ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిటయ్యారు. అన్నీ భారీ బడ్జెట్ సినిమాలే. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోవడంతో భారీ ఖర్చు పెట్టి సినిమాలు చేసేందుకు ముందుకొస్తున్నారు నిర్మాతలు. ఈ క్రమంలో ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందనున్న కొత్త సినిమా ‘ఆది పురుష్’. ఎపిక్ పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ మూవీ ప్రభాస్ కెరీర్లో 22వ సినిమా. ఈ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అతి త్వరలో ప్రభాస్ ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనున్నారట.
ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపించనుండటం విశేషం. ఇక ఈ భారీ సినిమాలో ప్రభాస్ జోడీగా బ్యూటీ కృతి సనన్ నటించనుందని సమాచారం. ఇక ఈ భారీ సినిమాలో ప్రభాస్‌తో తలపడబోయే స్టార్ సైఫ్ అలీఖాన్ అని ఇప్పటికే ప్రకటించింది చిత్రయూనిట్. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా కనిపించనున్నారు.
కాగా ఈ మూవీలో మరో ముఖ్యపాత్ర కోసం బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్‌ని తీసుకున్నారని తెలుస్తోంది. ఆమె సైఫ్ అలీ ఖాన్‌కు జోడీగా నటించే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రచారం జరుగుతోంది. కాజోల్ రోల్ సినిమాకే మేజర్ అట్రాక్షన్ అవుతుందని బాలీవుడ్ వర్గాల మాట. అదేవిధంగా లక్ష్మణుడి పాత్ర కోసం మరో బాలీవుడ్ స్టార్ సన్నీ సింగ్‌ని ఫైనల్ చేశారని తెలుస్తోంది.ఐదు భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.