టైం బాగుంటే అంతా బాగుంటుంది !

అదృష్టంతో పాటు కష్టపడి పనిచేయడం నాకు కలిసి వచ్చింది. అదృష్టం ఉంది కదా! అని పనిచేయడం మానేస్తే సినిమాలు ఉండవు. “కష్టే ఫలి” అన్న సూక్తిని నమ్ముతాను. అదే నా సక్సెస్‌ రహస్యం. టైం బాగుంటే అంతా బాగుంటుంది. ప్రస్తుతం నా టైం బాగుంది.అందుకే  ఇన్నాళ్లు కొనసాగుతున్నానని- అంటోంది దక్షిణాది అగ్ర నటి నయనతార. 
 
హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు 
అలాంటి సినిమాలు చేయడానికి ఇదే సరైన టైమ్‌. దాదాపు పది సంవత్సరాల పాటు గ్లామర్‌ పాత్రలే ఎక్కువ చేశాను. ఓ విధంగా చెప్పాలంటే ఆ పాత్రలంటే విసుగు అనిపించింది. ఓ సమయంలో సినిమాలు మానేద్దామా అని కూడా అనిపించింది. అలాంటి సమయంలో హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలో అవకాశం వచ్చింది. నా అదృష్టం కొద్దీ ఆ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో వరుసగా అలాంటి సినిమాలే వస్తున్నాయి. అలాగని అన్నీ ఒకే రకమైన సినిమాలు చేయడం లేదు. డిఫరెంట్‌ కథలనే ఎంచుకుంటున్నాను.
చిన్న నటులతోనూ చేస్తున్నారు..

 సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో నేను చిన్న నటినే! ఆ సమయంలోనే రజనీకాంత్‌ సార్‌ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. నేను చిన్న నటిని అని ఆయన నాతో చేయడం మానలేదు కదా? అంత పెద్ద స్టార్‌కే లేని పట్టింపు నాకు ఎందుకు? ఇక పారితోషికం అంటారా? మీరే అన్నారు కదా….పదిహేను సంవత్సరాలుగా ఈ ఫీల్డులో ఉన్నాననీ, మరి మిగతా హీరోయిన్లతో పోల్చుకుంటే నేను సీనియర్నే! సీనియర్‌కి కొంచెం ఎక్కువ పారితోషికం ఇస్తే తప్పేంటి? మిగతా ఉద్యోగాల్లో సీనియర్లకి ఎక్కువ జీతాలుండవా? మాకూ అంతే!

ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది !
ఎన్నికష్టాలు ఎదురైనా ఎంత నష్టం వాటిల్లినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. ముందుకు సాగుతూ పోవాలి. మన పని మనం చేసుకోవాలే తప్ప అనవసర విషయాల గురించి మాట్లాడకూడదు. ముఖ్యంగా మనకు తెలియని విషయాల గురించి ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది.