‘ఫ్యామిలీమన్ 2’ వెబ్ సిరీస్ చూసినవారు.. దాని గురించి మాట్లాడాలి అంటే రాజీ పాత్రలో నటించిన సమంత గురించి మాత్రమే మాట్లాడుకోవాల్సి వుంటుంది. టెర్రరిస్ట్ గా మారిన యువతిగా సమంత ఆ పాత్రలో బ్రహ్మాండంగా ఒదిగిపోయింది. సమంత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి హీరోయిన్ గా, నటిగా ఎదుగుతూ వస్తోంది. ‘రంగస్థలం’ సినిమాలో డ్లీగామర్ పాత్ర పోషించిన తరువాత.. ‘ఓ బేబీ’, ‘మజిలీ’ సినిమాలతో మళ్లీ తనలోని నటనా వైవిధ్యాన్ని మరింతగా ప్రదర్శించింది. గుణశేఖర్ ‘శకుంతల’ కోసం వెదికితే సమంతనే కావాల్సి వచ్చింది. లేటెస్ట్ గా వెబ్ సిరీస్ ‘ఫ్యామిలీమన్ సీజన్ 2’ లో కీలక పాత్ర కూడా సమంతదే అయింది. సీజన్ వన్ చూసిన వారికి సీజన్ 2 లో కొత్తగా ఏముంది? అంటే..సీజన్ వన్ లో చూసిన పాత్రలు అన్నీ ప్రేక్షకులకు పరిచయమే. అందువల్ల కొత్తగా అనిపించింది ఏదయినా వుందీ అంటే అది సమంతనే.
శిక్షణ పొందిన పక్కా టెర్రరిస్ట్ పాత్రలో సమంత చక్కగా చేసింది. కరుడు కట్టిన సైనికురాలు,టెర్రరిస్ట్.. జీవితంలో దెబ్బతిని, కసితో టెర్రరిస్ట్ గా మారిన అమ్మాయిగా, జీవితంలో అన్ని రకాల దారుణాలు చూసిన యువతిగా సమంత ఆ పాత్రలో బ్రహ్మాండంగా ఒదిగిపోయింది. మేకప్ అన్నది కేవలం నటికి గెటప్ మాత్రమే తీసుకువస్తుంది. కానీ సమంత తన నటనతో ఆ మేకప్ కు తగినట్లు పూర్తిగా మారిపోయింది. చూపులు, బాడీ లాంగ్వేజ్, యాక్షన్ సీన్లు అన్నింటా సమంత గొప్పగా నటించింది. ఫ్యామిలీమన్ 2 చూసినవారు.. దాని గురించి మాట్లాడాలి అంటే సమంత గురించి మాత్రమే మాట్లాడుకోవాల్సి వుంటుంది.
ఈ పాత్ర కోసం చాలా హోం వర్క్ చేసా!… సమంత ‘ది ఫ్యామిలీ మేన్’ సీజన్-2లో రాజీ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఆమె తొలి ఓటీటీ చిత్రం ఇదే. సమంత రాజీ పాత్రపై ఇలా స్పందించింది… “రాజీ పాత్రను ఒప్పుకున్నప్పుడే అది సున్నితంగా, భావోద్వేగాలతో నిండి ఉండాలని… అప్పటి పోరాటాన్ని, మనుషుల మధ్య ద్వేషాన్ని, అణచివేత, దురాశను గుర్తుచేసేలా ఆ పాత్ర ఉండాలని నేను కోరుకున్నాను. మేం అలా చేయలేకపోతే చాలామంది వ్యక్తుల, మహిళల గుర్తింపు, స్వేచ్ఛను మేం కాలరాసినవాళ్లం అవుతాం”. తను పోషించిన రాజీ పాత్రలో చాలా ఘర్షణ ఉందని.. తనకు నటించడానికి చాలా స్కోప్ ఉందని భావించిన తర్వాతే ఓకే చెప్పానంటోంది సమంత.
“రాజీ పాత్ర కోసం చాలా హోం వర్క్ చేశాను. తమిళ ఈలం పోరాటాలకు సంబంధించి చాలా డాక్యుమెంటరీలు చూశాను. ఎన్నో కథనాలు చదివాను. మరీ ముఖ్యంగా అప్పటి మహిళల బాధల్ని అర్థం చేసుకున్నాను. యూనిట్ కు చెందిన క్రియేటివ్ టీమ్ నాకు ఇవన్నీ ఎప్పటికప్పుడు పంపించేవారు. తమిళ ఈలం కష్టాలు చూసిన తర్వాత నాకు మాటలు రాలేదు. నా బాధను మాటల్లో చెప్పలేను.” ‘ది ఫ్యామిలీ మేన్ సీజన్-2’లో తన పాత్రకు వచ్చిన గుర్తింపుకు చాలా సంతోషిస్తోంది సమంత. మంచి కథలు, పాత్రలు ఎంపిక చేసుకోవడానికి రాజీ పాత్ర తనకు స్ఫూర్తినిచ్చిందని అంటోంది. అయితే ఈ పాత్రకు సంబంధించి సిరీస్ స్ట్రీమింగ్ కు ముందు చాలా వివాదం కొనసాగింది. తమిళనాట సీజన్-2ను బ్యాన్ చేయాలంటూ ఆందోళన జరిగింది.