ప్రముఖ నటి జయంతి అనారోగ్యంతో జులై 26న తుదిశ్వాస విడిచినట్లు కొడుకు కుమార్(కేకే) తెలియజేసారు. తెలుగు సినిమాపై నటి జయంతి ఒక చెరగని ముద్ర వేసుకున్నారు. ఒకవైపు హీరోయిన్‌గానే కాకుండా.. కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, దొంగ మొగుడు, తల్లిదండ్రులు, స్వాతి కిరణం, ఘరానా బుల్లోడు, పెద్దరాయుడు, రాముడొచ్చాడు, కంటే కూతుర్నే కను లాంటి చిత్రాలు తెలుగు ప్రేక్షకుల్ని ఆమెకు మరింత దగ్గర చేశాయి. బళ్ళారిలో 1945లో పుట్టింది కమలా కుమారి అలియాస్ జయంతి. తండ్రి బాలసుబ్రహ్మణ్యం ఇంగ్లీష్ టీచర్. తల్లి సంతాన లక్ష్మి, కమలా కుమారితో పాటు ముగ్గురు అక్కాచెళ్లెలు, ఇద్దరు తమ్ముళ్లు. చిన్నప్పుడే భర్త నుంచి వేరుపడిన సంతాన లక్ష్మి.. పిల్లల్ని తీసుకుని మద్రాస్‌కు మకాం మార్చేసింది. చిన్నతనంలోనే క్లాసికల్ డ్యాన్సింగ్ ఇనిస్టిట్యూట్‌లో చేరిన కమల.. మనోరమ(సీనియర్ నటి)తో స్నేహం పెంచుకుంది. చిన్నతనంలోనే కమలకు సినిమాలంటే విపరీతమైన పిచ్చి ఉండేది. నటుడు నందమూరి తారక రామారావు(స్వర్గీయ)ను ఆమె ఆరాధించేది.
సినిమాలపై ఎన్టీఆర్ సలహా!… ఆమె సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు స్వర్గీయ ఎన్టీఆర్ ఓ సలహానిచ్చారు. ఇంతకీ ఆయనిచ్చిన సలహా ఏంటనే విషయంలోకి వెళితే.. జయంతికి పన్నెండేళ్ల వయసులో కుటుంబం బళ్ళారి నుంచి చెన్నై వచ్చింది. స్వర్గీయ ఎన్టీఆర్, జయంతి పక్క పక్క ఇళ్లలో ఉండేవారు. తీరిక సమయాల్లో ఆయన జయంతిని ఒళ్ళో కూర్చోపెట్టుకుని కబుర్లు చెబుతుండేవారు. జయంతి తల్లి సంతాన లక్ష్మి తన కూతుర్ని సినిమాల్లో చేర్చుకోవాలనే కోరిక వ్యక్తం చేసినప్పుడు ముందు చదువు పూర్తి చేయనివ్వమని, బాగా చదువు కొంటున్న అమ్మాయిని సినిమాలు, డాన్సులు అంటూ పక్కదారి పట్టించవద్దని ఎన్టీఆర్ సలహా ఇచ్చారు. 1963 లో కన్నడ సినిమా ‘జైను గూడు’ చిత్రంతో జయంతి నటిగా పరిచయం అయ్యారు. ఆమె తొలి తెలుగు చిత్రం ఎన్టీఆర్ నటించిన ‘జగదేక వీరుని కథ’. ఆ తర్వాత ఎన్టీఆర్ తో కలిసి చాలా చిత్రాల్లో నటించారు.
పుట్టస్వామి ద్వారా అదృష్టం.. కన్నడ దర్శకుడు వైఆర్ పుట్టస్వామి ఓ కొత్త సినిమా కోసం అడిషన్స్ నిర్వహిస్తున్నాడు. ఆ టైంలో డ్యాన్స్ రిహాల్స్ కోసం వెళ్లిన ఆమెను చూసి.. ఏకంగా లీడ్ రోల్ ఇచ్చేశాడాయన. అంతేకాదు కమలా కుమారి పేరును కాస్త.. ‘జయంతి’గా మార్చేశాడు. అలా ఆమె తొలిచిత్రం ‘జెనుగూడు'(1963)తో హీరోయిన్గా పరిచయం అయ్యింది. ఇక ఆ సినిమా పెద్ద హిట్ కావడంతో.. జయంతి కాల్షీట్స్ కోసం డైరెక్టర్లు క్యూ కట్టారు.
ఇందిర ముద్దాడి.. గుడ్ లక్ చెప్పింది!
జయంతి రెండో సినిమా ‘చందావల్లీ తోట’ సూపర్ హిట్. ఆ చిత్రానికి ప్రెసిడెంట్ మెడల్ కూడా దక్కింది. ఇక ఆమె కెరీర్‌ను తారాస్థాయికి తీసుకెళ్లిన సినిమా ‘మిస్ లీలావతి’(1965). మిస్ లీలావతికి ఆమెకు ప్రెసిడెంట్ మెడల్ దక్కింది. ఆ సమయంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిగా ఉన్న ఇందిరా గాంధీ మెడల్ అందించింది. అంతేకాదు జయంతిని ఆప్యాయంగా ముద్దాడి.. గుడ్ లక్ కూడా చెప్పింది ఇందిర.
