎగ్జైట్ అయ్యింది. ఉజ్మాఅహ్మద్ను కలిశాం. స్క్రిప్ట్‌ను డెవలప్ చేస్తున్నా. కంప్లీట్ అయిన తర్వాత ఇలియానాకు ఫుల్ స్టోరీ చెప్తా’’ అని పేర్కొన్నారు శివమ్‌నాయర్.