‘ఇప్పటివరకు నన్నొక పక్కింటి అమ్మాయిగానే చూశారు. ఇకపై నాలోని భిన్నమైన, శక్తివంతమైన మరో కోణాన్ని చూస్తారు’ అని అంటోంది శ్రద్ధాకపూర్. ‘అషిఖీ 2’, ‘ఏక్ విలన్’, ‘హైదర్’, ‘ఎబిసిడి 2’, ‘బాఘి’, ‘ఓకే జాను’ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించిన శ్రద్ధా తాజాగా ‘హసీనా: ది క్వీన్ ఆఫ్ ముంబయి’ చిత్రంలో టైటిల్ పాత్రధారిగా నటిస్తోంది. ముంబయి మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ జీవితం ఆధారంగా దర్శకుడు అపూర్వ లఖియా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హసీనా పార్కర్‌గా శ్రద్ధా వెండితెరపై మెరవనుంది.
ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల కానున్న నేపథ్యంలో శ్రద్ధా మాట్లాడుతూ, ‘హసీనా పాత్ర నా కెరీర్లోనే పూర్తి భిన్నమైన పాత్ర. ఇలాంటి పాత్రను గతంలో ఎప్పుడూ చేయలేదు. నా కెరీర్‌ను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లే పాత్ర అవుతుందని భావిస్తున్నా. ఇప్పటివరకు నేను పాజిటివ్ పాత్రలు మాత్రమే పోషించాను. మొదటి సారి నెగటివ్ రోల్ పోషిస్తున్నాను. నా పాత్రను ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నా. అలాగే బాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ బయోపిక్‌లోనూ నటిస్తున్నాను. ఇందులో కూడా నేను నటించడానికి కారణం ఒక్కటే.. ఇకపై నేను ఓ కొత్త రకమైన సినిమాలను చేయదల్చుకోవడమే’
అని తెలిపింది.