కైకాల సత్యనారాయణ తొలుత హీరోగా సినీరంగ ప్రవేశం చేశారు. కైకాల సత్యనారాయణ 1959లో ‘సిపాయి కూతురు’ సినిమాతో తెలుగు సినీపరిశ్రమకు హీరోగా పరిచయమయ్యారు. అయితే అంతలా ఆడకపోవడంతో సరైన అవకాశాల కోసం నిరీక్షించాల్సి వచ్చింది. చిత్రసీమలో నిలదొక్కుకోవాలని నిర్ణయించుకున్న సత్యనారాయణ.. తన తొలి హీరోయిన్ జమునతో కలిసి పలు చిత్రాల్లో నటించారు. అనేక సినిమాల్లో ఆమెను భయపెట్టే పాత్రల్లోనూ కనిపించారు. ‘ఈ కాలం దంపతులు’ అనే చిత్రంలో హీరోగా జమునతోనే కలిసి నటించారు. అయితే ఆ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. తర్వాత ఆయన కథనాయకుడిగా చేసిన ‘తాయారమ్మ-బంగారయ్య’ చిత్రం మంచి విజయాన్ని అందుకున్నది. తర్వాత సంసారం-సాగరం, మొరటోడు వంటి సినిమాల్లో కైకాల హీరోగా చేశారు.
అయితే కైకాలలోని విలనిజాన్ని విఠలాచార్య గుర్తించారు. సినీపరిశ్రమలో ప్రతినాయక ప్రాతలు వేసేవారు తక్కువగా ఉన్నారని, అటువైపు వెళ్లాలని ఆయన కైకాలకు సూచించారు. దీంతో విఠాలాచార్య దర్శకత్వంలో రూపొందిన ‘కనకదుర్గ పూజ మహిమ’ అనే చిత్రంలో తొలిసారి విలన్‌గా నటించారు. అయితే ఎన్టీఆర్ అగ్గిపిడుగు సినిమాతో ఆయన సినీ జీవితం మలుపుతిరిగింది. ఎన్నో సినిమాల్లో తన డైలాగ్ డెలివరితో హీరోలతో పోటీపడి ప్రతినాయకుడి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అనంతరం కమెడియన్‌గా, తండ్రిగా, తాతగా కూడా రాణించారు. మొత్తంగా తన 60 ఏళ్ల సినీజీవితంలో 777 సినిమాల్లో నటించారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎస్వీ రంగారావు తర్వాత అలాంటి వైవిధ్యభరితమైన పాత్రలు పోషించిన నటుడు కైకాల ఒక్కరే కావడం గమనార్హం. 2019లో ‘మహర్షి’ సినిమాలో చివరిసారిగా కనిపించారు.
అగ్ర హీరోలతో సొంత సినిమాలు
సత్యనారాయణ సోదరుడు నాగేశ్వరరావుకు నిర్మాణరంగంలోకి ప్రవేశించాలనే కోరిక ఉండేది. అందుకే ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంతో ‘గజదొంగ’ చిత్రాన్ని తొలిసారిగా తన సమర్పణలో నిర్మించారు సత్యనారాయణ. ఈ చిత్రానికి నాగేశ్వరరావు, చలసాని గోపి నిర్మాతలు. ఆ తర్వాత రమా ఫిల్మ్స్ సంస్థను నెలకొల్పి కృష్ణ, శోభన్‌బాబులతో ‘ఇద్దరు దొంగలు’, తన కుమారులు లక్ష్మీనారాయణ, రామారావు నిర్మాతలుగా చిరంజీవితో ‘చిరంజీవి’ చిత్రాలు నిర్మించారు. శోభన్‌బాబుతో ‘అడవిరాజా’, చిరంజీవితో ‘కొదమసింహం’, అక్కినేనితో ‘బంగారు కుటుంబం’, బాలకృష్ణతో ‘ముద్దుల మొగుడు’ చిత్రాలు నిర్మించారు సత్యనారాయణ.
దర్శకేంద్రుడితో ఎక్కువ చిత్రాలు…
దాదాపు 800 చిత్రాల్లో నటించిన సత్యనారాయణ ప్రముఖ దర్శకులందరితోనూ పని చేశారు. వీరిలో ఎక్కువ శాతం .. అంటే 49 చిత్రాలు రాఘవేంద్రరావుతో చేయడం ఒక విశేషం. అలాగే ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో ఓ సీరియల్లో కూడా నటించారు సత్యనారాయణ. ఆ తర్వాత యాక్షన్ చిత్రాల దర్శకుడిగా పేరొందిన కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో 35 చిత్రాల్లో నటించారు. దాసరి దర్శకత్వంలో ఆయన 34 చిత్రాల్లో నటించారు. చిత్రపరిశ్రమలో తనకు గాడ్ ఫాదర్ లాంటి ఎన్టీఆర్ దర్శకత్వంలో 11 సినిమాల్లో నటించారు.
