వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా & రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం (CATS) సంయుక్త నిర్వహణలో అమెరికా రాజధాని వాషింగ్టన్ DC లో ..సెప్టెంబర్ 23-24, 2017 లలో జరిగిన 10వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు అఖండ విజయం సాధించింది. ఒకరా, ఇద్దరా….154 మంది ప్రతినిధులు రెండు రోజులలో సుమారు 15 గంటల సేపు తెలుగు భాష సాహిత్యానందంతో జేవిత కాలం గుర్తుంచుకునే అనుభూతి పొందారు. భారత దేశ నుంచి వచ్చిన పది మంది సాహితీవేత్తలు, అమెరికాలో అనేక నగరాల నుంచి వచ్చిన సుమారు 30 మంది అమెరికా తెలుగు రచయితలు, 30 మంది స్థానిక తెలుగు ఉపాధ్యాయులు, ఇతర భాషా ప్రియులు, సాహిత్యాభిమానులతో సభా ప్రాంగణం కళ కళ లాడింది.
ముందుగా సుధారాణి కుండపు, కె. గీత మరొక గాయని ‘మా తెలుగు తల్లికి మల్లె పూదండ’ వేయగా సుప్రసిద్ధ అమెరికా రచయిత్రి సుధేష్ణ సోమ, మరొక ఇద్దరు మహిళలు జ్యోతి ప్రజ్వలన చేసి శుభారంభం చేశారు. రాజధాని ప్రాంతీయ సంఘం అధ్యక్షులు భాస్కర్ బొమ్మారెడ్డి ప్రతినిధులకి సాదరంగా స్వాగతం పలికి ఆహ్వానిత అతిధులయిన కవి జొన్నవిత్తుల, శతావధాన శిరోమణి పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, ఆచార్య గంగిశెట్టి లక్ష్మీ నారాయణ, దీవి సుబ్బారావు, జంధ్యాల జయకృష్ణ బాపూజీ, పద్మ వల్లి గార్లను వేదిక మీదకి ఆహ్వానించారు. వంగూరి చిట్టెన్ రాజు ప్రారంభ సభని నిర్వహించారు.
ఆచార్య గంగిశెట్టి లక్ష్మీ నారాయణ గారు “తెలుగు భాష ప్రాచీనత -విశిష్టత ” లపై తన ప్రారంభోపన్యాసంలో శాస్త్రీయ పరమైన నిరూపణల తో తెలుగు భాష ప్రాచీనతని విశదీకరించారు. పాలపర్తి వారు అచ్చ తెనుగు ప్రాధాన్యత ని వివరించారు. దీవి సుబ్బారావు కావ్య ధర్మం మీద సాధికార ప్రసంగం చేశారు. జంధ్యాల బాపూజీ గారు తన తండ్రి కరుణశ్రీ గారి కవిత్వం మీద ఆసక్తి కరమైన ప్రసంగం చేశారు. అమెరికా యువ సాహితీ వేత్త పద్మవల్లి వేదిక మీద ప్రసంగించడం ఇదే తొలి సారి అని ప్రస్తావించి, కథా వస్తువులలో తెలుగు వస్తువులలో ఉన్న వైవిధ్యతా లోపాలు వివరించి, అనేక ఇతర భాషలలో వస్తున్న కొత్త కథా వస్తువులని సోదాహరణం గా వివరించి కథకులకి మంచి సూచనలతో కీలకోపన్యాసం చేశారు. ప్రధానోపన్యాసం చేసిన కవి జొన్నవిత్తుల ఈ నాటి యువ తరం రామాయణం ఒక మత గ్రంధంలా కాకుండా సమాజంలో రాముడు, సీత మొదలైన వారి విశిష్ట వ్యక్తిత్వాలు ఈ నాటి సమాజంలో వాటి ఆవశ్యకత వివరించారు.
ప్రారంభ సభ అనంతరం బద్రీనాథ్ చల్లా నిర్వహణలో వాషింగ్టన్ DC ప్రాంతంలో పిల్లలకి తెలుగు బోధిస్తూ నిస్వార్తంగా భాష సేవ చేస్తున్న 30 మంది ఉపాధ్యాయుల సత్కార కార్యక్రమం అందరి మన్ననలూ పొందింది. తరువాత శాయి రాచకొండ నిర్వహించిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో 13 తెలుగు పుస్తకాలు (వంగూరి ఫౌండేషన్ ప్రచురణలైన అమెరికా తెలుగు కథానిక -13, సుధేష్ణ సోమ రచించిన నర్తకి, ఉమాభారతి నవల వేదిక, విన్నకోట రవిశంకర్ వ్రాసిన కవిత్వంలో నేను, దశిక శ్యామలా దేవి అమెరికా ఇల్ల్లాలి ముచ్చట్లు -2), జీవనయానంలో రసాయనాలు-చాగంటి కృష్ణ కుమారి, మూడు నగరాలు-దాసరి అమరేంద్ర, నీవు లేక-M. గీతావాణి, మిమ్మల్ని ‘ఇక్కడ’దాక చేర్చింది ‘అక్కడ’కి చేర్చదు -నౌడూరి మూర్తి, కుందాపన-రవి వీరెల్లి, ఆత్మానందం, ఆత్మారామం – రామ్ డొక్కా, చుక్కల్లో చంద్రుడు – వేమూరి వెంకటేశ్వర రావు, “అమ్మ కోరిక” సినిమా DVD: ఫణి డొక్కా) వైభవంగా ఆవిష్కరించబడ్డాయి. రచయితల తరఫున సుధేష్ణ సోమ సముచిత ప్రసంగం చేశారు.
భోజన విరామం తరువాత సుధారాణి కొండపి నిర్వహించిన మహిళా రచయితల ప్రత్యేక వేదికలో, శారదా పూర్ణ (ఆధునికాంధ్ర సాహిత్య వ్యక్తిత్వం), చాగంటి కృష్ణకుమారి (నేనూ, నా తల్లి భాష తెలుగు), భారత దేశం నుంచి వచ్చిన సుప్రసిద్ద స్త్రీవాద రచయిత్రి విమల (మారుతున్న సమాజం – స్త్రీవాద రచనలు), ఉమా భారతి (ప్రదర్శన కళలకి సంబంధించిన సాహిత్యం), పాలపర్తి ఇంద్రాణి (కళ -ప్రయోజనం), కల్పన రెంటాల (కొన్ని సమయాల్లో కొందరు స్త్రీలు), గోపరాజు లక్ష్మి (గమనమే గమ్య) కె. గీత (అమెరికా తెలుగు కవయిత్రులు ఏం రాసారు? ఏం రాస్తున్నారు? ఏం రాయాలి?) మంచి ప్రసంగాలు చేశారు. తరువాత ప్రసంగ వేదిక ప్రసాద్ చరసాల నిర్వహణ లో అఫ్సర్ (కథ-కథనం-ప్రయోగం), గరిమెళ్ళ నారాయణ (వంగూరి చిట్టెన్ రాజు గారి కధలు: వర్తమాన మరియు భవిష్యత్ ఆవశ్యకత), ఎస్. నారాయణ స్వామి (అమెరికా తెలుగు కథలో భారతీయులు కాని వారితో సంబంధ బాంధవ్యాలు) పాల్గొన్నారు.
మొదటి రోజు ఆఖరి అంశంగా సదస్సు నిర్వాహకులైన వంగూరి చిట్టెన్ రాజు, భాస్కర్ బొమ్మారెడ్డి, ఆహ్వానిత అతిధులు సుప్రసిద్ద అమెరికా సాహితీ వేత్తలు డా. శారదా పూర్ణ & డా. శ్రీరామ్ శొంఠి, జె. కె. మోహన రావులను జీవన సాఫల్య పురస్కారంతో ఘనంగా సత్కరించారు.మొదటి రోజు సదస్సు అనంతరం భారత దేశం నుంచీ, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిదులకి CATS వారు సుధారాణి కుండపు గారి సౌజన్యంతో వారి ఇంట్లో విందు భోజనం ఏర్పాటు చేశారు. ఫణి డొక్కా దర్సకత్వం వహించిన తాజా తెలుగు చిత్రం “అమ్మ కోరిక” ప్రదర్శించారు.
