సినీవినోదం రేటింగ్ : 2/5
సన్ పిక్చర్స్ పతాకం పై పాండిరాజ్ దర్శకత్వంలో కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
కధ… దక్షిణాపురం అనే టౌన్లో ఆడపిల్ల జన్మిస్తే ఎంతో పవిత్రంగా భావిస్తారు. ప్రతి ఏటా మహిళా ఉత్సవం నిర్వహిస్తూ ఆడబిడ్డల్ని గౌరవిస్తుంటారు. అదే ఊరికి చెందిన యువ న్యాయవాది కృష్ణమోహన్ (సూర్య). తొమ్మిదేళ్ల వయసులోనే తన చెల్లి కామాంధుల కర్కశత్వానికి బలై పోవడంతో.. మహిళలు అంటే గౌరవభావం కలిగి ఉంటు, వారికి ఎలాంటి సమస్య వచ్చినా చలించిపోతాడు. దక్షిణాపురం టౌన్లో కొందరమ్మాయిలు వరుసగా ఆత్మహత్యకు పాల్పడటం.. ప్రమాదాల్లో చనిపోవడం జరుగుతుంటుంది. ఈ సంఘటనల వెనకున్నది ఎవరు? వాటిని ఛేదించే క్రమంలో కృష్ణమోహన్ తెలుసుకున్న నిజాలేమిటి? ఈ కీచకపర్వాన్ని అంతమొందించడానికి యువ లాయర్ ఏ రీతిలో పోరాటం చేశాడు? అన్నది సినిమాలో చూడాలి…
విశ్లేషణ… దర్శకుడు పాండిరాజ్ ఆడపిల్లల పై జరుగుతున్న దారుణాలకు సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు.అయితే, పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని రాసుకోలేదు. కుటుంబ బంధాలను బాగానే ఎలివేట్ చేసినప్పటికీ.. గతంలో జూ.ఎన్టీఆర్ చేసిన ‘రాఖీ’ సినిమానే..కాస్త అటూ ఇటూ తిప్పి ..ఇప్పటి సాంకేతిక విలువలతో చేసినట్లు అనిపించింది..’చినబాబు’ లాంటి ఎమోషనల్ డ్రామా తెరకెక్కించిన పాండిరాజ్..ఈ చిత్రం తో మాత్రం అలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయలేకపోయాడు. కృష్ణమోహన్, అధిరా (ప్రియాంక అరుళ్మోహన్) మధ్య ప్రేమాయణం.. వారి పెళ్లి ఘట్టానికి దారితీసే పరిస్థితుల నేపథ్యంలో సినిమాలో ముఖ్యంగా తమిళ నేటివిటీ ఎక్కువుగా కనిపిస్తోంది. ఆర్టిస్ట్ ల హావాభావా లలో తమిళ వాసనలు స్పష్టంగా కనిపిస్తాయి. సినిమా మొదలైనప్పటినుండి మొదటి భాగం గజిబిజిగా ఉంటుంది. ఏ సీన్ ఎందుకు వస్తుందో అర్థం కాదు. కామెడీ పేరుతో మధ్యలో కొన్ని సన్నివేశాలు బలవంతంగా ఇరికించారు.కామెడీ ఏమాత్రం నవ్వు తెప్పించదు. ప్రమాదంలో చనిపోయిన ఓ అమ్మాయి కేసును ఛేదించే క్రమంలో లాయర్ కృష్ణమోహన్ అసాంఘిక శక్తులెవరో తెలుసుకుంటాడు. అక్కడి నుంచే కథ కాస్త సీరియస్ మలుపు తీసుకుంటుంది. అలాగే ఇంటర్వెల్ ఫైట్ ఎమోషనల్‌గా ఉంది. దాన్ని తెరకెక్కించిన తీరు బాగుంది. నిందితులెవరో తెలుసుకున్నాక.. వారిని అంతమొందించడం కోసం కృష్ణమోహన్ చేసే ప్రయత్నాలతో సెకండాఫ్ సాగింది.సెకండాఫ్‌లో హీరో, విలన్ మధ్య ఉండే గొడవతో సినిమాను రన్ చేశారు. హీరో, విలన్ల మధ్యన వచ్చే ఘర్షణ తాలూకు సన్నివేశాలు సాగతీసినట్లు, సినిమాటిక్ గా అనిపిస్తాయి.అందులో హీరో న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కడం, సమస్యలను ఎదుర్కోవడం.. అనే అంశాలతోనే సినిమాను మరీ ఎక్కువగా డ్రాగ్ చేశారు. క్లైమాక్స్ ఫైట్, దాన్ని ముగించిన తీరు అంత ఎఫెక్టివ్‌గా లేదు. సీరియస్ అంశాన్ని చర్చించాలనుకున్న దర్శకుడు కథలో అనవసరమైన కమర్షియల్ అంశాల్ని.. ఫ్యామిలీ ఎలిమెంట్స్, కామెడీ హంగులు జోడించిన ప్రయత్నం ఏమాత్రం ఫలించలేదు.