‘బాహుబలి’ తరువాత ప్రభాస్ రేంజ్ బాగా పెరిగిపోయింది. బాలీవుడ్‌లోనూ ‘బాహుబలి’, ‘బాహుబలి-2’ సూపర్ హిట్ కావడంతో ప్రభాస్ నటించబోయే కొత్త సినిమాలపై కూడా అంచనాలు పెరిగిపోయాయి. ఈటాలీవుడ్ క్రేజీ హీరో కొత్త సినిమాలకు సంబంధించిన ఆన్ లైన్ ప్రసార హక్కుల కోసం ఓ బడా కార్పొరేట్ సంస్థ భారీ ఆఫర్‌తో ముందుకొచ్చిందట. దీంతో నిర్మాతలకు ఈ సినిమాల ద్వారా ఊహించని విధంగా లాభాలు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ‘యంగ్ రెబల్ స్టార్’ నటిస్తున్న ‘సాహో’ సినిమాను 150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారంటేనే… ఈ సినిమా బిజినెస్‌పై నిర్మాతలకు ఏ స్థాయిలో నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రభాస్ నటించబోయే కొత్త సినిమాల ఆన్ లైన్ హక్కులను కొనుగోలు చేసేందుకు నెట్ ఫ్లిక్స్ సంస్థ ఏకంగా 50 కోట్ల రూపాయలను ఆఫర్ చేస్తోందని వార్తలొస్తున్నాయి.
‘బాహుబలి 2’ సినిమా కోసం ‘నెట్ ఫ్లిక్స్’ సంస్థ 25 కోట్ల రూపాయలు చెల్లించిందని రీసెంట్గా వార్తలు వినిపించాయి. బాలీవుడ్‌లోని సూపర్ హిట్ సినిమా అయిన ‘దంగల్’తో పాటు మరికొన్ని సినిమాల ఆన్ లైన్ హక్కులను ఈ కార్పొరేట్ దిగ్గజం కొనుగోలు చేసింది. తాజాగా ఈ సంస్థ ప్రభాస్ నటించబోయే రెండు సినిమాలకు సంబంధించిన ఆన్ లైన్ ప్రసార హక్కుల కోసం యువి క్రియేషన్స్‌కు 50 కోట్ల వరకు ఆఫర్ చేసిందట. ‘సాహో’తో పాటు …త్వరలో మరో సినిమాను కూడా యువి క్రియేషన్స్ బ్యానర్లో చేయాలని ప్రభాస్ నిర్ణయించడంతో ఈ సంస్థతో ఒప్పందం కోసం నెట్ ఫ్లిక్స్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.ప్రభాస్ నటించబోయే ఈ రెండు కొత్త సినిమాలకు సంబంధించిన తెలుగు, తమిళ, మలయాళ, హిందీ ఆన్ లైన్ ప్రసార హక్కుల కోసం ఈ కార్పొరేట్ దిగ్గజం రూ. 50 కోట్లు ఇవ్వడానికి ముందుకొచ్చిందట. అయితే ఇందుకు సంబంధించిన డీల్ ఇంకా పూర్తి కాలేదని కొందరు చెబుతున్నారు.