‘తలైవర్’ రాజకీయాల్లోకి రావాల్సిన ఆవశ్యకతను ప్రచారం చేసే దిశగా ఆదివారం తిరుచ్చిలో నిర్వహించిన మహానాడులో రజనీ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశం దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో…’గాంధీయ మక్కల్ ఇయక్కం’ నేత తమిళరువి మణియన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ మహానాడు కారణంగా తిరుచ్చి మొత్తం రజనీమయంగా మారింది. ఎక్కడ చూసినా రజనీ బ్యానర్లు, ప్లకార్డులు, పోస్టర్లు కనిపించాయి.
రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడానికి ఇదే సరైన తరుణమని తను నమ్ముతున్నట్టు తమిళరువి మణియన్ కొద్దికాలంగా ప్రకటిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. రజనీ అభిమానుల్లో అధికశాతం మంది కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. దీనినే ప్రజల్లోకి కూడా తీసుకెళ్లేందుకు, రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాల్సిన ఆవశ్యకతపై, ఒకవేళ వస్తే రాష్ట్రంలో చోటుచేసుకోబోయే మార్పుల గురించి వివరించడమే లక్ష్యంగా ఈ మహానాడు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వేలాదిగా రజనీకాంత్ అభిమానులు తలరివచ్చారు. రజనీ ఫోటోలున్న జెండాలు చేతబూని ద్విచక్ర వాహనాలు, కార్లు, వ్యాన్లతో ర్యాలీగా తిరుచ్చికి పోటెత్తారు.
ఆ సందర్భంగా తమిళరువి మణియన్ వేదికపై ప్రసంగిస్తూ… రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం ఖాయమని, ఆయన సీఎం పీఠంపై కూర్చోబెడదామని పిలుపునిచ్చారు. దాంతో ఒక్కసారిగా మహానాడు ప్రాంగణం దద్ధరిల్లిపోయింది. “తలైవర్ సీఎం.. తలైవర్ సీఎం” అంటూ నినాదాలు మిన్నంటాయి. అనంతరం తమిళరువి మణియన్ ప్రసంగిస్తూ… ‘50 ఏళ్లుగా వంతులవారీగా రాష్ట్రాన్ని పాలిస్తున్న డీఎంకే, అన్నాడీఎంకే పాలనతో విసుగు చెందిన ప్రజలు మార్పు కోసం ఎదురుచూస్తున్నారు. అది రజనీ వల్లే సాధ్యమవుతుంది. ఒకసారి రజనీని ఇంట్లో కలిసినప్పుడు.. దేవుడు శాసిస్తే నేను రాజకీయాల్లోకి రావడం తథ్యమని చెప్పారు. ఆ రోజు దగ్గరపడింది. సెయింట్ జార్జి కోటలో రజనీని సీఎంగా కూర్చోబెట్టడమే గాంధీయ మక్కల్ ఇయక్కం ప్రధానం లక్ష్యం. ఇది నెరవేరాలంటే అభిమానులు సైనికుల్లా పనిచేయాలి. ద్రావిడ పార్టీలు 50ఏళ్లు అధికారంలో కూర్చుని అవినీతి పాలన చేస్తున్నాయి. అందువల్లే ఫోటోసెషన్ కార్యక్రమంలో ‘సిస్టమ్ బాలేద’ని రజనీకాంత్ వ్యాఖ్యానించారు. రజనీ రాజకీయాల్లోకి వస్తే ఎవరితో జత కట్టే అవకాశం లేదు. ఆయన సొంత పార్టీతో వచ్చి పీఠమెక్కుతున్నారు.
ప్రస్తుతం ఆయనకు 25 శాతం ఓటు బ్యాంకు ఉందని ఓ సర్వేలో తెలిసింది. రాజకీయాల్లోకి వస్తే అది 40 శాతం పెరుగుతుంది. ఎన్నికలొస్తే డీఎంకే, అన్నాడీఎంకేలకు డిపాజిట్లు కూడా దక్కవు. అవినీతి గురించి స్టాలిన్ మాట్లాడ్డం హాస్యాస్పదంగా ఉంది. దేశంలోనే అతపెద్ద అవినీతి కుంభకోణం 2జీకి కారణం ఎవరో ప్రజలందరికీ తెలుసు. 2007లో డీఎంకే ప్రభుత్వ హయాంలో ఐలాండ్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మన్మోహన్సింగ్ దక్షిణాది నదులను అనుసంధానం చేసేందుకు కేంద్రంగా సిద్ధంగా ఉందని, దీనికి ముఖ్యమంత్రి హోదాలో కరుణానిధి చర్యలు తీసుకోవాలని వేదికపై ప్రకటించారు. ఆ తరువాత రెండుసార్లు సీఎంగా వ్యవహరించిన కరుణానిధి నిర్లక్ష్యం చూపడం వల్లే డెల్టా రైతులు సాగు నీటి కోసం అలాడుతున్నారు. అధికారంలో లేకపోయినా కేవలం రైతుల సంక్షేమం కోరుతూ నగదు అనుసంధానం కోసం రజనీ ముందుకొచ్చారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రజనీకాంత్ రాష్ట్రాల్లోకి వస్తే ప్రజలకి మంచి జరుగుతుంది’ అని పేర్కొన్నారు