సినీ వినోదం రేటింగ్ : 2/5
మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ కొరటాల శివ దర్శకత్వంలో నిరంజన్‌రెడ్డి, రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
కధ… ధర్మస్థలి గురుకులంలో పెరిగి పెద్దవాడైన సిద్ధ (రామ్ చరణ్), అక్కడి ప్రజలకు అండగా నిలబడి అనుక్షణం ధర్మాన్ని రక్షిస్తుంటాడు. రాజకీయంగా ఎదగాలనుకున్న బసవ (సోనూసూద్) కన్ను ధర్మస్థలిపై పడుతుంది. దాన్ని చేజిక్కించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. కానీ ధర్మస్థలిని కాపాడుతున్న సిద్ధ అడ్డుతొలగిస్తేనే ధర్మస్థలి తన సొంతమవుతుందని భావించిన బసవ.. అతడి అనుచరులు సిద్ధ మీద అటాక్ చేస్తారు. ఆ క్రమంలో గాయపడిన అతడ్ని కొందరు కాపాడుతారు. ఇంతలో బసవ కారణంగా.. అక్కడ ధర్మం మంటగలిసి అధర్మం పేట్రేగుతుండడంతో దాన్ని అడ్డుకోడానికి ఆ ప్రాంతంలోకి అడుగుపెడతాడు ఆచార్య (చిరంజీవి). బసవ అతడి గ్యాంగ్ చేసే అరాచకాల్ని ఒకొక్కటిగా ఎండగడుతూ ఉంటాడు. ఇంతకీ ఆచార్య ఎవరు? సిద్ధకి, అతడికి సంబంధం ఏంటి? ధర్మస్థలిని ఏ విధంగా కాపాడుతారు? అనేది సినిమాలో చూడాలి …
విశ్లేషణ… కొరటాల శివ వంటి దర్శకుడి నుంచి మెగాస్టార్ హీరోగా సినిమా అంటే కచ్చితంగా అంచనాలు భారీగానే ఉంటాయి.పైగా రామ్ చరణ్ కూడా ఉన్నాడు. తండ్రీ కొడుకుల ఇమేజ్ కు తగ్గట్టుగానే అభిమానులు ఆశిస్తారు. అయితే, ఆ అంచనాలను శివ ముంచేశాడు. అసలు ఇది కొరటాల శివ సినిమానేనా అనిపిస్తుంది. సినిమాకు బలం కథే. అది బలహీనపడితే సినిమాలో మిగిలిన అంశాలు ఎంత గొప్పగా ఉన్నా.. అవి మనకి ఎక్కవు. సినిమాలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుడిని ఆకట్టుకోవు. కొత్త సినిమా చూస్తున్న ఫీలింగ్ కలగదు. తెలుగు ప్రేక్షకులు ఇలాంటి కథలు ఎన్నో చూసేశారు. కొరటాల సినిమాలో సహజంగా ఉండే భావోద్వేగాలు కూడా ఇందులో కరువయ్యాయి. చిరంజీవి, రామ్ చరణ్, ఐదు ఫైట్లు, నాలుగు పాటలు అన్నట్టుగా ఉంది ఆచార్య. యాక్షన్ సీక్వెన్స్‌లకు ఇచ్చినంత ప్రాధాన్యత కథ, కథనాలకు శివ ఇవ్వలేకపోయారు. ఫస్టాఫ్ అంతా చిరంజీవి తన నటన, నృత్యం, యాక్షన్‌తో అభిమానులకు మంచి అనుభూతిని అందిస్తారు. ఇక సెకండాఫ్ లో సిద్ధ పాత్రధారి రామ్ చరణ్ ఎంటర్ అయినప్పటి నుంచి కథనం ఆసక్తిగా మారుతుంది. అలాగే నక్సల్స్ గా తండ్రీ కొడుకుల సన్నివేశాలు మెప్పిస్తాయి. కాకపోతే ఇప్పుడు నక్సల్స్ ప్రభావం అంతగా లేదు కాబట్టి.. సింకవలేదు. తండ్రీ కొడుకులు ఇద్దరూ కలిసి చిందేసిన ‘భలే బంజారా’ పాట అభిమానుల్ని బాగా అలరిస్తుంది. అరవై దాటిన వయసులో కూడా చిరంజీవి కొడుకుతో కలసి ఎనర్జిటిక్ గా డ్యాన్స్ చేయడం చెప్పుకోదగ్గ విశేషం.
నటీనటులు… ‘ఆచార్య’ గా చిరంజీవి ఈ చిత్ర కథాకథనాలకు తగ్గట్టుగా.. తన రెగ్యులర్ మాస్ చిత్రాలకు భిన్నంగా ఇందులో నటించారు. డైలాగ్స్‌లోనూ, డ్యాన్స్ లోనూ ఆయన మార్క్ కనిపిస్తుంది. అలాగే సిద్ధగా రామ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్, అభినయం, డ్యాన్స్ ,ఫైట్స్ ఆకట్టుకుంటాయి. పూజా హెగ్డే గ్లామర్, అభినయం బాగున్నా… ఆమెను పూర్తి స్థాయిలో వినియోగించుకోలేదు. విలన్స్‌గా సోనూసూద్, జిషు సేన్ గుప్తా తమ పాత్రలకు న్యాయం చేకూర్చారు. ఇంకా తనికెళ్ళ భరణి, నాజర్, అజయ్,బెనర్జీ, వెన్నెల కిషోర్, నక్సల్స్ నాయకుడిగా నటించిన సత్యదేవ్ తమ పాత్రలకు న్యాయం చేశారు. రెజినా ఓ పాటలో మెరిసింది.
సాంకేతికవర్గం… సురేష్ సెల్వరాజన్ ఆర్ట్ వర్క్ చాలా బాగుంది. ధర్మస్థలి అనే టెంపుల్ టౌన్‌ను అద్భుతంగా ఆవిష్కరించారు. కొండల్లో పాదఘట్టం అనే చిన్న గ్రామం సెట్‌ను కూడా బాగా వేశారు. ఈ సెట్స్‌ను సినిమాటోగ్రాఫర్ తిరు అందంగా తన కెమెరాలో బంధించారు. రామ్-లక్ష్మణ్ మాస్టర్ల ఫైట్లు ఎప్పటిలానే హై ఓల్టేజ్‌లో ఉన్నాయి. సంగీత దర్శకుడు మణిశర్మ స్వరపరిచిన పాటలు బాగానే ఉన్నాయి. మణిశర్మ నేపథ్య సంగీతం యాక్షన్ సీక్వెన్స్‌లలో బాగుంది – రాజేష్