సినీవినోదం రేటింగ్ : 3/5
సురేష్ ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్ జీతు జోసెఫ్ దర్శకత్వంలో డి సురేష్ బాబు, ఆంటోనీ పెరంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి ఈ చిత్రం నిర్మించారు. నవంబర్ 25,2021న అమెజాన్ ప్రైం లో విడుదలయ్యింది.
కధ… పోలీస్ ఆఫీసర్ గీత కొడుకు(విక్రమ్) కేసు నుంచి బయటపడ్డ రాంబాబు (వెంకటేష్) ఫ్యామిలీకి మళ్లీ ఆరేళ్ల తరువాత కష్టాలు మొదలవుతాయి. ఈ ఆరేళ్లలో ఊర్లో రాంబాబు చాలా ఎదుగుతాడు. కేబుల్ ఆపరేటర్ స్థాయి నుంచి థియేటర్ ఓనర్ వరకు అవుతాడు. ఎలాగైనా సరే తన వద్ద ఉన్న కధతో సినిమా తీయాలని రైటర్ వినయ్ చంద్ర (తణికెళ్ల భరణి)సాయం అడుగుతాడు. రాంబాబు తన సినిమా పనుల్లో బిజీగా ఉంటాడు. మరో వైపు పాత కేసును తవ్వుతుంటారు పోలీసులు. ఇందుకోసం అండర్ కవర్ ఆపరేషన్ కూడా చేస్తారు. రాంబాబు ఇంట్లో జరిగే విషయాలు, మాట్లాడుకునే సంగతులు కూడా పోలీసులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. కానీ శవాన్ని ఎక్కడ పెట్టారో ఇటు కుటుంబ సభ్యులకు కూడా రాం బాబు చెప్పడు. అది తెలియక పోతే పోలీసులు అడుగు ముందుకు వేయలేరు. అయితే ఈ కేసులో పోలీసులకు దొరికి ఆధారాలేంటి? కేసు నుంచి తన ఫ్యామిలీని కాపాడుకునేందుకు రాంబాబు ఎలాంటి ఎత్తులు వేశాడు? ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? చివరకు ఎటువంటి ట్విస్ట్ వచ్చిందన్నది సినిమాలో చూడాలి…
విశ్లేషణ… క్రైమ్ సస్పెన్ థ్రిల్లర్లకు కావాల్సింది ఎమోషన్. చూసే ప్రేక్షకులను అందులో ఎంత వరకు లీనమయ్యేలా చేయగలమన్నదానిపై సినిమా ఆధార పడుతుంది. నెక్ట్స్ ఏం జరుగుతుందా? అనే టెన్షన్ చూసే ప్రేక్షకుల్లో కలగాలి. అలాంటి ఫీలింగ్ కలిగింది దృశ్యం. రాంబాబుగా వెంకటేష్ తన ఫ్యామిలీ కోసం ఎన్ని రకాలు పనులు చేశాడు, న్యాయవ్యవస్థ, చట్టవ్యవస్థలను ముప్పతిప్పలు పెట్టాడు. అలాంటి రాంబాబు మళ్లీ తన ఫ్యామిలీకి కష్టం ఎదురైతే, ఆగిపోయిన ఇన్వెస్టిగేషన్ మళ్లీ మొదలైతే పరిస్థితి ఏంటి? అనే పాయింట్‌తో ఈ సెకండ్ పార్ట్‌ను రాసుకున్నాడు.’దృశ్యం’కు సీక్వెల్ ఇది. అదే తారాగణం. అదే నేపథ్యం. అదే కొనసాగింది. తల్లీకూతుళ్లు కుర్రాణ్ణి హత్య చేసిన ఆరేళ్ల తర్వాత నుంచి కథ మొదలవుతుంది. ఈ మూవీ మలయాళ వర్షన్ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో రిలీజై, సూపర్ హిట్ అయింది. అయినా.. మళ్లీ తెలుగు ప్రేక్షకుల కోసం దర్శకుడు జీతూ జోసెఫ్ ఫ్రెష్ లుక్‌తో ఈ మూవీని తెరకెక్కించాడు. తెలుగు వర్షన్లో కొన్ని స్వల్ప మార్పులు చేశాడు .ఎవరూ ఊహించని ట్విస్టులతో సినిమాపై ఆసక్తి పెంచేశాడు. సెకండాఫ్‌లో కథ చాలా స్పీడ్‌గా వెళ్తుంది. కేసు నుంచి తన ఫ్యామిలీని కాపాడుకునేందుకు రాంబాబు వేసే ఎత్తులు, పైఎత్తులు చాలా ఉత్కంఠభరితంగా సాగుతాయి. ముఖ్యంగా చివరిలో రాంబాబు ఇచ్చే ట్విస్ట్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతారు. కోర్టు సన్నివేశాలు సినిమాని మరోస్థాయికి తీసుకెళ్తాయి. మంచి థ్రిల్లర్ చూసిన సంతృప్తి ప్రేక్షకుడిలో కలుగుతుంది.
పోలీసుల అంచనాలకు మించి వేసే ఎత్తులతో రాంబాబు అందరినీ ఆకట్టుకుంటాడు. ఆ పాత్రలో వెంకటేష్ జీవించాడు.సెకండాఫ్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్‌ని అద్బుతంగా పండించాడు. నిజం ఎప్పుడెప్పుడు బయటపడుతుందా? అని జ్యోతి పాత్రలో మీనా అద్భుతంగా నటించింది. ఇక రాంబాబు పిల్లలుగా కృతిక, ఎస్తర్ అనిల్ …కుమారుడిని కోల్పోయిన తల్లిదండ్రులుగా నదియా, నరేశ్ తమ పాత్రల్లో చక్కగా నటించారు. ఐజీగా సంపత్ రాజ్, కానిస్టెబుల్‌గా సత్యం రాజేశ్, రాంబాబు లాయర్ గా పూర్ణ, రచయితగా తనికెళ్ల భరణి, షఫీ, సుజ, సీవీఎల్, రాజ రవీంద్ర తమ పాత్రలలో బాగా నటించారు.సతీష్ కురుప్ సినిమాటోగ్రఫీ బాగుంది. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్ లో లోపాలు ఎక్కడా కనిపించవు. అనూప్ రూబెన్స్ సంగీతం మాత్రం అంతగా ఆకట్టుకోదు – రాజేష్