ఒకప్పుడు టాలీవుడ్లో టాప్ పొజిషన్‌ను చూసిన హీరోయిన్ ఇలియానా ఆ తరువాత బాలీవుడ్‌పై దృష్టి సారించింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లో బిజీగా ఉన్న ఈ అమ్మడు కొందరు వేధింపు రాయుళ్ళ అరాచకాలపై సోషల్ మీడియాలో తాజాగా ఫైర్ అయ్యారు. మనం ఎలాంటి ప్రపంచంలో బతుకుతున్నాం అని ప్రశ్నించారు. ఇటీవల వాళ్ళ మూలంగా ఇటీవల నడిరోడ్డులో ఎంత ఇబ్బంది పడిందీ సామాజిక మీడియా వేదికగా పంచుకున్నారు…..
‘‘దేశంలో మహిళలపై వేధింపులు ఆగడం లేదు. ఇందుకు సెలబ్రిటీలు సైతం మినహాయింపు కాదు. ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా అవి మహిళలకు రక్షణ కల్పించలేకపోతున్నాయి. ఇటీవల నాకు ఎదురైన సంఘటనే మంచి ఉదాహరణ. ఆ రోజు లాక్మే ఫ్యాషన్ వీక్‌లో పాల్గొని ఇంటికి బయలుదేరాను. కారులో వెళుతుండగా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర రెడ్‌లైట్ పడటంతో ఆగిపోయాను.అప్పుడు ఆరుగురు యువకులు కారులో ఉన్న నన్ను గుర్తించి నా కారును చుట్టుముట్టి అసభ్యకరంగా ప్రవర్తించారు. అద్దాలు కొట్టడం మొదలుపెట్టారు. ఒకడైతే ఏకంగా నా కారు బ్యానెట్ ఎక్కి కూర్చున్నాడు. కారును అందరూ కలిసి అటు ఇటూ ఊపడం మొదలుపెట్టారు. వాళ్ల ప్రవర్తన చూసి ఆ క్షణం షాకయ్యాను.
ఆ సమయంలో వారిని ఎదుర్కోవడం కంటే అక్కడి నుంచి బయటపడటంపైనే నా ఆలోచనంతా ఉంది. గ్రీన్ సిగ్నల్ పడిన తరువాత కూడా వాళ్లు నా కారును అనుసరించారు. వాళ్ల ఫొటోలు తీసి, వాళ్ల అరాచకాన్ని పబ్లిక్‌లో బయటపెట్టాలని అనుకున్నా.కానీ, ఆ తరువాత వాళ్లు మరింత రెచ్చిపోయే అవకాశం ఉంటుందని భావించి వదిలేశా. నాకు వాళ్లెవరో తెలియదు. ఒకవేళ దేవుడు నాకు మళ్లీ అలాంటి పరిస్థితి ఎదురయ్యేలా చేస్తే ఈసారి భిన్నంగా ఎదుర్కొంటా. ఈ సంఘటన తరువాత బయటకు వెళ్లినా బాడీగార్డును పెట్టుకుంటే బాగుంటుందేమోనని ఆలోచిస్తున్నా. సెలబ్రిటీ అయిన నా పరిస్థితే ఇలా ఉంటే సామాన్య మహిళల పరిస్థితి ఏంటి? మహిళలు ప్రతి క్షణం జాగరూకతతో ఉండాలి. సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. అవసరమైన అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి. ప్రతి మహిళకు నేను ఇచ్చే సందేశం ఇది’’