‘దహిణి – ది విచ్’… జాతీయ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ రాజేష్ టచ్ రివర్ తెరకెక్కించిన మరో విలక్షణ చిత్రం .ఇంటర్నేషనల్ ఫిల్మ్ పెస్టివల్‌లో ఈ సినిమా అద్భుతమైన స్పందనను, అవార్డులను రాబట్టుకుంటోంది. తాజాగా ఆస్ట్రేలియాలో జరిగిన టైటాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ పెస్టివల్‌లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా ‘దహిణి – ది విచ్’ అవార్డ్‌ను దక్కించుకుంది. ఈ అవార్డు ఫంక్షన్ ను సిడ్నీలోని ప్యాలెస్ చౌవెల్ సినిమాలో ఘనంగా నిర్వహించబోతున్నారు. ‘దహిణి – ది విచ్’ పసిఫిక్ బీచ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ వేడుకల్లో బెస్ట్ ఫీచల్ ఫిల్మ్‌గా నిలిచింది. స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకల్లో బెస్ట్ ఫీచర్ మూవీగా నామినేట్ అయ్యింది.
దహిణి – మంత్రగత్తె మూవీ సోషల్ థ్రిల్లర్. భారతదేశం 17 రాష్ట్రాల అన్వేషణలో ఉన్న మంత్రగత్తె కథే ఈ సినిమా. ఇదొక క్రూరమైన వాస్తవికత. ఈ విలక్షణమైన కాన్సెప్ట్‌తో సినిమాను తెరకెక్కించారు. ఇందులో ఇండియా సహా పలు దేశాలను పీడిస్తున్న మానవ హక్కులకు సంబంధించిన ఆందోళనను ప్రస్తావించారు. లింగ బేదమైన హింసకు సంబంధించిన రూపాల్లో మంత్రగత్తె అన్వేషణ అనేది ఒకటి. సాధారణ లింగ నిబంధనలకు అనుగుణంగా లేని వేలాది మంది మహిళలను చంపడానికి లేదా వ్యక్తుల మధ్య వివాదాలను పరిష్కరించడానికి దీన్ని ఒక కారణంగా చూపించారు. ఈ సినిమాతో అసలు ఎవరూ బహిరంగంగా మాట్లాడని విషయాలను స్క్రీన్‌పై చూపించే ప్రయత్నం చేశారు. సినిమాను పూర్తిగా ఒరిస్సాలో మంత్రగత్తెల అన్వేషణ ఎక్కువగా ఉండే మయూర్ భంజ్ జిల్లాలో చిత్రీకరించారు.
అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకుని జాతీయ అవార్డు గెలుగుచుకున్న యాక్టర్ తన్నిష్ట చటర్జీ ఇందులో ప్రధాన పాత్రలో నటించారు. జె.డి.చక్రవర్తి ఓ వైవిధ్యమైన పాత్రను పోషించటం విశేషం. ఇంకా అషికీ హుస్సేన్, బద్రూల్ ఇస్లామ్, అంగనా రాయ్, రిజ్జు బజాజ్, జగన్నాథ్ సేత్, శ్రుతీ జయన్, దిలీప్ దాస్ వంటి వెర్సటైల్ ఆర్టిస్టులు సైతం ఇందులో కీలక పాత్రల్లో నటించారు.
సినిమాటోగ్రాఫర్ నౌషద్ షరీఫ్, ప్రొడక్షన్ డిజైనర్ సునీల్ బాబు, సౌండ్ డిజైనర్ అజిత్ అబ్రహం జార్జ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోరర్ జార్జ్ జోసెఫ్, ఎడిటర్ శశి కుమార్, మేకప్ డిజైనర్ ఎన్జి రోషన్, మాటలు: రవి పున్నం, పాట రాసిన డా.గోపాల్ శంకర్ తదితరులు ఈ చిత్రానికి వర్క్ చేశారు.
ఓరియన్ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, సన్‌టచ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై పద్మశ్రీ అవార్డు గ్రహీత, మానవతా నాయకురాలు సునీత కృష్ణన్.. ప్రదీప్ నారాయణన్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.