సినీ వినోదం రేటింగ్ : 2.5/5
అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్ల పై సిద్ధు ముద్ద, అల్లు బాబీ నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఈ చిత్రం నిర్మించారు.
కధ… గని (వరుణ్‌తేజ్)కి చిన్నప్పటి నుంచి బాక్సింగ్ అంటే ఇష్టం. అతని తండ్రి విక్రమ్ ఆదిత్య(ఉపేంద్ర) బాక్సింగ్ ఛాంపియన్. నేషనల్స్‌లో గెలిచి తన తోటి ఆటగాళ్లకు మంచి సదుపాయాలు ఏర్పాటు చేయాలని అతని తపన. ఆ ప్రయత్నంలో ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకుని నేషనల్స్ ఆడతాడు. ఆ క్రమంలో అతను స్టెరాయిడ్స్ తీసుకున్నాడనే నిందతో బాక్సింగ్ ఆడటానికి వీలు లేకుండా చేస్తారు. ఆ బాధతో గని తల్లి బాక్సింగ్ జోలికి వెళ్లకూడదని గని దగ్గర మాట తీసుకుంటుంది. తల్లికి మాటిచ్చినా.. తండ్రి వల్ల చెడ్డ పేరు వచ్చిందనే కోపంతో ఎలాగైనా బాక్సింగ్‌లో ఛాంపియన్ అయి తన సత్తా చాటాలనుకుంటాడు గని. ఆ దిశగా అడుగులు వేస్తాడు. ఆ ప్రయత్నంలో గనికి ఎదురైన సవాళ్లు ఏంటి? తను అనుకున్నది సాధించాడా? అన్నది సినిమాలో చూడాలి …
విశ్లేషణ… గతంలో వచ్చిన బాక్సింగ్ నేపథ్య చిత్రాల్లానే ‘గని’ కూడా అదే ఫార్ములాతో తెరకెక్కింది. తండ్రి వదిలివెళ్లిన ఆశయాన్ని సాధించే కొడుకు కథ ఇది. అయితే కాలేజ్ బ్యాక్‌డ్రాప్, తన తల్లితో ఉండే బాండింగ్‌ను ఆసక్తికరంగా మలచలేకపోయారు. తల్లితో ఉండే భావోద్వేగ సన్నివేశాల్లో సహజత్వం మిస్ అయింది. నదియాలాంటి మంచి ఆర్టిస్ట్‌తో ఎలాంటి భావోద్వేగాలనైనా బాగా పలికించవచ్చు. దర్శకుడు అలా చెయ్య లేకపోయాడు. తల్లికి ఇచ్చిన మాట ప్రకారం గని ఆమెకు తెలియకుండా బాక్సింగ్ నేర్చుకోవడం, వీధి పోరాటాల్లో పై చేయి సాధిస్తూ తన సత్తా చాటే సన్నివేశాలు ఆకట్టుకునేలా అనిపిస్తాయి. అయితే ప్రథమార్థంలో నాయకానాయికల మధ్య పెట్టిన లవ్‌ట్రాక్‌లో ఎలాంటి ఉద్వేగాలు పండలేదు. భావోద్వేగాలతో సాగాల్సిన కథలో లవ్ఎపిసోడ్ను ఇరికించారనే భావన కలుగుతుంది. స్పోర్ట్స్ డ్రామాకు ఎమోషన్ అనేది చాలా ముఖ్యం. అది ఈ చిత్రంలో మిస్ అయింది.
నవీన్ చంద్రతో గొడవ, రింగ్‌లో పోటీ సన్నివేశాలు గత చిత్రాల్లో ఎక్కడో ఓ చోట చూసినట్లే అనిపించాయి. కోచ్‌గా నరేశ్ పాత్ర సిల్లీగా ఉంది. ఇంటర్వెల్ వరకూ సా గి న సినిమా ఆ తర్వాత ఉపేంద్ర ఎంట్రీతో కాస్త గాడిలో పడిండి. ఉపేంద్ర ప్లాష్‌బ్యాక్ ఎపిసోడ్, క్లెమాక్స్ ఘట్టాలు మాత్రం ఎమోషనల్‌గా సాగాయి. ప్రీ క్లెమాక్స్‌లో వచ్చే తమన్నా ఐటెంసాంగ్ అసందర్భం అనిపిస్తుంది. క్రీడారంగంలో ఎలాంటి రాజకీయాలు ఉంటాయో మళ్లీ ఇందులో కూడా చూపించారు. ఒక వ్యక్తి స్వార్థం కోసం ఆటగాడిని ఎలా మట్టుపెట్టారు? మరో ఆటగాడు గెలిచినా ఆ ఆనందం లేకుండా ఎలా చేశారు అన్నది ఆసక్తికరంగా ఉన్నా.. గతంలో వచ్చిన స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాల్లో సన్నివేశాలు గుర్తొస్తాయి. సునీల్‌శెట్టి ఎంట్రీతో విక్రమ్ ఆదిత్య ఎంత గొప్ప ప్లేయర్ అన్నది తెలిశాక గనిలో వచ్చిన మార్పు, అక్కడి సన్నివేశాలు మెప్పించేలా ఉన్నాయి.
నటవర్గం… వరుణ్‌తేజ్ ఈ సినిమా కోసం బాగా శ్రమింఛి.. బాక్సర్‌గా శరీరాకృతిని తీర్చిదిద్దుకున్నారు. తన పాత్రలో పూర్తిగా ఇన్వాల్వ్ అయి బాగా నటించాడు. క్లెమాక్స్ సన్నివేశాల్లో వరుణ్‌తేజ్ నటన మెప్పిస్తుంది. కథానాయిక సయిమంజ్రేకర్కు కథలో ఏమాత్రం అవకాశం లేదు. హీరోయిన్ ఉంది- అంటూ పేరుకు అక్కడక్కడా తళుక్కుమంది. హీరోహీరోయిన్‌కి మధ్య ఒక్క రొమాంటిక్ సీన్ కూడా లేదు. ప్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లో ఉపేంద్ర తనదైన నటనతో ఆకట్టుకున్నారు. నదియా, సునీల్‌శెట్టి, జగపతిబాబు, నవీన్ చంద్ర తమ పాత్రలకు న్యాయం చేశారు.
అబ్బూరి రవి సంభాషణలు ఫర్వాలేదనిపించాయి. అక్కడక్కడా పేలాయి. జార్జ్ సి విలియమ్స్ కెమెరా పనితనం, విజువల్స్ బావున్నాయి. సంగీతపరంగా తమన్ నిరుత్సాహపరిచారు. గుర్తుంచుకునే పాటలు లేవు. ఈ మధ్యకాలంలో బ్యాగ్రౌండ్ స్కోర్‌తో ఆకట్టుకుంటున్న తమన్ ఈ సినిమా విషయంలో ఫెయిల్ అయ్యాడు. నిర్మాణ విలువలు భారీగా ఉన్నాయి -రాజేష్