సినీవినోదం రేటింగ్ : 1.5/5
శ్రీ చక్ర మీడియా, బుట్ట బొమ్మ క్రియేషన్స్, విన్ విన్ విన్ క్రియేషన్స్ సంయుక్తంగా కృష్ణ వంశీ దర్శకత్వం లో కె.శ్రీనివాసులు, ఎస్.వేణుగోపాల్, సజ్జు ఈ చిత్రాన్ని నిర్మించారు.
తాతల కాలం నుంచి పోలీసు కుటుంబం కావటంతో తాను కూడా పోలీస్ కావాలన్న ఆశయంతో కష్టపడుతుంటాడు రామారావు (సందీప్ కిషన్). పోలీసులను ఒక్కమాట అన్నా సహించలేని రామారావు.. అనుకోకుండా ఓ సారి పోలీస్ కమీషనర్ కొడుకు రాహుల్ (తనీష్)తో గొడవపడతాడు. పోలీసులను కొట్టాడన్న కోపంతో రాహుల్ తో పాటు అతని స్నేహితుల మీద చేయిచేసుకుంటాడు. దీంతో రామారావు మీద పగ పట్టిన రాహుల్, అతనికి పోలీసు ఉద్యోగం రాకుండా చేస్తాడు. ఇక తనకు పోలీస్ ఉద్యోగం రాదన్న బాధతో రామారావు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. కానీ న్యాయాన్ని కాపాడటానికే పోలీసే కానవసరం లేదు.. సమాజం పట్ట బాధ్యత ఉంటే చాలని.. ఉద్యోగం లేకపోయినా.. పోలీసు డ్యూటీ చేయాలని నిర్ణయించుకుంటాడు.
అలా డ్యూటీ చేస్తుండగా క్రిమినల్ ముఖ్తార్ కారులో బాంబులు తీసుకెళ్తూ రామారావుకు దొరుకుతాడు. రామారావును నిజం పోలీసు అనుకున్న ముఖ్తార్ అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కారుతో సహా బాంబులు పేలిపోతాయి. ముఖ్తార్ ను కాపాడిన రామారావు వాణ్ని తన ఇంట్లో దాచిపెడతాడు. అయితే ఈ బ్లాస్ట్ వీడియో టీవీలో చూసిన పోలీసులు రామారావు యూనిఫాం మీద అలెగ్జాండర్ అని నేమ్ ప్లేట్ ఉండటంతో అతని కోసం వెతకటం మొదలు పెడతారు. అసలు అలెగ్జాండర్ ఎవరు..? బాంబ్ బ్లాస్ట్ చేసిన ముఖ్తార్ కి అలెగ్జాండర్ కి సంబంధం ఏంటి..? అలెగ్జాండర్ ఏమయ్యాడు.? ఈ గొడవల నుంచి రామారావు ఎలా బయట పడ్డాడు..? అనుకున్నట్టుగా రామారావుకి పోలీసు ఉద్యోగం వచ్చిందా..? అన్నదే మిగతా కథ.
క్రియేటివ్ దర్శకుడిగా పేరు పొందిన కృష్ణవంశీ ఈ సినిమాలో కూడా పోలీసుల గొప్పతనాన్ని చూపించారు.తన గత చిత్రాల మాదిరిగా క్రైం, లవ్, దేశభక్తి లాంటి అంశాలను కలగలిపి చూపించే ప్రయత్నం చేసిన దర్శకుడు అందులో విఫల మయ్యాడు .ఈ సినిమాలో ఆద్యంతం అంతగా ఎగ్జయిట్ చేసే అంశం ఏదీ కనిపించదు. క్లారిటీ లేని క్యారెక్టరైజేన్స్, సీన్స్ తో ప్రేక్షకుడ్ని కథలో ఇన్వాల్వ్ చేయలేకపోయాడు.సినిమాలో చాలా లాజిక్‌లు మిస్ అయినట్టు కనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ అంతా అసలు కథను స్టార్ట్ చేయకుండా గ్లామర్ షోతో నడిపించేయటం బోర్ కొట్టిస్తుంది. హీరోయిన్ల అందచందాలను పాటల్లోనూ, సన్నివేశాల్లోనూ శ్రద్ధగా చూపించినట్టు అనిపిస్తుంది. సందీప్ – రెజీనా, సాయిధరమ్‌తేజ్ – ప్రగ్యా జైశ్వాల్ మధ్య వచ్చే పాటల దృశ్యాల ముందు శ్రియ పాట చిన్నబోయినట్టు అనిపిస్తుంది. కృష్ణవంశీ మార్కు తెలుగుదనంగానీ, కామెడీగానీ సినిమాలో కనిపించవు. ఇంటర్వెల్ తరువాత అసలు కథలోకి ఎంటర్ అయినా.. కథనం మాత్రం నెమ్మదిగా సాగింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్లు ఆకట్టుకున్నా.. మొత్తంగా చూస్తే నిరాశ తప్పదు.
హీరో సందీప్ కిషన్ మాస్ కుర్రాడిగా ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్స్ లోనూ మంచి నటనతో మెప్పించాడు. నెగెటివ్ రోల్ లో యువ నటుడు తనీష్ బాగానే సూట్ అయ్యాడు. గెస్ట్ రోల్ లో కనిపించిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ స్క్రీన్ టైం తక్కువే అయినా.. తనదైన స్టైల్లో మెప్పించే ప్రయత్నం చేశాడు. రెజీనా పాత్ర కేవలం గ్లామర్ షోకే పరిమితం కాగా.. ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ తో పాటు యాక్షన్ సీన్స్ లోనూ అలరించింది. వారి ప్రతిభకు తగ్గ పాత్రలు కానప్పటికీ … ఇతర పాత్రల్లో ప్రకాష్ రాజ్, జేడీ చక్రవర్తి, శివాజీ రాజా,తులసి , బ్రహ్మాజీ లు తమ పరిధిమేరకు న్యాయం చేశారు.
పాటలు అంత చెప్పుకోదగ్గవి లేకున్నా … మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫి, శివ వై.ప్రసాద్ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి – ధరణి