సినీవినోదం రేటింగ్ : 2.25/5
భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ రచన దర్శకత్వం లో వి.ఆనంద ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు .
బాబ్ మార్లే(విక్రమ్ జీత్) ఓ పెద్ద మాఫియా డాన్. పోర్చుగల్‌లో ఉంటాడు. బాబ్ తమ్ముడు సన్ని(అమిత్)ను ఇండియన్ రా ఆఫీసర్ చంపేస్తాడు. దాంతో ఇండియాపై పగబట్టిన బాబ్ ఇండియాలో మారణ హోమం క్రియేట్ చేయాలని నిర్ణయించుకుంటాడు. బాబ్‌కు ఇండియాలో ఓ మినిష్టర్(కృష్ణకాంత్) సహా లోకల్ మాఫియా అండగా ఉంటుంది. హైదరాబాద్‌లో రెండు, మూడు చోట్ల బాంబు పేలుళ్లు జరుగుతాయి. అమాయకులైన జనం చనిపోతారు. పోలీస్ అధికారులను మాఫియా గ్యాంగ్ చంపేస్తుంటుంది. అలాంటి సమయంలో రా చీఫ్(కబీర్ బేడి), ఓ గ్యాంగ్‌స్టర్‌ను ఈ మాఫియాకువ్యతిరేకంగావాడుకునిఅంతమొందించాలనుకుంటాడు. అదే సమయంలో తీహార్ జైలు నుంచి రిలీజ్ అయి వచ్చి తేడాసింగ్ (నందమూరి బాలకృష్ణ) ఏసీపీ కిరణ్మయి(కైరా దత్) కి కనబడతాడు.
తేడాసింగ్(నందమూరి బాలకృష్ణ)తో పోలీస్ డిపార్ట్మెంట్ డీల్ కుదుర్చుకుంటుంది. తేడాసింగ్ తను ఉండే కాలనీలో తన పక్కింట్లో ఉండే హారిక(ముస్కాన్) వెంటపడుతుంటాడు. హారిక తన అక్కయ్య సారిక(శ్రియా) కోసం వెతుకుతూ ఉంటుంది. పోర్చుగల్ వెళ్లిన సారిక కనపడకుండా పోతుంది. అయితే చివరకు హారికకు, తన అక్కయ్య సారికకు, తేడాసింగ్‌కు మధ్య ఓ రిలేషన్ ఉందని తెలుస్తుంది. ఆ రిలేషన్ ఏంటి? అసలు తేడా సింగ్ ఎవరు? సారిక, హారిక ఫ్యామిలీకి తేడాసింగ్ ఎందుకు దగ్గరవుతాడు? అసలు సారిక ఏమవుతుంది? అనేది తెలుసుకోవాలంటే సినిమాలో చూడాలి ….
బాలయ్య అభిమానుల కోసం ‘పైసా వసూల్’ అంటూ ముందే ప్రకటించిన పూరి జగన్నాథ్, అభిమానులను దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రం చేశాడు. అయితే ,దర్శకుడు పూరి జగన్నాథ్ పనితనం నిరుత్సాహకరంగా ఉంది. అయన రాసుకున్న కథ కథనాలు రెగ్యులర్ గా ఉండటమేగాక బలహీనంగా ఉన్నాయి. సన్నివేశాల టేకింగ్ లో పక్కాగా ఉండే పూరి ఈసారి మాత్రం కొంత పట్టుతప్పినట్టు అనిపించారు. కానీ కథానాయకుడు తేడా సింగ్ పాత్రను మాత్రం పూరి కొంచెం కొత్తగా రాయడమేగాక అందులో బాలయ్యను ఇమిడ్చిన విధానం కూడా అభిమానులను ఆకట్టుకుంది.అయితే, రా ఏజెంట్‌గా బాలకృష్ణను దర్శకుడు ఎలివేట్ చేసిన తీరు, ఆ పాత్ర శైలి చాలా వరకు `పోకిరి` చిత్రాన్ని, పూరి గత చిత్రాలను గుర్తుచేస్తాయి. బాలయ్య కు డైలాగ్స్ రాసిన పంచ్ డైలాగ్స్ ఎప్పటిలాగే విజిల్స్ వేయించాయి.ఇంటర్వెల్ బ్లాక్, అందులో బాలయ్య పెర్ఫార్మెన్స్ బాగున్నాయి .