అక్కినేని తో అనుబంధం!… అక్కినేని తో కలసి చాలా సినిమాలు చేశారు జయంతి. అయితే అవన్నీ చెల్లెలి పాత్రలే. ఆయన సరసన నటించే అవకాశం మాత్రం జయంతి కి రాలేదు. అక్కినేని అంటే ఆమె కుటుంబ సభ్యులకు చాలా ఇష్టం. ఆమె తమ్ముడికి ఆయన పేరే పెట్టారు. అలాగే అక్కినేని కుటుంబ సభ్యులు కూడా జయంతిని ఎంతో ఇష్టపడేవారు. తర్వాత తరంలో ఆమె శోభన్ బాబు తో కలసి చాలా చిత్రాల్లో నటించారు. మాంగల్యం, శారద, జీవితం.. పేరు తెచ్చిన చిత్రాలు. దక్షిణాది లో టాప్ హీరోలు అందరితో నటించిన జయంతి కన్నడ రాజ్ కుమార్ తో దాదాపు 40 చిత్రాల్లో నటించారు. నటిగా కె.వి.రెడ్డి, కె.విశ్వనాధ్, కె.బాలచందర్ నటిగా తన ఉన్నతికి కారణమని, తాను నమ్ముకున్న వాళ్ళు మోసం చేసినా, అభిమానుల ఆదరభిమానాలే తనకు శ్రీరామరక్ష అనేవారు జయంతి.
అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్లు !
దక్షిణాది సినిమాల్లో జయంతి హవా కొనసాగింది. కన్నడ, తమిళ్, తెలుగులో అగ్రహీరోల సరసన అవకాశాలే దక్కాయి ఆమెకు. హిందీ, మరాఠీ భాషల్లోనూ నటించింది. రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డులు, నాలుగు కన్నడ ఉత్తమ నటి స్టేట్ అవార్డులు(మరో రెండు సపోర్టింగ్ రోల్స్‌కు కూడా) దక్కించుకుంది. అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్లు అందుకుంది. తెలుగులో ఎన్టీఆర్ సరసన జగదేక వీరుని కథ, కుల గౌరవం, కొండవీటి సింహాసనం, జస్టిస్ చౌదరిలో, కన్నడ దిగ్గజం డాక్టర్ రాజ్‌కుమార్ సరసన ఏకంగా 45 సినిమాల్లో నటించి రికార్డు నెలకొల్పింది. పుట్టన్నా కంగళ్, దొరై-భగవాన్, జెమినీ గణేశన్, ఎంజీఆర్ లాంటి వాళ్లతో నటించి ఎన్నో కల్ట్ క్లాసిక్స్ అందించారు.కొన్నేళ్లు విరామం తీసుకుని తిరిగి సపోర్టింగ్ రోల్స్‌తో అలరించారు.లీడ్ రోల్స్ అవకాశాలు తగ్గుతున్న టైంలో.. తల్లి పాత్రలకు సైతం ఆమె ముందుకు రావడం విశేషం. 2005-06లో డాక్టర్ రాజ్‌కుమార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకుందామె. 2017లో పద్మభూషణ్ డాక్టర్ సరోజా దేవీ నేషనల్ అవార్డు ఆమెకు దక్కింది.
రెండు విషయాలు కలిసి రాలేదు!… నటిగా రాణించిన జయంతికి జీవితంలో రెండు విషయాలు పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి. ఇంతకూ ఆమెకు కలిసి రాని విషయాలేంటో తెలుసా.. వివాహబంధం, రాజకీయాలు…వివాహం విషయానికి వస్తే..జయంతి మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. మొదటి భర్త నటుడు, దర్శకుడు పెకేటి శివరాం. ఆమె రెండో భర్త నిర్మాత బండారు గిరిబాబు. తనకంటే చిన్నవాడు, తన కొడుకు స్నేహితుడు రాజశేఖర్‌ను మూడో పెళ్లి చేసుకొన్నారు. ఈ పెళ్లి జరిగే నాటికి జయంతికి 34 ఏళ్లు, రాజశేఖర్ కు 22 ఏళ్లు. తన భర్త హీరోగా రెండు చిత్రాలు కూడా నిర్మించారామె. అలాగే భర్త రాజశేఖర్ నటించిన విజయ్ చిత్రానికి తనే దర్శకత్వం వహించారు జయంతి. అయితే పెళ్లయిన మూడేళ్లకు వీరిద్దరూ విడిపోయారు. ఇక రాజకీయాల విషయానికి వస్తే.. ఓసారి మాత్రమే జయంతి ఎన్నికల్లో పోటీ చేశారు. ఆమె రామకృష్ణ హెగ్డే నేతృత్వంలో లోక్ సత్తా పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసి ఓడి పోయారు.