యువ నటుడు ధనుష్ పంట నష్టాలవల్ల ఆత్మహత్యలు చేసుకున్న, గుండెపోటుతో మృతి చెందిన రైతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసి తన తల్లిగారి ఊరైన శంకరాపురం గ్రామస్థుల ప్రశంసలందుకున్నారు. తేని జిల్లా శంకరాపు రంలో ధనుష్ కులదైవమైన కరుప్పసామి ఆలయం ఉంది. ప్రతియేటా ధనుష్ కుటుంబ సమేతంగా ఆ ఆలయాన్ని దర్శించటం ఆనవాయితీ. ఆ మేరకు బుధవారం ఉదయం ధనుష్, ఆయన సతీమణి ఐశ్వర్య, తల్లి దండ్రులు కస్తూరి రాజా, విజయలక్ష్మి తదితర కుటుంబీకులతో అక్కడికి వెళ్ళి కరుప్పసామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో పంటనష్టాలతో ప్రాణాలు కోల్పోయిన 125 మంది రైతుల కుటుంబీకులకు తలా రూ.50 వేల చొప్పున రూ.63 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు.
ఈసందర్భంగా ధనుష్ మాట్లాడుతూ… రాష్ట్రంలో తమిళ రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం, గుండె ఆగి మృతి చెందటం వంటి సంఘటనలను చూసి తల్లడిల్లిపోయానని చెప్పారు.ఆ రైతుల కుటుంబాలకు ఉడుతాభక్తిగా తన వంతు సాయం అందించాలని దర్శకుడు సుబ్రమణ్యశివ కెమెరామెన్ వేల్రాజ్ నాయకత్వంలో 11 మంది సభ్యులున్న కమిటీని ఏర్పాటు చేసి రైతన్నలను కోల్పోయిన 250 కుటుంబీకులను ఎంపిక చేశారని, తొలివిడతగా 125 మందికి యాభైవేల చొప్పున ఆర్థిక సహాయం అందించానని ఆయన తెలిపారు. మరో విడతగా 125 మంది రైతు కుటుంబాలను ఎంపిక చేసి వారికి కూడా తలా రూ. 50 వేలు అందిస్తానని ధనుష్ తెలిపారు.