పవన్ కల్యాణ్ నటించిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం 2018 సంక్రాంతి కానుకగా విడుదలకాబోతుందనే విషయం తెలిసిందే. అయితే ‘అజ్ఞాతవాసి’తో పవన్ కల్యాణ్ సినీ ప్రియులకు షాక్ ఇవ్వబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విషయంలోకి వస్తే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ‘అజ్ఞాతవాసి’ చిత్ర బడ్జెట్ ఇప్పటికే 100 కోట్లు మించిందని తెలుస్తుంది. అయితే ఓవరాల్‌గా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 150 కోట్లు చేస్తుందనే టాక్ ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. జనవరి 10 నుంచి థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా టికెట్ ధరను పెంచనున్నారనే వార్తలు వినిపిస్తుండటంతో సినీ ప్రియులు షాక్‌కి గురవుతున్నారు.
పెద్ద సినిమాలకు ‘యూనిఫామ్ టికెట్’ అనే విధానాన్ని ఈ చిత్రంతో ఆచరణలోకి తీసుకురానున్నారట. అంటే …ఆ సినిమా టికెట్ ధర రెగ్యులర్ సినిమాల టికెట్ ధరల కంటే అధిక మొత్తంలో ఉండనుంది. ప్రస్తుతం మల్టీప్లెక్స్ థియేటర్స్‌లో 150 నుంచి 250 రూపాయల వరకు టికెట్ ధరలు ఉన్నాయి. అయితే ‘అజ్ఞాతవాసి’ సినిమాకి అన్ని థియేటర్స్‌లో టికెట్ ధర రూ.200 ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. దీనికోసం రెండు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి అనుమతుల కోసం చిత్ర నిర్మాత, బయ్యర్స్ ప్రయత్నిస్తున్నారనే వార్తలు తాజాగా సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి.