“లిక్కర్ తీసుకుని ఓటు వేసే వారికి ఓటు హక్కు ఉండకూడదు.పేద వాళ్లకు, డబ్బున్న వాళ్లకు ఓటు హక్కు ఉండకూడదు. కేవలం మధ్య తరగతి వారికి మాత్రమే ఓటు హక్కు ఉండాల”ని విజయ్ దేవరకొండ అంటున్నాడు. విజయ్ దేవరకొండకు దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. యువతలో విజయ్ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం విజయ్.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో `ఫైటర్` అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ప్రముఖ ఫిలిం క్రిటిక్స్ భరద్వాజ్ రంగన్, అనుపమ చోప్రాలతో జరిగిన చిట్‌చాట్‌లో.. రాబోయే రోజుల్లో మీరు ఏదైనా రాజకీయ పార్టీలో చేరతారా? అని విజయ్ను ప్రశ్నించారు. దీనిపై స్పందించిన విజయ్ దేవరకొండ ఓటు హక్కుపై సంచలన వ్యాఖ్యలు చేసాడు…
“నాకు రాజకీయాలు చేసేంత ఓపికలేదని.. అసలు మన రాజకీయ వ్యవస్థే అర్థం పర్థం లేకుండా ఉందని విజయ్ పేర్కొన్నాడు. అలాగే ఓటు వేసే హక్కును అందరికీ ఇవ్వకూడదని అభిప్రాయపడ్డాడు.తన ఓటు విలువేంటో తెలియని వాళ్లకు ఓటు హక్కు ఎందుకని విజయ్ అభిప్రాయపడ్డాడు. పేద వాళ్లకు,డబ్బున్న వాళ్లకు ఓటు హక్కు ఉండకూడదని.. కేవలం మధ్య తరగతి వారికి మాత్రమే ఓటు హక్కు ఉండాలని అన్నాడు. అలాగే లిక్కర్ తీసుకుని ఓటు వేసే వారికి ఓటు హక్కు ఉండకూడదన్నాడు. `ఒక విమానం నడిపే పైలట్‌ని దానిలోకి ఎక్కే 300 మంది ప్రయాణికులు ఓట్లు వేసి ఎన్నుకోరు కదా..! అలాగే సమాజాన్ని నడిపే బాధ్యతను పూర్తి అవగాహన ఉన్న నాయకుడి చేతిలో పెట్టాలి. అంతే తప్ప అందరికి ఓటు హక్కు కల్పించకూడదు. మన సమాజంలో మార్పు రావాలంటే నియంతృత్వమే తప్పనిసరి. నేను నియంతగా ఉండటానికే ఇష్టపడతా! మార్పు తీసుకురావాలంటే ఇదే మార్గం. అయితే మంచి నియంత ఉన్నప్పుడే ప్రజలందరికీ మంచి జరుగుతుంది” అని అన్నాడు. విజయ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. విజయ్ వ్యాఖ్యలు నియంతృత్వాన్ని సమర్థించే విధంగా ఉన్నాయని కొందరు విమర్శిస్తుండగా, మరికొందరు అతన్ని సమర్ధిస్తున్నారు.
“ఇది నా తరహా కమర్షియల్ సినిమాగా తయారవుతోంది. మామూలుగా మనం చూసే రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్ కాదు. ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు, కమర్షియల్ జానర్లోకి వచ్చే ఇలాంటి సినిమానే చెయ్యాలనుకున్నాను. కమర్షియల్ సెన్సిబిలిటీస్‌కు పేరుపొందిన పూరి జగన్నాథ్ డైరెక్టర్ కావడంతో ఈ ఫిల్మ్‌కు మరింత కమర్షియల్ మద్దతు లభించింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ నా ఫేవరేట్ డైరెక్టర్. ఆయన తీసిన వాటిలో ‘పోకిరి’ నా ఫేవరేట్ ఫిల్మ్ అన్నాడు విజయ్. అతి త్వరలో షూటింగ్ పునఃప్రారంభం కానున్న ఈ చిత్రంతో బాలీవుడ్ తార అనన్యా పాండే (నటుడు చంకీ పాండే కుమార్తె) హీరోయిన్. చార్మీ కౌర్, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.