ఒకే ఏడాది 35 చిత్రాలు…
1970-90 వరకూ తెలుగు సినిమాల్లో ప్రధాన విలన్‌గా ఆయన ఓ వెలుగు వెలిగారు. 1984లో సత్యనారాయణ నటించిన 35 చిత్రాలు విడుదలయ్యాయంటే ఆ రోజుల్లో ఆయనెంత బిజీనో అర్ధం చేసుకోవచ్చు. రోజుకి ఐదారు షూటింగ్స్‌లో పాల్గొనేవారు. ఆయన కోసం హీరోలు సెట్లో ఎదురు చూసిన సందర్భాలూ ఉన్నాయి. కంటి నిండా నిద్ర ఉండేది కాదు. కడుపారా తినడానికి టైమ్ ఉండేది కాదు. ఆరు పదుల నటజీవితంలో, ఐదు తరాల హీరోలతో, వందలాది విభిన్న పాత్రలు పోషించి, చరిత్ర సృష్టించారు. ఆయన సాధించిన విజయాలు అనన్య సామాన్యం.
ఎన్టీఆర్‌తో కలిసి 101 చిత్రాల్లో…
కైకాల సత్యనారాయణ తన 60ఏళ్ళ సినీ కెరీర్లో 777 సినిమాల్లో నటించారు. అందులో ఎక్కువగా సీనియర్ ఎన్టీఆర్‌తో వెండితెరను పంచుకున్నారు. రెండవ సినిమా ‘కనక దుర్గ పూజా మహిమ’ చేస్తున్నప్పుడే కైకాల.. సీనియర్ ఎన్టీఆర్ కంట పడ్డాడు. అచ్చం తనకు మల్లే దేహం ఉండటంతో ఎన్టీఆర్ తను నటిస్తున్న ‘సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి’లో కైకాలకు ఒక పాత్రనిచ్చారు. ఈ సినిమాలో కైకాల యువరాజు పాత్రలో నటించాడు. ఆయన నటనకు ముగ్దుడైన సీనియర్ ఎన్టీఆర్.. తను డూప్‌గా నటించిన ప్రతీ సినిమాలో కైకాలనే పెట్టుకున్నారు. ఎన్టీఆర్‌తో కలిసి కైకాల 101 చిత్రాల్లో నటించారు.
యముడు అంటే ఆయనే…
యముడి పాత్రలకు పెట్టింది పేరుగా కైకాల గుర్తింపు పొందారు. యమగోల నుంచి రవితేజ నటించిన దరువు వరకూ యముడిగా నటించి, యముడు అంటే ఇలాగే ఉంటాడేమో అన్నంతగా మెప్పించారు. ఆయన కాకుండా మరికొందరు యముడి పాత్రలు పోషించారు కానీ కైకాల తరహాలో ఎవరూ మెప్పించలేకపోయారు. జనాల్లో యముడు అంటే ఆయనే అన్నంతగా ముద్ర పడింది. ఆయన నటించిన చివరి చిత్రం ‘మహర్షి’. అందులో పూజా హెగ్డే తాతయ్యగా, అతిథి పాత్రలో కనిపించారు. అంతకు ముందు ఎన్టీఆర్ బయోపిక్ ‘యన్.టి.ఆర్ – కథానాయకుడు’లో దర్శకుడు హెచ్.యమ్. రెడ్డి పాత్రలో మెరిశారు… ‘యమగోల ’ చిత్రంలో మొదటిసారి యముడిగా నటించా. ఆ పాత్ర ఎంతగానో గుర్తింపు తెచ్చింది. తర్వాత చిరంజీవితో ‘యముడికి మొగుడు’ చేశా. ‘పిట్టలదొర’, ‘యమలీల’, ఇలా ఏ సినిమాలోనైనా యముడి పాత్ర అంటే నన్నే తీసుకునేవారు. ‘యమదొంగ’లోనూ అవకాశం వచ్చింది. కొన్ని కారణాల వల్ల చేయలేదు’’ అని చెప్పారు సత్యనారాయణ.