ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న బ్యూటీ కీర్తి సురేశ్ నటిస్తున్న ‘మహానటి’ సినిమాపై ఇండస్ట్రీలో అంచనాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం షూటింగ్ స్టేజ్‌లో ఉన్న ఆ సినిమాకు డిమాండ్ భారీగానే ఉందట. అలనాటి మేటితార సావిత్రి జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సావిత్రిగా కీర్తి సురేశ్ నటిస్తుండగా జెమిని గణేశన్ పాత్రలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయాలని భావిస్తున్న దర్శక నిర్మాతలు మూడు భాషలకు సంబంధించిన నటులను ఈ సినిమా కోసం తీసుకోవడం విశేషం.
ఇతర ముఖ్యపాత్రల్లో సమంత, ప్రకాశ్ రాజ్ వంటి గుర్తింపు ఉన్న స్టార్స్ నటిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతోందో అనే ఆసక్తి మూవీ లవర్స్‌లో పెరుగుతోంది. అంతకుముందు ‘ఎవడే సుబ్రమణ్యం’ వంటి ఫీల్ గుడ్ మూవీని తెరకెక్కించిన దర్శకుడు నాగ్ ఆశ్విన్, మహానటి సినిమాను కూడా ప్రేక్షకులు మెచ్చేలా తెరకెక్కిస్తాడని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడుపోయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
సినిమాలో భారీ తారాగణం ఉండటం, ఒకప్పటి స్టార్ హీరోయిన్ బయోపిక్ కావడంతో ఈ సినిమాను ఏకంగా నాలుగున్నర కోట్లకు కొనుగోలు చేసిందట ఓ డిస్ట్రిబ్యూషన్ సంస్థ. మహానటికి వస్తున్న బిజినెస్ ఆఫర్స్‌ను బట్టి ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. మరి వాటిని ‘మహానటి’ ఎంత వరకూ అందుకుంటుందో చూడాలి