టెక్నాలజీతో వేగవంతం అవుతున్న సినిమా నిర్మాణం !

గోవా, నవంబర్ 23 : టెక్నాలజీ రంగంలో వచ్చిన నూతన మార్పుల వలన చిత్ర నిర్మాణం వేగంగా జరుగుతోందని, మంచి కెమెరా ఉన్న ఫోన్ తో సైతం ఎవరైనా సినిమా తీయొచ్చని వక్తలు అభిప్రాయపడ్డారు. గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో భాగంగా గురువారం నాడు రెండో రోజు ఓపెన్ ఫోరం కార్యక్రమం జరిగింది. సినిమా నిర్మాణం, కొత్త టెక్నాలజీ, ప్రేక్షకులు, మార్కెటింగ్ రంగాల్లో పరిస్థితి అనే అంశంపై జరిగిన చర్చలో కర్నాటక ఫెస్టివల్ డైరెక్టర్ విద్యాశంకర్, వియత్నాం దర్శకుడు డంగ్, రాజస్తాన్ ఫిల్మ్ మేకర్ శ్రేయాస్ జైన్, ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ భరత్ తదితరులు పాల్గొన్నారు.
 
          ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా సినిమా నిర్మాణం మారాల్సి ఉంటుందని విద్యాశంకర్ అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరు సినిమా తీయెచ్చని, వాటిని చూపించడానికి ఎలాంటి మౌలిక వసతులు ఉన్నాయన్నదే ఇప్పుడు ప్రధానంగా ఆలోచించాల్సి ఉందని చెప్పారు. సినిమా నిర్మాణం ఒక్కటే ముఖ్యం కాదనీ, విద్యలో సినిమాను కూడా భాగం చేసినప్పుడే ప్రేక్షకులు పెరుగుతారని చెప్పారు. సినిమా పంపిణీ ఏజెంట్ల చేతుల్లోకి వెళ్ళిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
 
          ‘ఫాదర్ అండ్ సన్’ సినిమా తీసిన వియత్నాం దర్శకుడు డంగ్ మాట్లాడుతూ… తమ దేశంలో సినిమాకు ఇంకా ఆదరణ పెరగాల్సి ఉందని అన్నారు. సరైన వనరులు లేక సినిమా నిర్మాణానికి చాలా సమయం పడుతోందని, ఈ విషయంలో భారతదేశంలో మంచి సహకారమే ఉందని అన్నారు. తన సినిమాను వియత్నాంలో నిర్మాతలు ఒప్పుకోలేదని, అందుకే ఫిల్మ్ ఫెస్టివల్ కు పంపి అవార్డులు గెలుచుకున్నానని చెప్పారు. కేవలం రిస్క్ తీసుకొనే ధైర్యం ఉన్నవారు మాత్రమే సినిమా నిర్మాణంలో అడుగుపెట్టాలని రాజస్తాన్ డైరెక్టర్ జైన్ చెప్పారు.
 
          సినిమా నిర్మాణంలో ఎక్కువ విభాగాల్లో ప్రావీణ్యం సంపాదిస్తే తక్కువ బడ్జెట్ లో నే సినిమా తీయవచ్చని భరత్ మిర్లె అభిప్రాయపడ్డారు. ఇంటర్నెట్ ద్వారా అన్ని అంశాలను తెలుసుకొని మంచి సినిమాలు తీయడానికి అవకాశం ఎంతో ఉందని చెప్పారు. ఫెడరేషన్ రీజనల్ సెక్రటరీ జికెశ్యామ్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ సెక్రటరీ బిహెచ్ ఎస్ ఎస్ ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.
 
      – గోవా నుంచి.. బిహెచ్ ఎస్ ఎస్ ప్రకాష్ రెడ్డి, హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ సెక్రటరీ 9110301476