‘‘ఫాల్స్ ప్రెస్టీజ్ కోసం కలెక్షన్లను యాడ్ చేసి నేనెప్పుడూ చెప్పను. సినిమా జయాపజయాలను ఉన్నదున్నట్టుగా స్వీకరించే పరిపక్వత నాకుంది. నేను మీడియా ముందుకొచ్చి చెప్పే ప్రతి విషయానికీ ఓ వేల్యూ ఉంటుంది. అందుకే రాంగ్ స్టేట్మెంట్స్ ఇవ్వను’’ అని దిల్‌రాజు అన్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్‌తేజ్ హీరోగా దిల్‌రాజు నిర్మించిన ‘ఫిదా’ శుక్రవారం విడుదల కానుంది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘‘హ్యాపీడేస్’ సమయంలోనే నాకు శేఖర్ కమ్ములతో వేవ్‌లెంగ్త్ కలిసింది. ‘ఫిదా’ కథ వినగానే ఓ పాయింట్‌కు కనెక్ట్ అయ్యా. వరుణ్ కెరీర్లో పెద్ద కమర్షియల్ హిట్ సినిమా అవుతుంది. సాయిపల్లవి తెలంగాణ యాస నేర్చుకుని డబ్బింగ్ చెప్పింది. కాస్త రెబల్‌గా ఉండే ఆమె పాత్రకి అందరూ ఫిదా అవుతారు. నెమ్మదస్తుడిగా వరుణ్ కనిపిస్తాడు. నాగబాబుగారికి సినిమా చాలా బాగా నచ్చింది. వెంటనే చిరంజీవిగారికి చూపిస్తానన్నారు.
ఈ ఏడాది మా సంస్థ నుంచి మొత్తం ఆరు చిత్రాలు విడుదలవుతాయి. ఇప్పటికే ‘శతమానం భవతి’, ‘నేను లోకల్’, ‘డీజే’తో హ్యాట్రిక్ హిట్ కొట్టాం. డీజే కలెక్షన్ల గురించి వివాదాలు ఎందుకు వచ్చాయో నాకు అర్థం కావడం లేదు. నేను నిర్మాతను మాత్రమే కాదు.. ఓ డిస్ట్రిబ్యూటర్‌ని, ఎగ్జిబిటర్‌ని. అల్లు అర్జున్ కెరీర్లో ఇప్పటిదాకా ‘సరైనోడు’ నంబర్ వన్ కలెక్షన్లను సాధించిన చిత్రం. ఆ కలెక్షన్లను ‘డీజే’ దాటేసింది. అందుకే సినిమా సక్సెస్ అని ప్రకటించాను. మావంటి నమ్మకమైన సంస్థలు ‘హిట్’ అని ప్రకటించాక కూడా అందులో తప్పులు వెతకడం భావ్యం కాదు. పరిశ్రమలో ఈ పరిస్థితి ఒక హీరోకి తలెత్తిందంటే మిగిలిన హీరోలకీ జరుగుతుందని గుర్తుంచుకోవాలి. విష సంస్కృతిని పెంచి పోషించకూడదని హీరోలు తమ అభిమానులకు చెప్పాలి’’ అని అన్నారు.
‘‘జీఎస్టీ గురించి రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా సంపూర్ణంగా ప్రకటించలేదు. ఆ వివరాలు తెలిశాక అసలు పరిస్థితి అవగతమవుతుంది. ప్రస్తుతం మేం నిర్మిస్తున్న ‘రాజా ది గ్రేట్’ను అక్టోబర్ 12న, ‘ఎంసీఏ’ను డిసెంబర్లో విడుదల చేస్తాం. వచ్చే సంక్రాంతికి మహేశ్ సినిమా, ఆ తర్వాత ‘శ్రీనివాస కల్యాణం’ ప్రారంభమవుతాయి. నా వ్యక్తిగత జీవితంలో జరిగిన విషాదం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నా’’ అని దిల్‌రాజు తెలిపారు.