రెండవ రోజు (సెప్టెంబర్ 24) ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు దాసరి అమరేంద్ర (కొత్త కథకులు), తాడికొండ శివకుమార శర్మ (తెలుగు కథలు-.స.ప.స.లు), విన్నకోట రవిశంకర్ (ఆదిలో ఒక పద్య పాదం), వైదేహి శశిధర్: కవిత్వం (నా ఆలోచనలు),నిషిగంధ (కవిత్వం-ధ్వని—ప్రతిధ్వని), రవి వీరెల్లి( కొత్త కవిత్వానికి కొత్త భాష అవసరమా?), నారాయణ స్వామి వెంకటయోగి: (అమెరికా తెలుగు కవిత్వంలో సామాజికాంశాలు), వేదుల వెంకట చయనులు (తాతగా సాహస సాహితీ ప్రక్రియ), వేమూరి వెంకటేశ్వర రావు (మాలతీ చందూర్ -నా అభిమాన రచయిత్రి), డా. గీత వాణి (స్మృతి కావ్యాలు -వస్తు నవ్యత), జె.కె. మోహన రావు (పద్యాలు వ్రాయుటకు సులువుగా ఒక పద్య ఫలకము), K.S. రామచంద్ర రావు (మన సినిమాలలో తెలుగు సాహిత్యం) రామ్ డొక్కా(ఆత్మ శ్రావ్య కవిత్వం), ఇన్నయ్య నరిశెట్టి (తెలుగులో శాస్త్రీయ సాహిత్యం ఆవశ్యకత), హెచ్చార్కె(సాహిత్య రాజకీయం-రాజకీయ సాహిత్యం), వేణు వింజమూరి (కథ చెబుతా, వింటారా?) పాల్గొన్నారు. ఈ వేదికలను ఎస్. నారాయణ స్వామి, శాయి రాచకొండ సమర్థవంతంగా నిర్వహించారు.
యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బెర్క్లీ, లో నెలకొల్పబడ్డ తెలుగు పీఠం వివరాలతో ఆ పీఠాన్ని ఆర్ధికంగా సమర్థించి శాశ్వత స్థాయి కలిగించాలి అని వేలూరి వెంకటేశ్వరరావు అమెరికా తెలుగు వారు అందరికే విజ్ఞప్తి చేశారు. ఛందస్సు శాస్త్రం మీద జె.కె. కృష్ణ మోహన రావు గారి సాధికార ప్రసంగం తలమానికంగా నిలిచింది.
మరొక చెప్పుకోదగ్గ విజయం పుస్తక విక్రయశాలలో సుమారు 75 తెలుగు పుస్తకాలు చోటు చేసుకున్నాయి. ఆఖరి వేదిక గా స్వీయ రచనా పఠనం వేదికలో శ్యామలా దేవి దశిక, రాజేశ్వరి దివాకర్ల, లెనిన్ వేముల, ఇ.వి. రామస్వామి, నేమాని సోమయాజులు పాల్గొన్నారు. సమయాభావం వలన తమ ప్రసంగాలను రద్దు చేసుకున్న సత్యం మందపాటి, విజయ సారధి జీడిగుంట, ఇతరులు అభినందనీయులు.
CATS కార్య నిర్వాహక సభ్యులు రవి బుజ్జా వందన సమర్పణ తో 10 వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు దిగ్విజయంగా ముగిసింది. భోజనం, వసతి, శ్రవణ సాధనాలు మొదలైన అన్ని సదుపాయాలూ అత్యంత సమర్థవంతంగా ఏర్పాట్లు చేసిన CATS అధ్యక్షులు భాస్కర్ బొమ్మారెడ్డి, CATS వ్యవస్థాపకులు నల్లు చిత్తరంజన్, సభ్యులు బద్రీనాథ్ చల్లా, సత్యజిత్ మారెడ్డి, సుదర్శన్ దేవిరెడ్డి, గోపాల్ నున్నా, శ్రీనివాస్ వూట్ల, అనిల్ నందికొండ, విజయ దొండేటి, రాజ్య లక్ష్మి, దుర్గాప్రసాద్ గంగిశెట్టి, సతీష్ వడ్డీ, రామచంద్ర ఏరుబండి, సలహా దారులు, సుధేష్ణ సోమ, జక్కంపూడి సుబ్బారాయుడు, రవి వేలూరి, ఇతర సహాయకులు ప్రతినిధులు ఎంతో ప్రశంసించారు. శాయి రాచకొండ, సంధాన కర్త వంగూరి చిట్టెన్ రాజు ప్రత్యేక అభినందనలు, ప్రశంసలు అందుకున్నారు.
ఎందరో హితులను, సన్నిహితులను, కొత్త వారినీ కలుసుకుని లోతైన రూప కల్పన, సమర్థవంతమైన నిర్వహణ ద్వారా అనిర్వచనీయమైన సాహిత్య వాతావరణం సృష్టించిన ఈ సదస్సు తెలుగు రాష్ట్రాలకి దిశా నిర్దేశం చేసి ఆదర్సప్రాయంగా నిలుస్తుంది అని భారత దేశం నుంచి వచ్చిన లబ్ధ ప్రతిష్టులు, అమెరికా సాంస్కృతిక కార్యక్రమాలతో విసుగు చెందిన అమెరికా ప్రతినిధులు అభిప్రాయ పడ్డారు.