`మా` మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈ ఏడాదితో 25వ వసంతంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించేలా `మా` నూతన కార్యవర్గం ప్లాన్ చేసిన విషయం విధితమే. దీనిలో భాగంగా శనివారం సాయంత్రం హైదరాబాద్ ఎఫ్ .ఎన్ .సి.సి కల్చరల్ సెంటర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వేడుకలు సంబంధించిన వివరాలను తెలియజేశారు. ఇదే వేదికపై సీనియర్ నటుడు రాళ్లపల్లి, సీనియర్ పాత్రికేయలు గుడిపూడి శ్రీహరి, నటుడు శివ బాలాజీల ను `మా` తరుపున `మా` అధ్యక్షులు శివాజీ రాజా, జనరల్ సెక్రటరీ నరేష్ ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా `మా` అధ్యక్షుడు శివాజీ రాజా మాట్లాడుతూ,` `24 ఏళ్ల క్రిందట చిరంజీవిగారు స్థాపించిన `మా` దిగ్విజయంగా 25 సంవత్సరంలోకి అడుగు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా `ఐయామ్ విత్ ‘మా` నినాదంతో సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా చేస్తున్నాం. అందుకు టాలీవుడ్ సెలబ్రిటీలంతా కలిసి వస్తున్నారు. చిరంజీవి , బాలకృష్ణ నాగార్జున, వెంకటేష్,గార్లను అడగగానే ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నామని భరోసా ఇచ్చారు. మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కూడా సపోర్ట్ ఇస్తామన్నారు. వాళ్లందరి సహకారం ఉండటం వలనే ఈరోజు `మా` ఈ స్థాయిలో ఉంది. ఈ రెండేళ్ల పాటు వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ప్లాన్ చేశాం. ఈ వేడుకలకు శుభ సూచికంగా `గోల్డేజ్ హోమ్` ను ఏర్పాటు చేయబోతున్నాం. వయసు మళ్లిన పేద కళాకారులకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే మరెన్నోసంక్షేమ కార్యక్రమాలు తలపెట్టాం. తెలంగాణ రాష్ట్రం లో జరిగే తెలుగు మహాభలకు `మా` తరపున పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నాం. మీడియా సహకారం `మా` టీమ్ కు ఎప్పటికప్పుడు అందుతూనే ఉంది. అందుకు `మా` తరుపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం` అని అన్నారు.
జనరల్ సెక్రటరీ నరేష్ మాట్లాడుతూ ` చిరంజీవిగారు అధ్యక్షతన ఏర్పాటైన `మా` రజతోత్సవాలను ఈ ఏడాది మా చేతుల మీదుగా జరపడం `మా` నూతన కార్యవర్గం అదృష్టంగా భావిస్తున్నాం. వెల్పేర్, ఎంటర్ టైన్ మెంట్ కార్యక్రమాలు ఎజెండాగానే ‘మా’ ముందుకు వెళ్తుంది. గోల్డేజ్ హోం ఏర్పాటు, మా కు సొంత భవనం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నాం. అలాగే ఈనెల 10వ తేదిన కర్టైన్ రైజర్ ఫంక్షన్ పార్క్ హయత్ లో గ్రాండ్ గా చేస్తున్నాం. సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణం రాజు గారు చేతుల మీదుగా ఈ వేడుక జరగనుంది. అనంతరం ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు ప్రజల ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరగనున్నాయి. దీనిలో భాగంగా సీనియర్ నటీమణులు జయసుధ, రొజా రమణి తదితరులను ఘనంగా సన్మానించనున్నాం` అని అన్నారు.
ఎగ్జిక్యుటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ మాట్లాడుతూ, ` `మా` లో ఈరోజు ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకూ అద్యక్ష పదవిలో ఉన్న వారంతా మంచి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. అందువల్లే `మా`కు మంచి పేరు వచ్చింది. శివాజీ రాజా అధ్యక్షతన ఏర్పాటైన నూతన కార్యవర్గంలో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫండ్ రెయిజింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి` అని అన్నారు.
కోశాధికారి పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ,` రాళ్లపల్లి..శ్రీహరి గారితో నాకు మంచి అనుబంధం ఉంది. అటు సినిమా….ఇటు జర్నలిజం కు చెందిన ఇద్దరు వ్యక్తులను సన్మానించడం చాలా సంతోషంగా ఉంది. ఇలాగే మరింత మంది గొప్ప వ్యక్తులను `మా` సత్కరించేలా ప్లాన్ చేస్తున్నాం` అని అన్నారు.
సీనియర్ నటుడు రాళ్లపల్లి మాట్లాడుతూ,` ప్రస్తుతం పోటీ ప్రపంచంలో నాకు అవకాశాలు తగ్గాయి. అయినా సంతోషం. పరిశ్రమకు కొత్త నీరు వస్తోంది. ప్రతిభ ఉన్న కళాకారులు వెలుగులోకి వస్తున్నారు. కళాకారుడంటే నిత్య విద్యార్ధి. అలా కష్టపడితేనే ఇక్కడ రాణించగలం. అలాగే `మా` లో 25 ఏళ్లగా మెంబర్ గా ఉన్నాను. ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. గోల్డేజ్ హోమ్ ఏర్పాటు చేయడం అనేది మంచి నిర్ణయం. తోడు..నీడ లేని వాళ్లకు అది ఎంతో ఆశ్రయాన్ని ఇస్తుంది. ఈ మంచి కార్యక్రమానికి నా వంతు కూడా చేతనైన సహాయం చేస్తాను` అని అన్నారు.
సీనియర్ పాత్రికేయుడు గుడిపూడి శ్రీహరి మాట్లాడుతూ, `అందరు కలిసి కట్టుగా ఒకే తాటిపై ఉండటం అనేది అసోసియేషన్ కు ప్రధానమైన బలం. అది `మా` లో ఉంది. మంచి సంక్షేమ కార్యక్రమాలతో కొత్త టీమ్ ముందుకు వెళ్తోంది. చాలా సంతోషంగా ఉంది. అలాగే నేను జర్నలిస్ట్ అయినా `మాకు స్వాతంత్ర్యం కావాలి` సినిమాకు సినిమాకు కథ రాశాను. అలాంటి సినిమాలు ఇప్పుడు రావడం లేదు. ప్రజల్ని చైతన్య పరిచే విధంగా మంచి కథలున్న సినిమాలు తీయాలని కోరుకుంటున్నా` అన్నారు.
`బిగ్ బాస్` విన్నర్ శివ బాలాజీ మాట్లాడుతూ,`నేను సమస్యల్లో ఉన్నప్పుడు `మా` ఆదుకుంది. అలాగే ఈరోజు నన్ను గుర్తించి సత్కరించడం అనేది జీవితాంతం మర్చిపోలేనిది. ఇదొక అవార్డుగా…పెద్ద గౌరవంగా భావిస్తున్నాను` అని అన్నారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ బెనర్జీ, జాయింట్ సెక్రటరీలు ఏడిద శ్రీరామ్, హేమ `మా` కల్చరల్ కమిటీ చైర్మన్ సురేష్ కొండేటి, కార్యవర్గ సభ్యు లు సురేష్, ఉత్తేజ్, అనితాచౌదరి, గీతా సింగ్ తదితరులు పాల్గోన్నారు.