“తన కెరీర్లో బాలీవుడ్ అరంగేట్రం గొప్ప అనుభూతిని మిగిల్చిందని చెబుతోంది రష్మిక మందన్న. తొలి చిత్రం ద్వారా ఎన్నో కొత్త విషయాల్ని నేర్చుకునే అవకాశం దొరికిందని అంటోంది. రంగం ఏదైనా మనం వేసే తొలి అడుగుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది”…అని చెప్పింది రష్మిక. ‘మిషన్‌మజ్ను’ సినిమాతో బాలీవుడ్లో తొలి అడుగు వేస్తోంది రష్మిక మందన్న. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకున్న రష్మిక ఈ సినిమా అనుభవాలను పంచుకుంది…
నాకున్న హద్దుల్ని చెరిపేస్తూ.. “దర్శకుడు కథ చెబుతున్నప్పుడే ‘మిషన్‌మజ్ను’లో తప్పకుండా నటించాలనుకున్నా. ఇలాంటి పాత్ర మళ్లీ రాదనిపించింది. అందుకే ఈ సినిమా అంగీకరించి బాలీవుడ్లో అడుగుపెట్టా. “మిషన్ మజ్ను’ సినిమాతో హిందీ భాష, సంస్కృతి, ప్రజలు ఇలా ఎన్నో విషయాలు తెలుసుకున్నా. బాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు అక్కడి పనితీరుపై అవగాహన వచ్చింది. ఉత్తరాది రాష్ట్రాలను సందర్శించాలనే నా కల నెరవేరింది. షూటింగ్ కోసం నార్త్ ఇండియా మొత్తం చుట్టేశా. నటనపరంగా నాకున్న హద్దుల్ని చెరిపేస్తూ.. నన్ను నేను కొత్తగా పునరావిష్కరించుకునే ఛాన్స్ లభించింది. అప్పుడే షూటింగ్ అయిపోయిందా? అన్న భావన కలిగింది.మంచి టీమ్‌తో కలిసి పని చేశా. జీవితకాలం మర్చిపోలేని జ్ఞాపకాల్ని ఈ చిత్రం మిగిల్చింది” అని పేర్కొన్నది. ‘ఐ లవ్ మిషన్ మజ్ను’ టీమ్ అని ఆమె ట్విట్టర్లో రాసుకొచ్చింది. సిద్ధార్ధ్ మల్హోత్రా హీరోగా నటించిన ఈ చిత్రానికి శంతన్ బాగ్చి దర్శకుడు.
వాయిదా వేసుకోమని చెప్పారు!… రష్మిక మందన్నకు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌ల నుంచి వరుస ఆఫర్లు వస్తుండటంతో షూటింగులతో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక పలు ఆసక్తికర విషయాలు చెప్పింది… “నేను వరుసగా షూటింగుల్లో పాల్గొనడం అమ్మానాన్నలకు నచ్చడం లేదు. కరోనా పూర్తిగా పోకపోవడంతో కొన్నాళ్ల పాటు షూటింగ్‌లను వాయిదా వేసుకోమని చెప్పారు.. అయితే ‘నా పని విషయంలో ఎవరిని ఇన్వాల్వ్ కానివ్వను’ అనే విషయం వాళ్లకు తెలుసు. పేరేంట్స్‌గా వాళ్లు చూపిస్తున్న ప్రేమకు చాలా సంతోషంగా ఉంది. కానీ షూటింగ్ షెడ్యూల్ మన చేతుల్లో ఉండదు కదా!..అందుకే అన్ని జాగ్రత్తలు పాటిస్తూ షూటింగులో పాల్గొంటున్నాను. కానీ నా బిజీ షెడ్యూల్ కారణంగా అమ్మానాన్నలు బాధపడుతున్నారు” అంటూ రష్మిక చెప్పింది..
అమితాబ్ తో కలిసి పనిచేయడం గురించి సంతోషం వ్యక్తం చేసిన రష్మిక.. “అలాంటి గొప్ప నటుడితో కలిసి సుధీర్ఘంగా పనిచేయడంతో చాలా విషయాలు తెలుసుకునే అవకాశం దక్కిందని అంది.. ‘పాత్రకు తగినట్లుగా ఎలా నటించాలి.సెట్లో ఎంత సరదాగా ఉండాలి.. అనే విషయాలను ఆయన దగ్గరనుంచి నేర్చుకున్నా. నిజంగా బిగ్‌బి లాంటి లెజండరీ తో పనిచేసే అవకాశం రావడం నిజంగా అదృష్టం” అని చెప్పింది. ప్రస్తుతం రష్మిక తెలుగులో `పుష్ప`, `ఆడవాళ్లు మీకు జోహార్లు`చేస్తోంది.