ఈ సినిమాలో కొత్త కథ లేకపోవడమే ప్రధాన బలహీనత. పోనీ ఉన్న రొటీన్ కథైనా బలంగా లేదు. నేరుగా చెప్పాల్సిన కథను తన స్క్రీన్ ప్లేతో ముందుకు వెనక్కి తిప్పుతూ మ్యాజిక్ చేద్దామని పూరి ప్రయత్నించినా వర్కవుట్ కాలేదు. ఎక్కడా ఎగ్జైట్మెంట్ అనేదే కలుగలేదు. దీంతో ‘పూరీ తన పాత కధతోనే మరో పెద్ద హీరోతో చేసిన సినిమా చూస్తున్నాం’ అనే ఫీలింగ్ మాత్రమే కలిగింది . తేడా సింగ్ పాత్ర, బాలయ్య నటన తప్ప కథనంలోని చాలా సన్నివేశాలు పూరి పాత చిత్రాల్లో ఏదో ఒకదాన్ని గుర్తుచేస్తూనే ఉన్నాయి. ఇక సినిమాలో కనబడే రౌడీలు, మాఫియా, గన్ ఫైట్స్ అయితే పరమ రొటీన్ గా అనిపించాయి.మొదటి అర్థ భాగం బాలయ్య పెర్ఫార్మెన్స్, పంచ్ డైలాగులతో పర్వాలేదనిపించేలా వెళ్ళిపోయినా సెకండాఫ్ మాత్రం పరీక్షలా అనిపించింది. ప్రీ క్లైమాక్స్ కు వచ్చేటప్పటికి రెగ్యులర్ ట్విస్ట్ రివీల్ అవడం, ఎప్పటిలానే హీరోలోని కొత్త యాంగిల్ బయటపడటం, అభిమానుల కోసం మాత్రమే అన్నట్టు హీరో ఎలివేషన్ జరగడం వంటివి చిరాకు కలిగించాయి.
ఇది పూర్తిగా బాలయ్య వన్ మేన్ షో. ఇన్నాళ్లు మాస్, సీరియస్ పాత్రలో చూసిన బాలయ్య ఇందులో కొత్తగా కనిపించాడు. కామెడీ, యాక్షన్ తో అభిమానులను అలరించాడు . పూరి మార్క్ హీరోయిజంలో ఒదిగిపోయిన బాలకృష్ణ, తన స్టైల్ మాస్ ఎలిమెంట్స్ మిస్ అవ్వకుండా జాగ్రత్తపడ్డాడు. పేరుకు ముగ్గురు హీరోయిన్స్ ఉన్నా.. ఎక్కువగా శ్రియ పాత్రే గుర్తుండిపోతుంది. శ్రియ నటనతో పాటు గ్లామర్ తోనూ ఆకట్టుకుంది. ముస్కాన్, కైరా దత్ లకు పెద్దగా నటనకు అవకాశం లేదు. విలన్ రోల్ లో విక్రమ్ జీత్ పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. రా ఆఫీసర్ గా కబీర్ బేడి చిన్న పాత్రలో కనిపించినా ఉన్నంతలో ఆకట్టుకున్నాడు. తొలి భాగంలో పృధ్వీ, సెకండ్ హాఫ్ లో అలీ పాత్ర ఉండాలి కాబట్టి ఉన్నట్టు అనిపిస్తుంది.
అనూప్ రూబెన్స్ అందించిన పాటల్లో ” మావా ఏక్ పెగ్ లా”, “పద మరి”, “పైసా వసూల్” పాటలు బావున్నాయి. రీరికార్డింగ్ ఇంకాస్త ఎఫెక్టివ్‌గా ఉంటే బావుండేదేమో. ‘పైసా వసూల్’, ‘కొంటె నవ్వు చేబుతోంది’ వంటి పాటల్లో బాలకృష్ణకు చేసిన కొరియోగ్రఫీ బాగుంది. సినిమాకు మరో ప్రధాన ఎసెట్ ముఖేష్ జి సినిమాటోగ్రఫి. బాలయ్యను చాలా స్టైలిష్ గా చూపించిన సినిమాటోగ్రాఫర్, యాక్షన్స్ సీన్స్ లో ఆకట్టుకున్నాడు. పోర్చుగల్ లో తీసిన చేజ్ సీన్స్ బాగున్నాయి . జునైద్ సిద్ధికి ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి – ధరణి