ఒకప్పటి హీరో, స్టార్ కమేడియన్ సుధాకర్ ప్రస్తుతం వేషాల కోసం నిర్మాతలను వేడుకుంటున్నాడట. ప్రకాశం జిల్లా మర్కాపురంలో జన్మించిన సుధాకర్ ఇంటర్ తరువాత సినిమాలపై మోజుతో మద్రాస్ ఫిల్మ్ఇన్సిట్యూట్లో శిక్షణ పొందారు. అక్కడ చిరంజీవి, రాజేంద్రసాద్, హరిప్రసాద్‌లు ఆయనకు క్లాస్మేట్లుగా, రూమ్మేట్లుగా ఉండేవారు. శిక్షణ అనంతరం సుధాకర్‌కు తమిళ సినీ పరిశ్రమలో అవకాశాలు వచ్చాయి. భారతీ రాజా తీసిన తమిళ చిత్రంలో సుధాకర్ హీరోగా నటించారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. అదే సినిమాను బాపు దర్శకత్వంలో ‘తూర్పువెళ్లే రైలు’ పేరుతో తెలుగులో తీశారు. ఇందులో కూడా సుధాకర్ హీరోగా నటించారు. ఇక్కడ కూడా ఈ సినిమా హిట్ అయింది. తమిళంలో సూపర్‌స్టార్‌గా ఎదిగినా …అక్కడిచిత్ర పరిశ్రమ రాజకీయాల్లో ఇమడలేకపోయారు.
అనంతరం ఆయన తెలుగు సినిమాలపై దృష్టి పెట్టారు. ఇక్కడ ఆయనకు హీరో పాత్రలు రాలేదు. హీరో స్నేహితుడి పాత్రలు, హాస్య పాత్రలు మాత్రమే లభించాయి. ఈ క్రమంలో ఆయన ఆ పాత్రల్లో ఒదిగిపోయి తనదైన ముద్ర వేశారు. ఆతర్వాత ఆయన కొన్ని సినిమాలు నిర్మించి సంపాదించినదంతా పోగొట్టుకున్నారు. దీంతో డిప్రెషన్‌కు గురైన సుధాకర్ మద్యానికి అలవాటు పడ్డారు. ఈ క్రమంలో ఆయన అనారోగ్యం బారిన పడ్డారు. ఇటీవలే ఆయన తిరిగి కోలుకున్నారు. ఇప్పుడు వేషాల కోసం ఆయన నిర్మాతల చుట్టూ తిరుగుతున్నారు. మద్యం వల్లనే తన జీవితం నాశనమైందని, ప్రస్తుతం అనారోగ్యం నుంచి కోలుకున్నానని సుధాకర్ చెబుతున్నారు. ఎవరైనా తనకు మళ్లీ ఛాన్స్ ఇస్తే తానేమిటో చూపిస్తానని చెబుతున్నారు.