“మేము భద్రంగానే ఉన్నామనే భావన ప్రజల్లో ఎప్పుడైతే కలుగుతుందో.. అప్పుడే మన పాత రోజులు వచ్చినట్లుగా నేను భావిస్తాను. కరోనాతో ఎలా జీవించాలో నేర్చుకోవాలి. పరిస్థితులు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవాలి. మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం వంటి వాటిని మన అలవాట్లుగా మార్చుకోవాలి. ఇప్పుడున్న కరోనా పరిస్థితులు తగ్గడానికి మరికొంత సమయం పట్టొచ్చు. ప్రభుత్వ నియమాలను, వైద్యుల సూచనలను పాటించడం, సామాజిక దూరం..ఇవే కరోనా నియంత్రణ మార్గాలు”…అని చెబుతోంది ఇటీవల కరోన బారిన పడి లేచిన అందాల నటి పూజా హెగ్డే. ‘ అల వైకుంఠపురములో’ తర్వాత ఈ బుట్టబొమ్మ రేంజ్ మారిపోయింది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఆమెకు భారీ ఆఫర్లు వస్తున్నాయి. అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో పాటు చిరంజీవి ‘ఆచార్య’లో రామ్‌చరణ్ సరసన నటిస్తోంది. అలాగే ప్రభాస్‌తో పాన్ ఇండియా మూవీ ‘రాధే శ్యామ్’లోనూ ఈమే హీరోయిన్. వీటితో పాటు సల్మాన్ ఖాన్ సరసన ‘కభీ ఈద్ కభీ దీవాళీ’ సినిమాలో నటిస్తోంది. రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘సర్కస్’ సినిమాతో పాటు.. ‘దళపతి’ విజయ్ 65 సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.
“ఈ ఏడాది ఈద్‌కు సల్మాన్‌ఖాన్‌తో నేను నటించాల్సిన ‘కభీ ఈద్… కభీ దీవాలి’ సినిమా విడుదల కావాల్సింది. కానీ కరోనా అన్నింటినీ తారుమారు చేసింది. కోవిడ్ వల్ల ఏర్పడిన పరిస్థితుల కారణంగా ఈ సినిమా షూటింగ్ ఇంకా ఆరంభం కాలేదు. సల్మాన్‌ఖాన్‌తో కలిసి నటించడానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఇది ఒక ఫన్ ఫిల్మ్. సినిమా చూస్తున్నంతసేపూ ప్రేక్షకులు తప్పకుండా నవ్వుతారు. అలాగే సల్మాన్ స్టైల్ ఆఫ్ యాక్షన్ కూడా సినిమాలో ఉంటుంది.
సౌత్‌లో ఈ ఏడాది జనవరిలో చాలా సినిమాలు విడుదలయ్యాయి. సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్స్‌కు వచ్చారు. నాకు చాలా సంతోషం అనిపించింది. సౌత్‌లో తమ అభిమాన తారల సినిమాలను ప్రేక్షకులు బాగా ప్రేమిస్తారు. కరోనా ప్రభావం లేకపోయినట్లయితే.. నా సినిమాలు కొన్ని ఈ ఏడాది విడుదలయ్యేవి. ప్రస్తుత పరిస్థితుల్లో షూటింగ్స్ సాధ్యపడటం లేదు. ఇది దురదృష్టకరం. త్వరలోనే పరిస్థితులన్నీ చక్కబడాలి. సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు భయం లేకుండా థియేటర్స్‌కు రావాలి”…అని చెప్పింది పూజా హెగ్డే.
‘పాన్ ఇండియా స్టార్’ ప్రభాస్ ప్రశంసలు… ప్రభాస్ పూజా హెగ్డేను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారట. కారణమేంటో తెలుసా? వివరాల్లోకెళ్తే.. ప్రభాస్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘రాధేశ్యామ్’. పూజా హెగ్డే హీరోయిన్. ఇందులో ఈమె పాత్ర పేరు ప్రేరణ. వారం, పదిరోజుల షూటింగ్ మినహా సినిమా చిత్రీకరణ, దానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్గా ప్రభాస్ తన సన్నిహితులతో కలిసి ‘రాధేశ్యామ్’ ఫస్ట్ కాపీ చూశారట. సినిమా చాలా బాగా వచ్చిందని.. ముఖ్యంగా పూజా హెగ్డే తన పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకుందని తన సన్నిహితుల దగ్గర ఆమెను ప్రశంసలతో ముంచెత్తినట్లు సమాచారం.
పూజా పర్ఫార్మెన్స్ హైలెట్!… ‘రాధే శ్యామ్’లో పూజా హెగ్డే పాత్ర ప్రేరణ చాలా స్పెషల్ అని చిత్ర బృందం అంటున్నారు. ఈ సినిమా కథ పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని ముందు నుంచి అనుకుంటున్న సంగతి తెలిసిందే. విక్రమాదిత్య, ప్రేరణ పాత్రల్లో ప్రభాస్ – పూజా పర్ఫార్మెన్స్ హైలెట్‌గా నిలుస్తుందట. ముఖ్యంగా పూజా హెగ్డే ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నిటికంటే ‘రాధే శ్యామ్’లో పోషిస్తున్న ప్రేరణ పాత్ర ఆమె కెరీర్లోనే బెస్ట్‌గా నిలిచిపోతుందని మేకర్స్ చెబుతున్నారట. ఇప్పటి వరకు గ్లామర్ రోల్స్‌లో అలరించిన ఈమె మొదటిసారి నటనకు మంచి ఆస్కారం ఉన్న రోల్లో కనిపించబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ‘బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్’, ప్రచార చిత్రాలు సినిమా మీద భారీ స్థాయిలో అంచనాలు పెంచాయి. దీనికి రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
30 లక్షల నుంచి 3 కోట్లు… పూజా హెగ్డే.. టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా దూసుకెళ్తూ రెమ్యునరేషన్ కూడా అంతే వేగంగా పెంచేసింది. ‘అల వైకుంఠపురము’కు రూ.1.4 కోట్లు తీసుకున్న పూజ.. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 3 కోట్ల వరకు వసూలు చేస్తోందట. ప్రస్తుతం సౌత్‌లో రెమ్యునరేషన్ విషయంలో నయనతారతో పోటీ పడుతున్న ఈ భామ.. తొలి సంపాదన ఎంతో తెలిస్తే షాకవుతారు.
జీవా హీరోగా ‘మూగముడి’ సినిమాలో పూజా తొలిసారి హీరోయిన్గా నటించింది. అంతకు ముందు మోడల్‌గా పనిచేసిన పూజా హెగ్డే.. ఈ సినిమా కోసం రూ. 30 లక్షల పారితోషకం తీసుకుందట. అలా తొలిసారి వచ్చిన సంపాదనతో పూజా హెగ్డే బీఎమ్డబ్లూ్య5 (BMW5) సిరీస్ బ్యూ స్టోన్ సిల్లర్ కలర్ కారును కొనుగోలు చేసిందంట. ఇప్పటికే ఈ కారు పూజా హెగ్డే దగ్గర ఉంది. తొలిసారి తన సంపాదనతో కొన్న ఆ కారును పూజా హెగ్డే ఎంతో అపురూపంగా చూసుకుంటుందట. ఇక తనకు వచ్చిన డబ్బును దుబారాగా ఖర్చు చేయకుండా.. వెంటనే తీసుకెళ్లి వాళ్ల అమ్మ చేతిలో పెట్టేస్తుందట. ఆ డబ్బుతో ఏం చేయాలనే నిర్ణయం వాళ్ల అమ్మదేనట.