గడ్డంపల్లి రవీందర్ రెడ్డి (యుఎస్) సమర్పణలో ప్రకాష్ పులిజాల దర్శకత్వం లో ఎస్ ఎస్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ నిర్మించిన చిత్రం ‘అనగనగా ఒక దుర్గ’. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఈనెల 27న విడుదలకు సిద్దమవుతోంది. ఈ సందర్భంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు చిత్ర యూనిట్.
నిర్మాత గడ్డంపల్లి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ…సమాజం గురించి మంచి సినిమాలు, పాటలు వచ్చి చాలా కాలమవుతోంది. మా చిత్రం ఆ లోటు తీర్చుతుంది. నేను అమెరికాలో ఉన్నా ఆలోచనలు మనవాళ్ల గురించి వస్తుంటాయి. మహిళల వివక్ష ప్రపంచం అంతటా ఉంది. ఈ సార్వజనిక కథను సినిమా గా నిర్మించాం. విడుదలకు ముందే ప్రీమియర్ షో లు వేశాం. అందరూ సినిమా బాగుందన్నారు. ‘ఒసేయ్ రాములమ్మ’, ‘ప్రతిఘటన’ చిత్రాల తరహాలో ప్రేక్షకులను చైతన్య పరుస్తుందని అనుకుంటున్నాం. యూనివర్సల్ సబ్జెక్ట్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 27న విడుదల చేస్తున్నాం అని తెలిపారు.
దర్శకుడు ప్రకాష్ పులిజాల మాట్లాడుతూ… సమాజంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాల, అకృత్యాల ఆగడాలను దుర్గ అనే మహిళ ఎలా ఎదుర్కొని వాటి నిర్మూలనకు పాటు పడిందనే లేడీ ఓరియెంటెడ్ కధాచిత్రమే మా ‘అనగనగా ఒక దుర్గ’. చిన్న సినిమాల ట్రెండ్ నడుస్తున్న ఇటీవల కాలంలో ఈ సినిమాను విడుదల చేయడం జరుగుతోంది. ఇదివరకే ఈ చిత్ర ప్రివ్యూ ను వేయడం జరిగింది. చూసిన వారందరూ అభినందించడం జరిగింది అన్నారు.
నిర్మాత రాంబాబు మాట్లాడుతూ…మ్యూజిక్ ప్రాధాన్యత కలిగిన ఈ చిత్రంలో 6 పాటలు ఉన్నాయి. పెద్ద సినిమాకు ఏమాత్రం తగ్గకుండా దీటుగా నిర్మించిన చిన్న సినిమా ఇది. లేడీ ఓరియెంటెడ్ గా మెసేజ్ ఇచ్చిన ఈ చిత్రంలో హీరోయిన్ ప్రియాంక అద్భుతంగా నటించింది అన్నారు.
హీరోయిన్ ప్రియాంక నాయుడు మాట్లాడుతూ…. కెరీర్ ప్రారంభం లోనే నటించడానికి స్కోప్ ఉన్న చిత్రంలో అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. మహిళలపై జరుగుతున్న అన్యాయాలను అరికట్టే దుర్గ పాత్రలో నటించాను. మంచి కథతో వస్తున్నాం. అందరూ తప్పకుండా ఆదరించాలని కోరుతున్నా అని చెప్పారు.
విలన్ సంజయ్ కృష్ణ, జబర్దస్త్ అవినాష్, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బాలాజీ, గీత రచయిత శ్రీరామ్ తపస్వి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.